Begin typing your search above and press return to search.

యాదాద్రి కాదు.. యాదగిరిగుట్ట.. రేవంత్ సంచలన నిర్ణయం

నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆలయాన్ని సందర్శించారు.

By:  Tupaki Desk   |   8 Nov 2024 10:04 AM GMT
యాదాద్రి కాదు.. యాదగిరిగుట్ట.. రేవంత్ సంచలన నిర్ణయం
X

ఏపీలో తిరుమల తిరుపతి దేవస్థానం వలే తెలంగాణ రాష్ట్రంలోనూ ఒక దేవాలయం సంకల్పించిన కేసీఆర్.. ఆ స్థాయిలోనే యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేశారు. అరెకరంలో ఉన్న దేవాలయాన్ని 4.03 ఎకరాలకు విస్తరించారు. ఆలయ నిర్మాణంతోపాటు ఇతర వనరులతోపాటు క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు వైటీడీఏ రూ.1200 కోట్లు ఖర్చు పెట్టింది. తెలంగాణ ఉద్యమం సమయంలోనే కేసీఆర్ 2007లో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని సందర్శించారు. ఆ సందర్భంలో ఆలయానికి విశ్వఖ్యాతి తీసుకొచ్చేలా పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

నాడు చెప్పిన విధంగానే రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక సీఎం హోదాలో 2014లో తన సంకల్పాన్ని వెల్లడించారు. ఆలయ అభివృద్ధి కోసం రూ.509 కోట్లు, టెంపుల్ సిటీ అభివృద్ధికి రూ.1,325 కోట్లు ఖర్చు చేశారు. యాదగిరిగుట్టను కాస్త యాదాద్రిగా నామకరణం చేశారు. ఆలయంలోపాటు టెంపుల్ సిటీ అభివృద్ధి, మంచినీటి సదుపాయం, కాటేజీల నిర్మాణం, రోడ్లు, సరస్సులు, ఉద్యానవనాలు, అభయారణ్యాలు, నిత్యాన్నదానసత్రాలు, కల్యాణ మండపాలు, వేదపాఠశాల, శిల్ప నిర్మాణ వంటి సంస్థలు ఏర్పటయ్యాయి. దీంతో యాదగిరిగుట్ట నరసింహస్వామి క్షేత్రం ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా గుర్తింపు సాధించింది. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిత్యం వేలాది మంది భక్తులు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటున్నారు.

కట్‌చేస్తే.. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి ఆశీస్సులు పొందారు. మూసీ ప్రక్షాళన నిర్ణయంలో భాగంగా ఈ రోజు పాదయాత్ర చేసేందుకు రేవంత్ అక్కడికి చేరుకున్నారు. అందులోభాగంగా ముందుగా స్వామి వారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా యాదాద్రి ఆలయ అభివృద్ధిపై రేవంత్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు యాదాద్రిగా ఉన్న పేరును యాదగిరిగుట్టగా మార్చాలని ఆదేశాలు చేశారు. ఇక నుంచి యాదాద్రి కాస్త యాదగిరిగుట్ట అని ప్రకటించారు. రికార్డుల్లోనే అలానే కొనసాగించాలన్నారు. అలాగే.. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇక నుంచి యాదాద్రిని కాస్త మళ్లీ యాదగిరిగుట్టగానే పిలవబోతున్నాం.