అధికారులకు భారీ సెగ... హైడ్రా మరో సంచలన నిర్ణయం!
అక్రమ నిర్మాణం అని తేలితే విరుచుకుపడిపోతుంది. ఈ నేపథ్యంలో మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
By: Tupaki Desk | 29 Aug 2024 2:49 PM GMTఇప్పుడు తెలంగాణలో “హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్” (హైడ్రా) ఎంత హాట్ టాపిక్ అనేది తెలిసిన విషయమే. ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలు.. వ్యూహాత్మకంగా వాటి అమలుతో హైడ్రా సంచలనంగా మారింది. అక్రమ నిర్మాణం అని తేలితే విరుచుకుపడిపోతుంది. ఈ నేపథ్యంలో మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
అవును.. తెలంగాణలో అత్యంత హాట్ టాపిక్ గా మారిన హైడ్రా.. చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారికి సింహ స్వప్నంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... ఎఫ్.ఎల్.టీ పరిధిలో నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులకు సిద్ధమైంది.
ఇందులో భాగంగా... ఇలాంటి అనుమతులు ఇచ్చిన ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సైబరాబాద్ కమిషనర్ కు హైడ్రా సిఫారసు చేసింది. ఇదే సమయంలో హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీలో అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారుల లిస్ట్ ను ప్రిపేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి నగరంలో చాలా మంది చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన విషయం ప్రభుత్వాలకు, అధికారులకు తెలియంది కాదనే చెప్పాలి. అయితే ఈ విషయంలో అధికారుల అలసత్వమో.. లేక, మరేదైనా కారణమో కానీ అవిరామంగా అక్రమ నిర్మాణాలు హైదరాబాద్ లో జరిగాయని అంటుంటారు. అంటే.. ఈ పాపంలో అధికారులదీ భాగం ఉందన్నమాట!
దీంతో... అక్రమ నిర్మాణాలు చేపట్టినవారే కాదు.. నిబంధనలకు నీళ్లొదిలి వారికి సహకరించిన అధికారులపైనా హైడ్రా దృష్టి సారించింది. ఆయా ప్రాంతాల్లో పనిచేసిన అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వహించడంలో నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో.. ఆ అధికారుల లెక్క తేల్చాలని హైడ్రా ఫిక్సయ్యిందని అంటున్నారు.
కాగా.. ఇప్పటివరకూ 18 ప్రాంతాల్లో చిన్నా పెద్దా అంతా కలిపి సుమారు 200 కు పైగా నిర్మాణాలను హైడ్రా కూల్చివేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సుమారు 50 ఎకరాల వరకూ చెరువుల భూములను, ప్రభుత్వ భూములను పరిరక్షించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇన్ని అక్రమ నిర్మాణాలను అనుమతులు ఇచ్చిన అధికారులపైనా దృష్టి సారించినట్లు సమాచారం.
హైడ్రా పేరుతో అవినీతికి పాల్పడితే... సీఎం వార్నింగ్:
మరోపక్క హైడ్రా పేరు చెప్పి కొంతమంది అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని.. గతంలో ఇచ్చిన నోటీసులను అడ్డుపెట్టుకుని డబ్బులు అడుగుతున్నట్లు తెలిసిందని.. అమాయకులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని.. అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.