‘పుష్ప-2’ ఘటన... కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి ఆదేశాలు?
దానికి తోడు.. రేవంత్ అసెంబ్లీలో స్పందించిన అదే రోజు అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 24 Dec 2024 6:05 AM GMT'పుష్ప-2' బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర స్థాయిలో రాజకీయ రంగు పులుముకుందనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో... అసెంబ్లీలో అక్బరుద్దీన్ లేవనెత్తిన అంశానికి సీఎం రేవంత్ రెడ్డి సవివరంగా వివరణ ఇచ్చారు. దీంతో.. మరోసారి ఒక్కసారిగా ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది.
దానికి తోడు.. రేవంత్ అసెంబ్లీలో స్పందించిన అదే రోజు అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు వ్యాఖ్యలు చేశారు. అయితే.. అందులో కొన్ని అసత్యాలు ఉన్నాయంటు చిక్కడపల్లి పోలీసులు చెప్పిన మాటలను బట్టి అర్ధమవుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ నుంచి నేతలకు ఓ కీలక సూచన వచ్చిందని తెలుస్తోంది.
అవును... 'పుష్ప-2' సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన కేసు తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. దీనిపై రాజకీయ విమర్శలు పీక్స్ కి చేరాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఇకపై ఆ అంశంపై ఎవరుబడితే వారు ఎక్కడబడితే అక్కడ స్పందించొద్దని.. రేవంత్ నుంచి కాంగ్రెస్ నేతలకు ఆదేశాలు జారీ అయినట్లూ చెబుతున్నారు.
ఇటీవల కాలంలో తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ నేతలు వరుసగా ఈ విషయంపై స్పందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది 'పుష్ప-2' సినిమాపై విమర్శలు చేస్తుంటే.. మరికొంతమంది అల్లు అర్జున్ వ్యవహార శైలిని తప్పుబడుతున్నారని అంటున్నారు. మరికొంతమంది సినిమాపై కేసులు వేస్తున్నారని తెలుస్తోంది.
దీంతో... అటు అల్లు అర్జున్, ఇటు సినిమా ఇండస్ట్రీపైనా తెలంగాణ సర్కార్ కక్షగట్టిందా.. ఇండస్ట్రీ హైదరాబాద్ ని వదిలి వెళ్లిపోతుందా అనే చర్చలు సైతం మొదలయ్యాయని అంటున్నారు. సోమవారం చిత్ర నిర్మాతలతో కలిసి శ్రీతేజ్ ని పరామర్శించిన నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి ఈ విషయాలను ప్రస్థావించారు కూడా!
ఈ నేపథ్యంలోనే... కాంగ్రెస్ పార్టీ నేతలకు రేవంత్ రెడ్డి నుంచి ఆదేశాలు జారీ అయినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా... ఇకపై అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా మాట్లాడటం మానుకోవాలని.. మీడియా ముందు ఈ విషయాలపై వ్యాఖ్యానించొద్దని సీఎం తెలిపారని అంటున్నారు.