Begin typing your search above and press return to search.

మూసీలో రేవంత్ బోటు ప్రయాణం.. పునరుజ్జీవ యాత్ర షురూ..

ప్రతిపక్షాలు ఏ పనిని అయితే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయో.. ఆ పనిని పూర్తి చేసి చూపించాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి రేవంత్ ముందుకు సాగుతున్నారు

By:  Tupaki Desk   |   8 Nov 2024 11:15 AM GMT
మూసీలో రేవంత్ బోటు ప్రయాణం.. పునరుజ్జీవ యాత్ర షురూ..
X

ప్రతిపక్షాలు ఏ పనిని అయితే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయో.. ఆ పనిని పూర్తి చేసి చూపించాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి రేవంత్ ముందుకు సాగుతున్నారు. ప్రతిపక్షాలు వద్దంటున్నా.. దానిని పూర్తిచేసి తీరుతామనే పంథాలో వెళ్తున్నారు. ఆయనలో ఆ పట్టుదల రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అందులో భాగంగా మూసీ ప్రక్షాళనకు ప్రతిపక్షాలు ఎంతలా అడ్డుపడుతున్నా దానిని ప్రక్షాళన చేసి తీరుతామనే టార్గెట్‌తోనే ఆయన వెళ్తున్నారు.

ఇప్పటికే మూసీ పేరిట ప్రతిపక్షాలు చేయాల్సిన నిరసనలు చేశాయి. అటు బాధితులను కూడా కలిశాయి. బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నేతలు మూసీ బాధితులను కలిసి వారిలో భరోసా నింపే ప్రయత్నం చేశారు. అయితే.. ప్రభుత్వం తరఫున రేవంత్ తనదైన శైలిలో వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. మూసీ వల్ల కలిగే నష్టాలను వారికి వివరించారు. దాంతో ప్రజలు చాలా వరకు వెనక్కి తగ్గి ప్రభుత్వ ఆదేశాల మేరకు డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లకు వెళ్లిపోయారు.

అయితే.. మూసీ ప్రక్షాళన ధ్యేయమంటూ ఈ రోజు రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈయన ఇవ్వాళ మూసీ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే ఆయన యాదగిరిగుట్టకు చేరుకున్నారు. అక్కడ నరసింహాస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మూసీ నది కుడి ఒడ్డున భీమలింగం వరకు దాదాపు 2.5కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేయనున్నారు.

ఇప్పటికే సంగెం వద్ద ఉన్న భీమలింగంకు రేవంత్ చేరుకున్నారు. అక్కడ భీమలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మూసీలో మంత్రి కోమటిరెడ్డితో కలిసి స్పీడ్ బోటులో ప్రయాణించారు. మూసీ పరిస్థితిని గమనించారు. ఆ తరువాత రేవంత్ సంకల్ప యాత్రను ప్రారంభించారు. ఆయన వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఉన్నారు. అనంతరం అక్కడి నుంచి ధర్మారెడ్డిపల్లి కెనాల్ కట్ట వెంట సంగెం-నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు పాదయాత్ర చేస్తారు. అక్కడ యాత్రను ఉద్దేశించి, మూసీ పునరుజ్జీవంపై రేవంత్ రథం పైనుంచే ప్రసంగించబోతున్నారు. ఆ తరువాత తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు.