Begin typing your search above and press return to search.

16 రోజులు జైల్లో గత ప్రభుత్వం నరకం చూపించింది : రేవంత్ ఆవేదన వైరల్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో తాను జైలులో గడిపిన 16 రోజుల గురించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

By:  Tupaki Desk   |   27 March 2025 12:19 PM
CM Revanth Reddy Remembers His Jail Ordeal
X

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో తాను జైలులో గడిపిన 16 రోజుల గురించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తనను అక్రమంగా అరెస్టు చేసి జైలులో నరకం చూపించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

డ్రోన్ ఎగరవేసినందుకు కేవలం రూ. 500 జరిమానా విధించాల్సి ఉండగా, తనను అరెస్టు చేసి జైలుకు పంపారని రేవంత్ రెడ్డి వాపోయారు. సాధారణంగా ఏడేళ్ల లోపు శిక్ష ఉండే కేసుల్లో రిమాండ్‌కు పంపకుండా బెయిల్ ఇవ్వాలని నిబంధనలు ఉన్నప్పటికీ, అప్పటి ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకుని తనను చర్లపల్లి జైలుకు పంపిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా నక్సలైట్లు, తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్‌లో తనను ఉంచారని ఆయన తెలిపారు.

16 రోజుల పాటు ఒక్క మనిషిని కూడా చూడకుండా తనను నిర్బంధించారని, ఆ సమయంలో తాను ఎంతో మానసిక క్షోభ అనుభవించానని రేవంత్ రెడ్డి అన్నారు. ఆ కోపాన్ని దిగమింగుకుని ప్రస్తుతం రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.

జైలులో తనను పడుకోనివ్వకుండా ట్యూబ్ లైట్లు ఆర్పేవారు కాదని, 20, 30 పెద్ద పెద్ద బల్లులు పురుగులు తింటుంటే ఒక్కరోజు కూడా తాను నిద్రపోలేదని రేవంత్ రెడ్డి ఆవేదనగా చెప్పారు. సెల్‌లోని చిన్న బాత్రూమ్‌లో కూర్చుంటే బయటకు కనిపించేలా ఉండేదని, కావాలంటే ఎమ్మెల్యేలను, మంత్రులను తీసుకువెళ్లి చూపిస్తానని ఆయన అన్నారు.

16 రోజులు నిద్రలేకపోవడంతో ఉదయం బయటకు వదిలినప్పుడు చెట్టు కింద పడుకుని నిద్రపోయేవాడినని రేవంత్ రెడ్డి తన జైలు జీవితంలోని కష్టాలను గుర్తు చేసుకున్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. గత ప్రభుత్వం తనను ఎంతగా ఇబ్బంది పెట్టిందో ఈ వ్యాఖ్యల ద్వారా రేవంత్ రెడ్డి మరోసారి గుర్తు చేశారు.