దేవత కాదు ఆమె తల్లి...రేవంత్ సంచలన వ్యాఖ్యలు!
దేవత గుడిలో ఉంటుంది. తల్లి గుండెల్లో ఉంటుంది. ఈ రెండింటికీ తేడా చాలా ఉంది. దేవత అంటే ఆరాధనా భావం ఉంటుంది.
By: Tupaki Desk | 9 Dec 2024 6:04 PM GMTదేవత గుడిలో ఉంటుంది. తల్లి గుండెల్లో ఉంటుంది. ఈ రెండింటికీ తేడా చాలా ఉంది. దేవత అంటే ఆరాధనా భావం ఉంటుంది. తల్లి అంటే అభిమానం ఉంటుంది. దేవత కోసం మొక్కులు చెల్లించాలి. కానీ తల్లి అయితే తానే ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటుంది.
ఇలా దేవత తల్లి ఈ ఇద్దరి మధ్యన తేడాల గురించి ఎన్నో చెప్పవచ్చు. ఇదంతా ఎందుకు అంటే తెలంగాణా తల్లి విగ్రహాన్న్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఆవిష్కరించారు. అయితే గత కొద్ది రోజులుగా తెలంగాణా తల్లి విగ్రహం రూపకల్పన మీద ప్రజలలో చర్చ సాగుతోంది.
మరో వైపు చూస్తే బీఆర్ఎస్ నేతలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తయారు చేయించిన తెలంగాణా తల్లి రూపాన్ని విమర్శిస్తున్నారు. వారు తాము అధికారంలోకి వస్తే కొత్త విగ్రహాన్ని తయారు చేయిస్తామని చెబుతున్నారు. ఒక విధంగా తెలంగాణా తల్లి విగ్రహం అన్న ఇపుడు వివాదాలకు కేంద్ర బిందువు అవుతోంది.
అయితే దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పూర్తిగా వివరించారు. తాము ఎందుకు ప్రస్తుతం రూపంలో ఉన్న తెలంగాణా తల్లి విగ్రహాన్ని ఎంచుకున్నామన్న దానికి ఆయన చాలా డీటైల్డ్ గా చెప్పాల్సింది చెప్పారు.
అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఆభరణాలు, కిరీటం, ఒక చేతిలో గోధుమ గింజలు మరో చేతిలో బతుకమ్మతో కూడిన గొప్పదైన చీరను ధరించింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తయారు చేయించిన ఈ కొత్త డిజైన్‌లో తెలంగాణ తల్లి విగ్రహం చాలా సాధారణంగా ఆకుపచ్చ చీర ధరించి, ఒక చేతిలో గోధుమ గింజలు పట్టుకుని, కుడిచేత్తో అభయ హస్తం చూపిస్తూ ఉంటుంది.
దీంతోనే వస్తోంది అసలైన వివాదం. ఎందుకు అంటే కొత్త డిజైన్‌లో ఆభరణాలు లేవు అలాగే తెలంగాణ తల్లిని చాలా సాధారణంగా చిత్రీకరించడంపై ఓ వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని మీద అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తాము ఎంచుకున్న ఈ సరికొత్త డిజైన్ లో తెలంగాణా తల్లి దేవత కాదని ఆమె అచ్చమైన అమ్మ అని అభివర్ణించారు. కన్న తల్లిని పోలి ఉండేలా విగ్రహం తయారు చేశామని ఆయన చెప్పారు. తెలంగాణా తల్లిని దేవతగా డిజైన్ చేయాలా లేదా తల్లిగా చూపించాలా అన్న రెండు రెండు కోణాలు ఉన్నాయని ఆయన చెబుతూ తాము అయితే తల్లినే ఎంచుకున్నామని అన్నారు.
ప్రతీ ఒక్కరికీ ఆమె మాతృమూర్తి అన్న అనుభూతి రావాలన్న ఉద్దేశ్యంతోనే ఈ విధంగా తెలంగాణా తల్లిని డిజైన్ చేయించామని చెప్పారు. ఇక చాలా మంది మేధావులు వివిధ రంగాల నిపుణులు కూడా తెలంగాణా విగ్రహంలో మాతృమూర్తి రూపమే అవసరమని చెప్పారని ముఖ్యామంత్రి సభకు తెలియచేశారు.
ఇక్కడ రేవంత్ రెడ్డి మరిన్ని విషయాలను చెప్పారు. కావాలని అనుకుంటే దేవతలను దేవాలయాలలో చూడవచ్చునని, అదే ఒక తల్లి అయితే ప్రతీ ఇంట్లోనూ ఉంటుందని ఆ తల్లి ఒడిలోనే బిడ్డలంతా పెరుగుతారని ఆయన అన్నారు. అలా తెలంగాణా తల్లి ఒడిలోంచి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందని ఆయన గుర్తు చేశారు.
అందుకే ప్రతి ఒక్కరూ మదర్లీ డిజైన్‌ను చూసి అమ్మ తమతో ఉందని తీయని మధురమైన అనుభూతిని పొందాలని ఈ విధంగా విగ్రహం రూపకల్పన చేశామని అన్నారు. ఇక మీదట తెలంగాణా తల్లి విగ్రహంలో ప్రతి ఒక్కరూ తమ అమ్మని చూస్తున్నట్లు భావిస్తారని రేవంత్ రెడ్డి చెప్పారు.
మొత్తానికి చూస్తే రేవంత్ రెడ్డి తెలంగాణా తల్లి విగ్రహం రూపకల్పన విషయంలో ప్రభుత్వం ఆలోచనలను సమర్ధించుకుంటూనే అమ్మతనంతో అందరినీ ఒప్పించేలా యతించారు. మరి సీఎం రేవంత్ వాదన కానీ ఆయన దృష్టి కోణం కానీ విపక్షాలను ఒప్పిస్తుందా లేదా విమర్శలు మరింతగా ఎక్కు పెట్టేలా చేస్తుందా అన్నది చూడాల్సి ఉంది.