Begin typing your search above and press return to search.

ప్రతిపక్షాలకు రేవంత్ బంపర్ ఆఫర్.. మూసీ బాధితుల కోసం కమిటీ..

ఎట్టిపరిస్థితుల్లోనూ అక్కడి పేదల ఇళ్లను ఖాళీ చేయించి.. మూసీని సుందరీకరణ చేయాలని నిర్ణయం తీసుకుంది.

By:  Tupaki Desk   |   6 Oct 2024 9:30 AM GMT
ప్రతిపక్షాలకు రేవంత్ బంపర్ ఆఫర్.. మూసీ బాధితుల కోసం కమిటీ..
X

మూసీ ప్రక్షాళనపై రేవంత్ సర్కార్ నడుం బిగించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ అక్కడి పేదల ఇళ్లను ఖాళీ చేయించి.. మూసీని సుందరీకరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. రివర్ ఫ్రంట్ మాదిరి అందంగా తీర్చిదిద్ది పర్యాటక స్థలంగా మార్చేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు.

రేవంత్ ఆలోచన బాగానే ఉన్నప్పటికీ.. కొంత మంది నిర్వాసితుల నుంచి వ్యతిరేకత వచ్చింది. దశాబ్దాలుగా ఉంటున్న ఇళ్లను ఖాళీ చేయకుండా ఆందోళనలకు దిగారు. బయటకు వచ్చి ధర్నాలు చేశారు. తాము ఇక్కడి నుంచి కదిలేదే లేదని పట్టుదలతో ఉన్నారు. దాంతో మూసీ అంశం వివాదానికి దారితీసింది.

మరోవైపు.. రేవంత్ ఆలోచనకు ప్రతిపక్షాలు బ్రేకులు వేస్తున్నాయి. పేదల పొట్ట కొట్టి మూసీ ప్రక్షాళనలు చేయడం ఎందుకని పెద్ద ఎత్తున నిలదీస్తున్నాయి. మూసీలో గోదావరి నీటికి బదులు.. నిర్వాసితులు రక్తం పారించండి అంటూ విమర్శిస్తున్నారు. అటు మూసీ బాధితులు కూడా పార్టీల నేతలను ఆశ్రయించారు. తమకు అన్యాయం జరగకుండా చూడాలని వేడుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు వారికి తోడయ్యారు. పేదల ఇళ్ల జోలికి వస్తే ఊరుకునేది లేదని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. అంతేగాకుండా.. మూసీ పరిధిలోని బాధితులను వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు.

ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై మరోసారి ఫైర్ అయ్యారు. నిన్న కాకా జయంతి కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్.. ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూనే వారికో బంపర్ ఆఫర్ ప్రకటించారు. ‘మీరేమో బంగ్లాల్లో ఉండొచ్చు కానీ.. పేదలు మాత్రం మురికి కంపులోనే ఉండాలా’ అని ప్రశ్నించారు. పేదలను ఆదుకోవాలనే చిత్తశుద్ధి ఉంటే తమ పార్టీ ఫండ్స్ నుంచి నిధులు ఇవ్వాలని అన్నారు. వందలాది ఎకరాల్లో కట్టుకున్న ఫాంహౌజ్‌లో కొంత భూమిని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. మూసీని అడ్డం పెట్టుకొని కేటీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.

అంతేకాకుండా.. ఒకవేళ మూసీ బాధితులను ఆదుకోవాలని ఉంటే కలిసి ముందుకు రావాలని రేవంత్ కోరారు. ప్రభుత్వం తరఫున ఏం చేస్తే బాగుంటుందో ప్రతిపక్షాలు సూచనలు చేయాలని అన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని అప్పీల్ చేశారు. ప్రభుత్వానికి ఎవరిపైనా ఎలాంటి కోపాలు లేవని, ప్రజలకు మేలు చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ఆ ముగ్గురూ సచివాలయానికి వస్తే తమ మంత్రులతో కలిసి కూర్చొని చర్చిద్దామని పిలుపునిచ్చారు. అంతేకాదు.. జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసి అందులో ప్రతిపక్ష లీడర్లను కూడా సభ్యులుగా చేర్చుతామని అన్నారు. మరి రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఈ ఆఫర్‌కు ప్రతిపక్ష నేతలు ముందుకు వస్తారా..? లేదు మూసీ బాధితుల పక్షాన అలాగే కొట్లాడుతారా..? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.