కేబీఆర్ చుట్టూ ‘7’ ఫ్లైఓవర్లు.. ‘7’ సొరంగ మార్గాలు
హైదరాబాద్ లో ఉన్న వారికే కాదు..ఈ మహానగరంతో పరిచయమైన అందరికి తెలిసిన పేర్లలో ముఖ్యమైనది కేబీఆర్ పార్కు.
By: Tupaki Desk | 5 Oct 2024 6:25 AM GMTహైదరాబాద్ లో ఉన్న వారికే కాదు..ఈ మహానగరంతో పరిచయమైన అందరికి తెలిసిన పేర్లలో ముఖ్యమైనది కేబీఆర్ పార్కు. నగరం నడిబొడ్డున ఉండే ఈ పార్కు అందాలన్ని ఒక ఎత్తు. కాంక్రీట్ జంగిల్ లాంటి నగరం మధ్యలో ఇంత భారీ పార్కు ఉండటం.. వాకింగ్ కోసం వచ్చే వారు ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. గడిచిన కొన్నేళ్లలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా ఈ ప్రాంతం మొత్తం వాహనాలమయంగా మారింది. భారీగా పెరిగిన రద్దీతో ఈ వైపు నుంచి వెళ్లే ప్రాంతాలన్నీ తరచూ జాం అయిపోతూ ఉంటాయి. ఈ సమస్యల పరిష్కారానికి సరికొత్త ప్లాన్ ను తెర మీదకు తీసుకొచ్చింది రేవంత్ ప్రభుత్వం.
కేబీఆర్ పార్కు చుట్టూ ఏడు ఫ్లైఓవర్లు.. మరో ఏడు సొరంగ మార్గాలతో అక్కడి పరిసర ప్రాంతాల్ని పూర్తిగా మార్చేయాలన్న పట్టుదలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ మధ్యనే తెర మీదకు వచ్చిన ఈ ప్రపోజల్ ను కార్యరూపం దాల్చేందుకు వీలుగా తాజాగా నిర్మాణాలకు ఓకే చెప్పేసింది. తాజాగా పురపాలక శాఖ పాలనాపరమైన అనుమతుల్ని ఇస్తూ ఉత్తర్వుల్ని జారీ చేసింది. దీంతో.. కేబీఆర్ పార్కు చుట్టూ పరిసరాలు కొత్త రూపును సంతరించుకోనున్నాయి.
హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ ఫర్మేటివ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (హెచ్ సిటీ) ఆధ్వర్యంలో చేపట్టే ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను ఈ ఆర్థిక సంవత్సరంలోనే మంజూరు చేయటం చూస్తే.. ఈ ప్రాజెక్టు పూర్తిపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని చెప్పాలి. దాదాపు రూ.826 కోట్ల అంచనాతో ఈ పనుల్ని రెండు ప్యాకేజీలతో విభజించారు. మొదటి ప్యాకేజీలో జూబ్లీహిల్స్ చెక్ పోర్టు.. కేబీఆర్ పార్కు ఎంట్రన్స్.. ముగ్ధ కూడళ్ల వద్ద.. రెండో దశలో మరో రూ.401 కోట్లతో నిర్మాణాలకు ప్రతిపాదనలు చేశారు.
రెండో దశలో రోడ్ నెంబరు.45, ఫిలింనగర్.. మహారాజ అగ్రసేన్.. క్యాన్సర్ ఆసుపత్రి.. కేబీఆర్ పార్కు వద్ద ఫ్లైఓవర్లు.. అండర్ గ్రౌండ్ సొరంగాల్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనల్ని రూపొందించారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే.. కేబీఆర్ చుట్టు పక్కల ట్రాఫిక్ స్వరూపం పూర్తిగా మారిపోతుందని చెబుతున్నారు. తాజా ప్రతిపాదనల్లో సొరంగ మార్గాల్లో వర్షపు నీరు నిలవకుండా ఉండేందుకు ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. అయితే.. ఈ ప్రాజెక్టకు వ్యతిరేకంగా కొందరు ఆసక్తికర వాదనను వినిపిస్తున్నారు.
ఈ ప్రాజెక్టు కారణంగా కేబీఆర్ పార్కు మీద ప్రభావం చూపుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్మాణాల కారణంగా పర్యావరణం దెబ్బ తింటుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కొందరు ఇప్పటికే ఎన్జీటీని ఆశ్రయించారు. దీంతో ఈ ప్లాన్ తరహాలోనే గతంలో ఒక ప్లాన్ ను సిద్ధం చేసినా ముందుకు అడుగు పడలేదు. అయితే.. ఈ ప్రాజెక్టకు మరికొన్ని మెరుగులు దిద్ది లేటెస్టుగా సీన్లోకి తీసుకొచ్చారు. మొత్తంగా ఏడు అండర్ పాస్ లు.. మరో ఏడు ఫ్లైఓవర్లతో అక్కడి స్వరూపం పూర్తిగా మారటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది.