Begin typing your search above and press return to search.

మోడీ కులంపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

అవును... ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సామాజికవర్గంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   14 Feb 2025 2:50 PM GMT
మోడీ కులంపై రేవంత్  రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
X

యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శివచరణ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. బీజేపీ, మోడీపై నిప్పులు చెరిగారు. మోడీ లక్ష్యంగా విమర్శలతో విరుచుకుపడ్డారు. మోడీ పాలనలో అన్ని విధాలుగానూ తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటూ ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను ప్రస్థావించారు.

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు నిధులు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. నిధులన్నీ గుజరాత్, బీహార్ రాష్ట్రాలకేనా అని అడిగిన రేవంత్.. మెట్రోకు నిధులు ఇవ్వలేదు, మూసీ ప్రక్షాళనకు నిధులు ఇవ్వలేదని అన్నారు. దీనికి కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మోడీ కులంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సామాజికవర్గంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... 2002 వరకూ మోడీ ఉన్నత కులానికి చెందిన వ్యక్తి అని.. అయితే, గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కులాన్ని బీసీ జాబితాలో చేర్చుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే మోడీ ఒక లీగల్లీ కన్వర్టర్ బీసీ అని రేవంత్ అన్నారు.

ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ సందర్భంగా... రేవంత్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. ప్రధాని నిజంగా బీసీ అయితే 2002 వరకూ ఉన్నత కులానికి చెందినట్లు ఎందుకు పేర్కొన్నారని ప్రశ్నిస్తూ.. ఆయన సామాజికవర్గంపై స్పష్టత రావాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు!