కేసీఆర్ ఫార్ములాను భలే కాపీ కొడుతున్నావ్ రేవంత్
కేసీఆర్ ఫార్ములాను కాపీ కొట్టాలని రేవంత్ చూస్తున్నట్లుగా పరిణామాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ చర్చ జరుగుతోంది.
By: Tupaki Desk | 15 Nov 2024 2:30 PM GMTరాజకీయ నాయకులకు తమ ప్రత్యర్థుల విషయంలో విబేధాలు, విమర్శ పూర్వక పరిచయాలు ఉన్నప్పటికీ, `రాజకీయ లెక్కలు` విషయంలో మాత్రం వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తుంటారు అనేది తెలిసిన సంగతే. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలోనే నడిచేందుకు సిద్ధమైన గెలుపు మాత్రాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తుండటం, కేసీఆర్ ఫార్ములాను కాపీ కొట్టాలని రేవంత్ చూస్తున్నట్లుగా పరిణామాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ చర్చ జరుగుతోంది.
గులాబీ దళపతి కేసీఆర్ తెలంగాణ సీఎం గా ఉన్న సమయంలో అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు మరియు నిర్ణయాలు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన తీసుకున్న నిర్ణయాలు అనేకం ఎన్నికలతో ముడిపడి ఉండేవి. రైతుబంధు లాంటి కొన్ని ఆకర్షణీయ పథకాల విషయంలోనైతే తెల్లవారుతుండగా ఎన్నికలు లేదా మరుసటి రోజు ఓటు వేయడం అనే సందర్భాల్లో లబ్దిదారుల బ్యాంకు అకౌంట్లో డబ్బులు జమవుతుండేవి! దీంతో సహజంగానే వారి ఓట్లు కారు గుర్తుకు పడటానికి ఎక్కువ అవకాశం ఉండింది. సరిగ్గా ఇదే ఫార్ములాను రేవంత్ ఫాలో అవుతున్నారు.
రేవంత రెడ్డి సర్కార్ తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త తెలిపింది. బ్యాంకుల నుంచి మహిళా స్వయం సహాయక సంఘాలు తీసుకున్న వడ్డీ లేని రుణాలను రాష్ట్రప్రభుత్వం విడుదల చేసింది. గత ఫిబ్రవరి, మార్చి నెలలకి సంబంధించిన మొత్తం వడ్డీ రూ.30.70 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. త్వరలో ఈ డబ్బులు మహిళా సంఘాల ఖాతాల్లో జమ కానున్నాయి. ఇక్కడ త్వరలోనే అన్న పాయింట్ చాలా కీలకం!
తెలంగాణలో ఓ వైపు కులగణన జరుగుతున్న సంగతి తెలిసిందే. మరో వైపు స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ సన్నద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలోనే మహిళలకు ఇంత పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూర్చడం ద్వారా వారి ఓట్లను తమ పార్టీ వైపు ఆకర్షించుకునేలా రేవంత్ రెడ్డి చేస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహిళల నిధులకు సంబంధించి బ్యాంకు ఖాతాలో డబ్బులు పడటం, ఎన్నికల షెడ్యూల్ సమీపిస్తుండటం ఒకేసారి జరిగితే రేవంత్ స్కెచ్ వర్క్ అవుట్ కాక తప్పదని అంచనాలు వినబడుతున్నాయి. మొత్తంగా ఓట్ల లాజిక్ పట్టుకొని కేసీఆర్ లాగే... రేవంత్ మ్యాజిక్ చేయవచ్చని అంచనాలు వేస్తున్నారు.