Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డి నిర్ణయం.. ఏపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతుందా?

ఆంధ్రప్రదేశ్ లో రేట్లు పెంచుకోడానికి అనుమతిస్తే అది ప్రభుత్వంపై విమర్శలకు ఆస్కారం ఇచ్చినట్లే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   23 Dec 2024 7:37 AM GMT
రేవంత్ రెడ్డి నిర్ణయం.. ఏపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతుందా?
X

తెలంగాణ ప్రభుత్వం కొత్త సినిమాల బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లపై కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేసారు. తాను సీఎం పదవిలో ఉన్నన్ని రోజులు ఎలాంటి బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వనని అన్నారు. ఎంత పెద్ద హీరో అయినా, భారీ బడ్జెట్‌తో తీసినా బెనిఫిట్ షోలకు మాత్రం అనుమతి ఇవ్వబోమని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చిచెప్పారు. స్వాతంత్య్ర పోరాటానికి, తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన సినిమాల విషయంలో అలోచించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. దీంతో ఈ విషయం మీద ఏపీ ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకూ తెలుగు సినీ పరిశ్రమకు ఫేవర్ గా ఉంటూ వచ్చాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, సినిమాలకు బెనిఫిట్ షోల అనుమతి లభిస్తోంది. టికెట్ ధరల పెంపుపై సానుకూలంగా స్పందిస్తూ వస్తోంది. ఇటీవల కాలంలో వచ్చిన 'కల్కి' 'దేవర' 'పుష్ప 2' లాంటి పెద్ద సినిమాలకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టికెట్ రేట్లు పెంచుకునేందుకు, బెనిఫిట్ షోలకు రెండు ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. అయితే 'పుష్ప 2' ప్రీమియర్ షో సమయంలో హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న ఘటన, తదనంతర పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వం ఇకపై బెనిఫిట్ షోలు, స్పెషల్ టికెట్ రేట్లు ఉండవని ప్రకటించింది. ఇది పరోక్షంగా ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

'పుష్ప 2' సినిమాకి భారీగా టికెట్ రేట్లు పెంచుకోడానికి పర్మిషన్ ఇవ్వడంతో, సామాన్య ప్రజానీకానికి సినీ వినోదం అందుబాటులో లేకుండా చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. అయితే తెలంగాణాలో బెనిఫిట్ షోలు బ్యాన్ చేస్తున్నారనే విషయాన్ని పక్కన పెడితే, టికెట్ రేట్ల పెంపుపై ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సామాన్యుల నుంచి మద్దతు లభిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో సామాన్యులకు అందుబాటులో ఉండేలా సినిమా టికెట్ ధరలు ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ లో రేట్లు పెంచుకోడానికి అనుమతిస్తే అది ప్రభుత్వంపై విమర్శలకు ఆస్కారం ఇచ్చినట్లే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా ముందుకు వెళ్తారో అనే చర్చలు జరుగుతున్నాయి.

సంక్రాంతికి టాలీవుడ్ లో పలు పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి. రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్', నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్', వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాలు పెద్ద పండక్కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వీటికి తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ షోలకు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వకపోతే ఓపెనింగ్ కలెక్షన్స్ మీద ప్రభావం పడే అవకాశం ఉంది. బెనిఫిట్ షోస్ రద్దు, టికెట్ రేట్లు పెంపు లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం అందుతోంది.

మరోవైపు దిల్ రాజు సినిమాలకు టికెట్ హైక్స్, బెనిఫిట్ షోస్ ఇస్తే తమకు కూడా ఇస్తారని సితార నిర్మాత సూర్యదేవర నాగవంశీ అంటున్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌ దిల్ రాజు నిర్మించిన 'గేమ్ ఛేంజర్', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. నాగవంశీ నిర్మించిన 'డాకు మహారాజ్' కూడా అదే సీజన్ లో షెడ్యూల్ చేయబడింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో దిల్ రాజు సినిమాలకు టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు ఇస్తే తమకు కూడా ఇస్తారని నాగవంశీ వ్యాఖ్యానించారు.

అయితే ఏపీలో సినీ ఇండస్ట్రీకి తప్పకుండా ప్రత్యేక రాయితీలు ఉంటాయని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేసారు. ''ప్రభుత్వం వైపు నుంచి ఇండస్ట్రీకి ఫుల్ సపోర్ట్ ఉంటుందని అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ మీటింగ్ లోనే పవన్ కల్యాణ్ చెప్పారు. అప్పటి నుంచి రిలీజైన సినిమాలన్నిటికీ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ ఎప్పుడూ అలానే ఉంటుందని ఆశిస్తున్నాం'' అని తాజాగా 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగవంశీ అన్నారు. మరి టికెట్ హైక్స్, బెనిఫిట్ షోల విషయంలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తర్వాత, ఏపీ ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందో వేచి చూడాలి.