Begin typing your search above and press return to search.

రేషన్ కార్డులపై సీఎం రేవంత్ కీలక ఆదేశం

ఆపరేషన్ సక్సెస్ పేషెండ్ డైడ్ అన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాల తీరు ఉంటోందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   18 Feb 2025 5:12 AM GMT
రేషన్ కార్డులపై సీఎం రేవంత్ కీలక ఆదేశం
X

ఆపరేషన్ సక్సెస్ పేషెండ్ డైడ్ అన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాల తీరు ఉంటోందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. దీనికి కారణం.. పథకాలు.. ప్రభుత్వ నిర్ణయాల్ని అమలు చేసే విషయంలో దొర్లుతున్న తప్పులే దీనికి కారణంగా చెప్పాలి. విధానపరమైన నిర్ణయాల్ని తీసుకున్నప్పుడు వాటిని సమర్థంగా అమలు చేయటానికి ఉన్న మార్గాలు ఎలా అయితే గుర్తిస్తారో.. అమలు కాకుండా ఉండటానికి ఎదురయ్యే ఇబ్బందుల్ని సైతం ముందుగానే గుర్తించి.. అందుకు తగ్గ ప్లానింగ్ పక్కాగా చేస్తే ఎలాంటి సమస్య ఉండదు. కానీ.. రేవంత్ సర్కారులో లోపిస్తున్నది ఇదే.

రేషన్ కార్డుల వ్యవహారాన్నే తీసుకుంటే.. పదేళ్ల కేసీఆర్ హయాంలో కొత్త రేషన్ కార్డుల జారీని నిలిపేశారు. తమ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత రేషన్ కార్డుల్ని జారీ చేస్తానని చెప్పిన రేవంత్.. అందుకు తగ్గట్లే కొత్త రేషన్ కార్డుల్ని జారీ చేసేందుకు నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడే ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మీ సేవా సెంటర్లలో అప్లై చేసుకోవచ్చని చెప్పటం.. ఆ తర్వాత మీ సేవలో రేషన్ కార్డుల నమోదుకు ఇబ్బందులు ఎర్పడింది.

దీనిపై ప్రభుత్వం తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. పదేళ్లు రేషన్ కార్డులు జారీ చేయని బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే.. కార్డులు ఇచ్చేందుకు ఓకే చెప్పి.. ఆ ప్రాసెస్ లో చోటు చేసుకున్న లోటుపాట్లు కారణంగా రేవంత్ సర్కారు తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి రేషన్ కార్డులు ఒక్కటే కాదు.. రైతు భరోసా.. రైతు రుణమాఫీ ఇలా ప్రతి అంశంలోనూ ఆశించినంత మైలేజీ రాకపోగా.. ప్రభుత్వ పని తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రేషన్ కార్డుల వ్యవహారాన్నే తీసుకుంటే.. రేషన్ కార్డుల జారీకి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డుగా నిలుస్తుందన్న విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తించకపోవటం.. వారిని అధికారులు అలెర్టు చేయకపోవటం దేనికి నిదర్శనం? ఇదిలా ఉండగా.. కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో సీఎం రేవంత్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో తక్షణమే రేషన్ కార్డుల జారీని చేపట్టాలని ఆదేశించారు.

మీ సేవా కేంద్రాల వద్ద రేషన్ కార్డుల కోసం భారీ క్యూలైన్లు ఎందుకు? అన్న ముఖ్యమంత్రి ప్రశ్నకు అధికారులు సమాధానం ఇచ్చారు. రేషన్ కార్డుల కోసం అప్లై చేసిన కుటుంబాలే మళ్లీ మళ్లీ చేస్తున్నాయని.. వెంటనే రేషన్ కార్డుల్ని జారీ చేస్తే.. ఇందుకు అవకాశం ఉండదని పేర్కొన్నారు. దీంతో.. వేగంగా కార్డుల జారీకి ఓకే చేస్తూ సీఎం ఆదేశాలు జారీ చేశారు. కొత్త కార్డుల జారీకి పలు డిజైన్లను పరిశీలించిన ఆయన.. ఒక డిజైన్ కు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.