రేవంత్ కూడా కేసీఆర్ బాటలోనే.. కుల గణన కుంపట్లు!
తెలంగాణ రాష్ట్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయం లెక్క తేల్చేందుకు తద్వారా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేందుకు ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
By: Tupaki Desk | 3 Nov 2024 9:30 AM GMTపరిపాలన నిర్ణయాలను రాజకీయాలు ప్రభావితం చేయడం అనే దశ ఎప్పుడో దాటిపోయి...రాజకీయమే పరిపాలనను నిర్ణయించే స్థాయికి చేరింది అనేది ప్రస్తుతం తప్పకుండా అంగీకరించాల్సిన బాధాకరమైన పరిస్థితి. అయితే, నాయకులు తమ రాజకీయ లెక్కల మాటున కొద్దోగొప్పో ప్రజా సంక్షేమ నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా కాదనలేని వాస్తవం. ఇలాంటి పరిస్థితుల మధ్య తాజాగా తెలంగాణ కుల, ఆర్థిక, సామాజిక గణన అంశం చర్చనీయాంశంగా మారింది. మొత్తం 75 ప్రశ్నలతో రూపొందించిన ఫార్మాట్ లో సమగ్ర సమాచారాన్ని నమోదు చేసేందుకు నవంబర్ 6 నుంచి 20 రోజులపాటు అధికారులు సర్వే చేపట్టనున్నారు. అయితే, దీనిపై ఇప్పుడు దీనిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
తెలంగాణ రాష్ట్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయం లెక్క తేల్చేందుకు తద్వారా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేందుకు ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కులం, మతం, ఆస్తి, అప్పులకు సంబంధించి 75 ప్రశ్నలతో రూపొందించిన ఫార్మాట్ లో సమగ్ర సమాచారాన్ని స్వీకరించనున్నారు. అదే సమయంలో, తప్పుడు సమాచారం ఇస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను నవంబర్ 6 నుంచి 20 రోజులపాటు అధికారులు సర్వే చేపట్టనున్నారు. తెలంగాణలో జరిగే ఈ సర్వే నేపథ్యంలో ఇప్పుడు పలువురు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను గుర్తుకు చేసుకుంటున్నారు.
ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే పేరుతో అన్ని వివరాలు సేకరించారు. ఈ సర్వే ఆధారంగానే ప్రజలకు ప్రయోజనాలు దక్కుతాయని ప్రకటించారు. దీంతో ఏకంగా పొరుగు రాష్ట్రాల్లో ఉద్యోగ, ఉపాధి సహా వివిధ కారణాల వల్ల నివసిస్తున్న ప్రజలు కూడా వచ్చి తమ వివరాలు నమోదు చేసుకున్నారు. అయితే, చిత్రంగా ఆ సర్వే వివరాలను పదవి దిగిపోయే వరకు కూడా.. కేసీఆర్ బయటపెట్టలేదు. సరికదా... వాటితో చేసిన ప్రజాపయోగ నిర్ణయాలు ఏంటో... ఎవరికీ అంతు చిక్కలేదు. ఇదే సమయంలో... కేసీఆర్ తన సొంత ఆలోచనల కోసం... ఈ వివరాలను వాడుకున్నారనే అపవాదును కూడా మూటగట్టుకుననారు.
ఇక తాజాగా తెలంగాణలో చేపట్టనున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయం లెక్క తేల్చేందుకు చేపడుతున్న సర్వే విషయంలోనూ... ప్రభుత్వం ఏం చేయనుందనే ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ విషయంలో.. రాజకీయ వేడి రాజుకుంది. సర్వేపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటోలు ఎందుకు? అనే ప్రశ్నలు ఆయా పార్టీలు సంధిస్తున్నాయి.ఇదిలాఉంచితే, ఈ సర్వే విజయవంతం అయిన తర్వాత...ఈ ఫలితాలను ప్రజలకు అందించకుండా, విధానపరమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే... కేసీఆర్‌తో రేవంత్ ను పోల్చడం ఖాయమని అంటున్నారు.