ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీఎం రేవంత్ సంచలనం
సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్.
By: Tupaki Desk | 25 Feb 2025 4:58 AM GMTసంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు ఎందుకు చేయట్లేదంటే కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు బదులిచ్చే క్రమంలో సంచలన ఆరోపణలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రధారులైన ప్రభాకర్ రావు.. శ్రవణ్ రావులను కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయే దాచి పెట్టారన్న రేవంత్ .. ‘‘వారిని దేశానికి రప్పించాలని నేను స్వయంగా కేంద్రానికి లేఖ రాశా. అయినా పట్టించుకోలేదు బండి సంజయ్. ఇక్కడేమో కేసీఆర్.. కేటీఆర్ లను ఎందుకు అరెస్టు చేయటం లేదని మాపై విమర్శలు చేస్తున్నారు. అమెరికాలో దాక్కున్న వాళ్లను దేశానికి రప్పిస్తే 24 గంటల్లోనే అరెస్టు చేసి జైల్లో వేస్తాం’ అంటూ కొత్త సంచలనానికి తెర తీశారు సీఎం రేవంత్.
మెదక్ -నిజామాబాద్ - అదిలాబాద్ - కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం వేర్వేరు వేదికల మీద మాట్లాడారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ - బీజేపీని టార్గెట్ చేసిన ముఖ్యమంత్రి సీరియస్ కామెంట్లు చేశారు. ఫోన్ ట్యాపింగ్.. ఈ-కారు రేస్.. గొర్రెల పంపిణీ పథకాలపై కేసులను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ ను బీజేపీ బెదిరిస్తున్నది నిజం కాదా? అంటూ ప్రశ్నించారు.
బీజేపీ బెదిరింపులతో ఢిల్లీ వెళ్లి.. ఆ పార్టీ నేతలతో చీకటి ఒప్పందాలు చేసుకున్నది నిజామా? కాదా? బీఆర్ఎస్ చెప్పాలన్నారు. స్కాంలపై తాము కేసులు పెడితే.. మధ్యలో దూరి ఫైళ్లను తమతో తీసుకెళ్లిపోతోంది ఈడీ అంటూ మండిపడ్డారు. ఫైళ్లను తీసుకెళ్లిన ఈడీ.. కేటీఆర్ ను ఎందుకు అరెస్టు చేయటం లేదో చెప్పాలని ప్రశ్నించారు. ‘బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజాప్రతినిధులు పార్టీలు మారినప్పుడు రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయి? ఇప్పుడూ అవే కోర్టులు.. అదే స్పీకర్ వ్యవస్థ ఉన్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పోటీ చేయటం లేదు? ఈ నెల 27న జరిగే ఎన్నికల్లో పట్టభద్రులైన కేసీఆర్.. కేటీఆరర్. కవిత.. హరీశ్ రావులు ఏ పార్టీకి ఓటు వేస్తారో చెప్పాలి’’ అంటూ ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలకు అనుమతులు.. నిధులు రాకుండా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శకునిలా అడ్డుపడుతున్నట్లుగా పేర్కొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ‘2014-19లో ఎంపీగా పని చేసిన నాకు.. పలువురు కేంద్ర మంత్రులు.. కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయి. వారే నా చెవిలో ఈ విషయాన్ని చెప్పారు. బీజేపీ రాష్ట అధ్యక్షుడిగా.. బీసీ నాయకుడిగా క్రమశిక్షణతో ఉన్న బండి సంజయ్ సీటును కిషన్ రెడ్డి లాక్కున్నారు. బండారు దత్తాత్రేయ నియోజకవర్గమైన సికింద్రాబాద్ సీటును తీసుకున్నారు. అదే మా పార్టీలో పీసీసీ అధ్యక్షుడి స్థానాన్ని బీసీ బిడ్డకు కట్టబెట్టాం. రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి రూపాయి వెళితే.. తెలంగాణకు 42 పైసలే తిరిగి వస్తోంది. అదే బిమార్ కు అయితే రూ.7.06, ఉత్తరప్రదేశ్ కు రూ.3.5 ఎందుకు ఇస్తున్నట్లు? మా మీద ఎందుకు వివక్ష చూపిస్తున్నారు’ అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆయన వ్యాఖ్యల మీద కేంద్రం కానీ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.