Begin typing your search above and press return to search.

కేసీఆర్ కోరుకున్న అధికారిని ఇచ్చిన రేవంత్.. ఆయన ఎవరంటే..?

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్).. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, కేంద్ర మంత్రిగా, తెలంగాణకు పదేళ్లు సీఎంగా వ్యవహరించిన నాయకుడు

By:  Tupaki Desk   |   14 Dec 2024 2:30 PM GMT
కేసీఆర్ కోరుకున్న అధికారిని ఇచ్చిన రేవంత్.. ఆయన ఎవరంటే..?
X

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్).. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, కేంద్ర మంత్రిగా, తెలంగాణకు పదేళ్లు సీఎంగా వ్యవహరించిన నాయకుడు..

తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ తర్వాత సొంతంగా పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చిన నాయకుడు..

తెలంగాణ అనే ప్రత్యేక రాష్ట్రం అసలు సాధ్యమవుతుందా? అని ఊహించడానికే వీలుకాని రోజుల్లో.. తాను సాధించగలనంటూ ముందుకొచ్చిన నాయకుడు..

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అంటే.. ఓడిపోయినా క్యాబినెట్ ర్యాంక్ మాత్రం దక్కడం ఆయన విశిష్టత. ఈ నేపథ్యంలో కేసీఆర్ తనకు పర్సనల్ సెక్రటరీ (పీఎస్)గా ఓ అధికారిని కోరుకున్నారు. రాజకీయాల్లో ప్రజాప్రతినిధులకు పీఎస్ లుగా ప్రభుత్వ అధికారుల నియామకం సహజమే. అయితే, కేసీఆర్ ఎంచుకున్న అధికారి... ఐఏఎస్, లేదా గ్రూప్-1 అధికారినో కాదు.

పీఎస్‌గా వ్యవసాయాధికారి

మాజీ సీఎం కేసీఆర్‌ ప్రైవేటు కార్యదర్శిగా సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండల వ్యవసాయాధికారి నాగేందర్‌రెడ్డి నియమితులయ్యారు. ఆ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ఐదేళ్లుగా మర్కుక్‌ మండల వ్యవసాయ అధికారి (ఏవో)గా పని చేస్తున్నారు. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం (ఫామ్ హౌస్) ఉన్న ఎర్రవల్లి ఈ మండలం పరిధిలోకే వస్తుంది.

కేసీఆర్ క్షేత్రంలో సాగు సలహాలు

నాగేందర్ రెడ్డి.. ఎర్రవల్లిలోని కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలు అందజేశారు. అందుకనే ఆయననే తన వ్యక్తిగత కార్యదర్శిగా నియమించాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. వాస్తవానికి ఇప్పుడున్న రాజకీయ ఉద్రిక్త పరిస్థితుల్లో కేసీఆర్ కోరికను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరుస్తుందా? అనేది సందేహమే. కానీ, దీనిని పటాపంచలు చేస్తూ నాగేందర్ రెడ్డిని కేసీఆర్ కు సీఎస్ గా ఇచ్చింది. విధానాల పరంగా రాజకీయాల్లో ఉప్పు-నిప్పులా ఉన్నప్పటికీ, కేసీఆర్ కోరికను గౌరవించి రేవంత్ ప్రభుత్వం మంచి పని చేసిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.