పవర్ ఫుల్ భారతీయుల్లో సీఎం రేవంత్ ర్యాంక్ ఎంతంటే?
దేశంలో అత్యంత శక్తివంతులైన భారతీయుల ర్యాంకుల జాబితాను విడుదల చేసింది ప్రముఖ మీడియా సంస్థ ఇండియన్ ఎక్స్ ప్రెస్ సంస్థ.
By: Tupaki Desk | 29 March 2025 4:10 AMదేశంలో అత్యంత శక్తివంతులైన భారతీయుల ర్యాంకుల జాబితాను విడుదల చేసింది ప్రముఖ మీడియా సంస్థ ఇండియన్ ఎక్స్ ప్రెస్ సంస్థ. దేశంలోని టాప్ 100 శక్తివంతుల జాబితాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్థానం మెరుగు పడింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆయన ర్యాంకు మరింత మెరుగుపడిన వైనం అందరిని ఆకర్షిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 11 ర్యాంకులు మెరుగుపర్చుకున్నారు. దేశంలోని వివిధ రంగాలకు చెందిన అత్యంత శక్తివంతమైన టాప్ 100 జాబితాను ఇండియన్ ఎక్స్ ప్రెస్ 2025 విడుదల చేసింది.
గత ఏడాది సీఎం రేవంత్ రెడ్డి ర్యాంకు 39 కాగా.. ఈ ఏడాది అది కాస్తా 28 స్థానానికి చేరింది. జాబితాలో అగ్రస్థానంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిలిచారు. గత ఏడాదిలోనూ ఆయన నెంబర్ వన్ లోనే ఉన్నారు. రెండో స్థానంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉండగా.. మూడో స్థానంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జౌ శంకర్ నిలిచారు. టాప్ టెన్ లో ఉన్న మిగిలిన ప్రముఖుల్ని చూస్తే..
- ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ (4)
- ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (5)
- యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(6)
- కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ (7)
- కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ (8)
- కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ (9)
- రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ (10)
ఈ జాబితాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 14వ ర్యాంకులో నిలిచారు. గత ఏడాది ఈ జాబితాలో లేని చంద్రబాబు.. ఈసారి చోటు దక్కించుకోవటమే కాదు టాప్ 20లో ఒకరిగా నిలిచారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఈసారి జాబితాలో సినీ నటుడు అల్లు అర్జున్ కూ చోటు దక్కింది. ఆయన 92వ స్థానంలో నిలిచారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్.. తన ఏడాదిన్నర పాలనలో చేపట్టిన కార్యక్రమాలు.. అమలు చేసిన విధానాలు ఆయన్ను శక్తివంతమైన వ్యక్తిగా మార్చాయని చెబుతున్నారు. ఏడాది వ్యవధిలో పదకొండు స్థానాలు మెరుగుపర్చుకోవటం ఆసక్తికర అంశంగా చెప్పక తప్పదు.