Begin typing your search above and press return to search.

విద్యార్థులతో సీఎం మాక్ అసెంబ్లీ.. కీలక నిర్ణయం

ఈ మాక్ అసెంబ్లీలో పాల్గొన్న కొందరైనా అసెంబ్లీకి రావాలని, రాజకీయాలను వృత్తిగా ఎంచుకోవాలని విద్యార్థులకు ముఖ్యమంత్రి సూచించారు.

By:  Tupaki Desk   |   15 Nov 2024 9:32 AM GMT
విద్యార్థులతో సీఎం మాక్ అసెంబ్లీ.. కీలక నిర్ణయం
X

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. గత ప్రభుత్వాలు చేపట్టని విధంగా వినూత్నంగా ఆలోచించారు. బాలల దినోత్సవాన్ని ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహించారు. 20వేల మంది పిల్లలతో ముఖ్యమంత్రి రేవంత్ ఎల్‌బీ స్టేడియం వేదికగా పలు కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ఎన్‌సీఈఆర్‌టీలో అండర్‌-18 మాక్‌ అసెంబ్లీ కార్యక్రమం నిర్శమించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్హాజరయ్యారు. విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. వారిలో నుంచే స్పీకర్‌ను, డిప్యూటీ స్పీకర్‌ను నియమించారు. అధికార, ప్రతిపక్షాలు అంటూ రెండు వర్గాలుగా విభజించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కీలక ప్రకటన చేశారు. మాక్ అసెంబ్లీ వంటి సమావేశాలు సమాజానికి చాలా అవసరం అని తెలిపారు. సభను సమర్థవంతంగా నడిపించే బాధ్యత స్పీకర్‌పై ఉంటుందని రేవంత్ విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా మరో కీలక ప్రకటన కూడా చేశారు.

ఇప్పటివరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలంటే 25 ఏళ్ల వయసు అవసరం ఉంది. అయితే.. ఈ వయసును 21 ఏళ్లకు కుదిస్తే తప్పేంటని రేవంత్ రెడ్డి ప్రకటించారు. 21 ఏళ్లు నిండిన వారు కూడా అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఉంటే యూత్ రాజకీయాల్లోకి వచ్చే చాన్స్ ఉంటుందని అన్నారు. 21 ఏళ్లకే ఐఏఎస్, ఐపీఎస్‌లుగా సేవలందించిన వారు.. రాజకీయాల్లో సేవ చేయలేరా అని పేర్కొన్నారు. ఈ మేరకు ఈ అంశాన్ని మంత్రివర్గంలో చర్చించి అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు వచ్చేలా చూస్తానన్నారు. అమల్లోకి తీసుకువచ్చేలా సరైన ప్రణాళికలు రూపొందించాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు సూచించారు.

ఈ మాక్ అసెంబ్లీలో పాల్గొన్న కొందరైనా అసెంబ్లీకి రావాలని, రాజకీయాలను వృత్తిగా ఎంచుకోవాలని విద్యార్థులకు ముఖ్యమంత్రి సూచించారు. అసెంబ్లీలో సభ్యులు లేవనెత్తని ప్రశ్నలు, సమాధానాలు, ఇతర అంశాలను విద్యార్థులు గమనించాలని అన్నారు. చిల్డ్రన్ మాక్ అసెంబ్లీని స్ఫూర్తిదాయకంగా నిర్వహించిన విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ అభినందనలు తెలిపారు.