రేవంత్‌రెడ్డికి బంపర్ ఆఫర్.. కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలు
తెలంగాణలో తాము ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి సక్రమంగా అమలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తోంది.
By: Tupaki Desk | 22 Jan 2025 9:58 AM GMTఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలైన బిజెపి, ఆప్, కాంగ్రెస్ పార్టీలు కీలక హామీలు ఇస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రధాన పార్టీలు హామీలను ఇవ్వడమే కాకుండా వాటిని ప్రజలు నమ్మేలా చేయడం కూడా ఆ పార్టీ నాయకులపైనే ఉంటుంది.
ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడానికి అన్ని పార్టీల నాయకులు హామీలను ఇస్తారు. అయితే.. ఏ నాయకుడు చెప్పిన మాటలు ప్రజల్లోకి వేగంగా వెళుతున్నాయి, ఎవరు చెప్పిన మాటలను ప్రజలు నమ్ముతున్నారు అన్నదాన్ని బట్టి ఓట్లు పడి అధికారం దక్కుతుంది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా కీలక హామీలను ఇచ్చింది. ఆ హామీలను ప్రజలు నమ్మేలా చేయడంలో రేవంత్ రెడ్డి అప్పట్లో సఫలం అయ్యారు. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించింది.
అధికారాన్ని చేపట్టిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీలను అమలు చేయడంపై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. తెలంగాణలో తాము ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి సక్రమంగా అమలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం వద్ద మంచి పేరు ఉంది. తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత తొలిసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడంతోపాటు.. ఇచ్చిన కీలక హామీలను అమలు చేస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. తెలంగాణ ప్రజలు కూడా కాంగ్రెస్ పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డిని తమకు ఆత్మీయ నేతల్లో ఒకరిగా రాహుల్ గాంధీ భావిస్తున్నారు. అందుకే దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా రేవంత్ రెడ్డికి కీలక బాధ్యతలను అప్పగిస్తున్నారు. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో రేవంత్ రెడ్డి ఉంటున్నారు.
గతంలో జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లోను ఆయన వెళ్లి ప్రచారం చేశారు. ప్రియాంక గాంధీ పోటీ చేసిన వయనాడ్ కు వెళ్లి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ఎన్నికలకు కూడా రేవంత్ రెడ్డిని స్టార్ క్యాంపైనర్ల జాబితాలో కాంగ్రెస్ పార్టీ చేర్చింది. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలను ఇస్తోంది. అయితే ఈ హామీలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంతోపాటు పార్టీని ఆదరించేలా చూడాల్సిన బాధ్యతను రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అప్పగించింది. తెలంగాణలో తాము ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తున్నామో ఇక్కడ ప్రజలకి తెలియజేసే బాధ్యతను రేవంత్ రెడ్డి భుజాన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం మోపింది. అంటే ఒకరకంగా ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలను ప్రజలు అర్థం చేసుకునేలా చేసే బాధ్యత రేవంత్ రెడ్డిది.
ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి అక్కడ నుంచి వచ్చిన వెంటనే ఢిల్లీ ప్రచారంలో పాల్గొంటారు. ఈ ప్రచారంలో భాగంగా తాము తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తున్నది ప్రజలకు వివరించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారంలోకి వస్తే ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని, ఇందుకు తమ రాష్ట్రమే ఉదాహరణగా ఆయన ప్రజలకు వివరించనన్నారు. తమ అమలు చేస్తున్న పథకాల వల్ల ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో అన్న విషయాలను రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రజలకు తెలియజేయనున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడంలో రేవంత్ రెడ్డి పాత్ర చాలా కీలకంగా మారనుంది. మరి ఢిల్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో ఫలితాలు తర్వాతే తెలుస్తుంది.