కొత్త సంవత్సరంలో రేవంత్ పొలిటికల్ క్లాస్
మీరేమిటో తెలిసిన తర్వాత.. మీ పని తీరు అర్థం చేసుకున్న తర్వాత రెండోసారి గెలిపిస్తేనే గొప్ప విషయం. పెళ్లిళ్లు.. ఇతర కార్యక్రమాలకు వెళ్లి వస్తుండాలి.
By: Tupaki Desk | 2 Jan 2025 4:41 AM GMTఆసక్తికర రాజకీయ సన్నివేశం ఒకటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో చోటు చేసుకుంది. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆయనకు కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున పార్టీ ప్రజాప్రతినిధులు.. పార్టీ నేతలు క్యూ కట్టారు. ఈ సందర్భంగా మొదటిసారి గెలిచిన ఎంపీలు. ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ సరదాగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కొత్త ఏడాదిలో ప్రజలకు చేరువ కావాలన్న విషయాన్ని వారికి చెప్పిన ముఖ్యమంత్రి.. తొలిసారి గెలవటం గొప్పేం కాదని.. రెండోసారి గెలుపే గొప్పగా పేర్కొన్నారు. "ప్రజాప్రతినిధిగా మీరు చేసే పనులన్నీ ప్రజలకు రిజిస్టర్ అవుతుంటాయి. అన్ని విషయాలను వారు గుర్తు పెట్టుకుంటారు. మొదటిసారి మీపై చాలా అంచనాలతో గెలిపిస్తారు. అది గొప్ప విషయం కాదు.
మీరేమిటో తెలిసిన తర్వాత.. మీ పని తీరు అర్థం చేసుకున్న తర్వాత రెండోసారి గెలిపిస్తేనే గొప్ప విషయం. పెళ్లిళ్లు.. ఇతర కార్యక్రమాలకు వెళ్లి వస్తుండాలి. కార్యాకర్తలతో మమేకం కావాలి. మీరు ఈజీగా తీసుకుంటే ఫలితాలు వేరుగా ఉంటాయి" అంటూ సరదాగా మాట్లాడినట్లే మాట్లాడి.. ఏం చెప్పాలో ఆ విషయాన్ని సుత్తి లేకుండా సూటిగా చెప్పేసినట్లు సమాచారం.
ఈ టైంలోనే చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యను ఉద్దేశించి.. ఆయన ఎలా గెలుస్తున్నారో అడిగి తెలుసుకోవాలని మిగిలిన వారికి చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్.. "ప్రజలు ఒకసారి ప్రతికూల తీర్పు ఇచ్చిన తర్వాత అసలు రాజకీయం ఏమిటో అర్థమవుతుంది. కొత్త ఏడాదిలో ప్రజలకు మరింత చేరువ కావాలి. నేను కూడా పట్టుదలతో పని చేస్తాను. ఉదయం నుంచి మంత్రులకు.. పార్టీ నేతలకు తానే ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపా.
ఎంపీలు.. ఎమ్మెల్యేలు కూడా మీ కోసం పని చేసే నేతలు.. కార్యకర్తలకు ఫోన్లు చేసి గ్రీటింగ్స్ చెప్పండి. వీలున్నప్పుడు వారితో మాట్లాడండి. స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా కేడర్ ను కలుపుకొని ముందుకు వెళ్లండి. ప్రభుత్వం చేపట్టిన డెవలప్ మెంట్ ను.. సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి" అంటూ వివరించారు. మొత్తంగా కొత్త సంవత్సరం రోజున తన ప్రజాప్రతినిధులకు క్లాస్ తీసుకున్న సీఎం రేవంత్.. దాన్నో సరదా భేటీ అన్న ట్యాగ్ ను తగిలించటం చూస్తే.. ఆయన గడుసుదనం ఇట్టే అర్థమవుతుంది.