తెలంగాణ ఎమ్మెల్సీలు.. అంతా రేవంత్ ఇష్టమే..
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎంపికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Desk | 27 Feb 2025 1:32 PM ISTతెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎంపికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చేనెల 20న జరిగే ఎన్నికకు 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం ఐదు ఖాళీలకు కాంగ్రెస్ పార్టీ సంఖ్యాబలం ప్రకారం నాలుగు గెలుచుకునే అవకాశం ఉందంటున్నారు. అయితే మిత్రపక్షం సీపీఐ ఒకటి కోరుతుండగా, ఎంఐఎం కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తోంది. భవిష్యత్ సమీకరణలను దృష్టిలో పెట్టుకుని ఎంఐఎంతో స్నేహం కొనసాగించాలనే ఉద్దేశంతో ఉన్న కాంగ్రెస్ పెద్దలు ప్రస్తుతం ఎమ్మెల్సీ కేటాయిస్తారా? లేక భవిష్యత్తులో ఏర్పడే ఖాళీల్లో చాన్స్ ఇస్తామని ఒప్పిస్తారే అనేది చర్చగా మారింది.
అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్, సీపీఐ పోటీ చేశాయి. అప్పట్లో ఒక ఎమ్మెల్యే స్థానంతోటు, ఎమ్మెల్సీ స్థానం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అదేవిధంగా కాంగ్రెస్ హామీ ప్రకారం గతంలో ఏర్పడిన ఖాళీలో తెలంగాణ జనసమితి నేత కోదండరాం ను ఎమ్మెల్సీ చేశారు. ఇక తాజాగా జరగనున్న ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని సీపీఐ కోరుతోంది. ఇదే సమయంలో ఎంఐఎంతో కొత్త బంధం ఏర్పడటంతో ఆ పార్టీకి ఓ ఎమ్మెల్సీ ఇవ్వాలని ప్రతిపాదన వస్తోంది. ఇదే సమయంలో ఎంఐఎం పార్టీకి బీఆర్ఎస్ తో స్నేహ సంబంధాలు బాగానే ఉన్నాయి. కాంగ్రెస్ ను టెన్షన్ పెట్టే ఆలోచనతో ఉన్న బీఆర్ఎస్ రెండో అభ్యర్థిని పోటీకి పెట్టాలని చూస్తోంది. అదే జరిగితే కాంగ్రెస్ నాలుగు గెలుచుకోవడం కష్టమవుతుందని భావిస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అవ్వాలంటే 24 ఓట్లు ఉండాలి. ప్రస్తుతం కాంగ్రెస్ బలం 69. బీఆర్ఎస్ నుంచి వచ్చినవారితో కలిపి కాంగ్రెస్ బలం 79కి చేరింది. అయితే వలస ఎమ్మెల్యేల్లో కొందరు యూటర్న్ తీసుకున్నారనే ప్రచారం కూడా తెలంగాణలో హీట్ పుట్టిస్తోంది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణమోహన్ తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనంటూ చెప్పడాన్ని దీనికి ఉదహరిస్తున్నారు.
నాలుగు ఎమ్మెల్సీలు గెలవాలంటే 96 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. అయితే బీజేపీ ఓటింగుకు గైర్హాజరయ్యే అవకాశం ఉండటంతో కనీస ఓట్లు 24 తగ్గే అవకాశం ఉంది. అదే సమయంలో ఎంఐఎం మద్దతుతో కాంగ్రెస్ ఈజీగా నాలుగు స్థానాలు గెలుచుకోవచ్చు. ఒకవేళ ఎంఐఎం బరిలో ఉంటే బీఆర్ఎస్ ఆరో అభ్యర్థిని రంగంలోకి దింపే అవకాశం లేదంటున్నారు. దీంతో వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీకి ఎమ్మెల్సీ ఆఫర్ ఇవ్వొచ్చని అంటున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
సీపీఐ లేదా ఎంఐఎంలకు ఒక స్థానం ఇవ్వగా మిగిలిన మూడు స్థానాలకు అభ్యర్థులను ఎంపికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాయిస్ కే వదిలేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోందని అంటున్నారు. రెడ్డి సామాజికవర్గానికి ఒక ఎమ్మెల్సీతోపాటు బీసీ, ఎస్సీలకు మరో రెండు స్థానాలు ఇవ్వాలని ప్రతిపాదనలు ఉన్నాయంటున్నారు. రెడ్డి సామాజికవర్గం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేరు దాదాపు ఫైనల్ అయిపోయినట్లేనని టాక్ వినిపిస్తోంది. అయితే ఇదే సమయంలో సీనియర్ నేత జగ్గారెడ్డి, హరివర్ధన్ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి సైతం ఎమ్మెల్సీ ఆశిస్తున్నారు. అదేవిధంగా మహిళల కోటాలో రెడ్డి సామాజికవర్గానికే చెందిన పారిజాత నరసింహారెడ్డి సైతం పోటీపడుతున్నారు.
ఇక ఎస్సీల్లో మాదిగ లేదా మాల సామాజిక వర్గాల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలనేదానిపై పార్టీలో పెద్ద చర్చ జరుగుతోంది. ఎస్సీ కేటగిరీలో ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు అద్దంకి దయాకర్ కి ఎప్పుడో బొట్టు పెట్టారని అంటున్నారు. గతంలో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఆయనకు రెప్పపాటులో మిస్ అయ్యాయి. నామినేటెడ్ పోస్టుల్లోనూ అన్యాయం జరిగిందని పార్టీలో చర్చ జరుగుతోంది. దీంతో ఈ సారి ఆయనకు తప్పనిసరిగా అవకాశం వస్తుందని అంటున్నారు. అయితే ఆయనకు పోటీగా ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ ఉన్నారంటున్నారు. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన సంపత్ బీఆర్ఎస్ అభ్యర్థిపై ఓడిపోయారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాకు చెందిన ఆయన ఎమ్మెల్సీ కోసం బాగా ఒత్తిడి చేస్తున్నారని అంటున్నారు. ఇక ఎంబీసీల్లో అంజన్ కుమార్ యాదవ్, చరణ్ కౌశిక్ ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ సంస్థాగత విభాగాల్లో చురుగ్గా పనిచేస్తున్న కుమార్ రావు, హర్కార వేణుగోపాల్ సైతం తమ పేర్లు పరిశీలించాలని అధిష్టానానికి వినతులు సమర్పిస్తున్నారు. అయితే వీరిలో ఎవరిని ఎంపిక చేయాలన్నది హైకమాండ్ ఇష్టమే అయినప్పటకీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాయిస్ కే ఎక్కువ ప్రాధాన్యమనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ సైతం ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎంతో తొలి దశ చర్చలు జరిపారంటున్నారు. దీంతో ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారంటున్నారు.