Begin typing your search above and press return to search.

విపక్షాలకు రేవంత్ చెక్.. ఏం చేయబోతున్నారంటే..?

ప్రధానంగా వరదల బారి నుంచి భాగ్యనగరాన్ని కాపాడేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాను తీసుకొచ్చారు.

By:  Tupaki Desk   |   14 Oct 2024 3:30 PM GMT
విపక్షాలకు రేవంత్ చెక్.. ఏం చేయబోతున్నారంటే..?
X

హైడ్రా విషయంలో విపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి సిద్ధం అయ్యారా..? రేవంత్ తన ప్లాన్‌తో బీఆర్ఎస్, బీజేపీ నేతలకు దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతున్నారా..? ప్రభుత్వ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

ప్రధానంగా వరదల బారి నుంచి భాగ్యనగరాన్ని కాపాడేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాను తీసుకొచ్చారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ కట్టడాలను కూల్చి.. వరద బారి నుంచి ఇబ్బందులు తప్పించాలని అనుకున్నారు. అయితే.. ముఖ్యమంత్రి ఉద్దేశం మంచిదే అయినప్పటికీ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అధికార పార్టీ నేతలు అంటున్నారు. అటు మూసీ సుందరీకరణ కూడా బీఆర్ఎస్ హయాంలోనే ప్లాన్ సిద్ధం చేశారని, కానీ ఇప్పుడు అక్కడి ప్రజలను రెచ్చగొడుతున్నారని అభిప్రాయపడ్డారు.

మూసీ నిర్వాసితులు ఇప్పటికే తమ ఇళ్లన ఖాళీ చేసి వెళ్లిపోగా.. మరికొందరు మాత్రం వెళ్లిపోమంటూ చెబుతున్నారు. దీంతో వీరికి బీఆర్ఎస్, బీజేపీలు సపోర్టుగా నిలిచాయి. ఇప్పటికే వారి ఇళ్ల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. పూర్తిస్థాయి మద్దతు కూడా తెలిపారు.

ఈ క్రమంలో విపక్షాలకు చెక్ పెట్టేందుకు రేవంత్ భారీ ప్లాన్ వేశారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని చెరువులను కబ్జా చేసిన లీడర్ల జాబితాను తయారు చేశారు. కబ్జాలకు పాల్పడి వెంచర్లు, ఫాంహౌజ్‌లు విల్లాలు నిర్మించిన నేతల జాబితాను వెల్లడించేందుకు సిద్ధం అయినట్లుగా సమాచారం. ఈ జాబితాలో కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీమంత్రుల పేర్లు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే ఏయే చెరువులు ఎప్పుడు నిర్మాణం జరిగాయి.. వాటిని కబ్జా చేసింది ఎవరు..? అందులో వెలసిన కట్టడం ఏంటి..? అని వివరాలను బహిర్గతం చేయబోతున్నారని తెలుస్తోంది.

ఓఆర్ఆర్ లోపల 2014 నుంచి 171 చెరువులు కబ్జాకు గురైనట్లు ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. వాటిలో 44 చెరువులు పూర్తిగా కనుమరుగైనట్లు గుర్తించింది. మరో 127 పాక్షికంగా ఆక్రమణకు గురైనట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల వెల్లడించారు. ఈ క్రమంలో ఏయే చెరువులను ఎవరు కబ్జా చేశారు? ఏ వ్యక్తి పేరుతో వెంచర్‌కు అనుమతి తీసుకున్నారు.? ఎవరి పేరుతో నిర్మాణాల కోసం దరఖాస్తు చేశారు..? అనే వివరాలను సేకరించింది. రెవెన్యూ, ఇరిగేషన్, హెచ్ఎండీఏ, పంచాయతీ రాజ్, జీహెచ్ఎంసీ, ఫైర్ సేఫ్టీ విభాగాల వద్ద ఉన్న ఆధారాలతో ఆక్రమణదారుల పూర్తివివరాలను సేకరించినట్లు సమాచారం.

కబ్జాదారుల్లో రియల్టర్లు, బడా నేతలు, వ్యాపార వేత్తలు ఉన్నారని సమాచారం. దాంతో వారు గత ప్రభుత్వం హయాంలో పలుకుబడిని వినియోగించి దొంగ పత్రాలు సృష్టించినట్లు ప్రచారం జరుగుతోంది. తప్పుడు డాక్యుమెంట్లతో వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

హైడ్రా, మూసీ అంశాలపై విపక్షాలు ఆందోళనలకు దిగాయి. మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడేందుకు సిద్ధమైట్లు ఆరోపణలు చేశారు. దాంతో అధికార పార్టీ నేతలు మరో రకంగా కౌంటర్‌కు దిగుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని చెరువులను ఆక్రమించి వెలసిన నిర్మాణాల్లో బీఆర్ఎస్ నేతల హస్తం ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. అందుకే వారు మాటల ద్వారా అటాక్ చేస్తున్నారని అంటున్నారు. అందుకే.. వారందరి లెక్కలు తీసి వారికి చెక్ పెట్టేందుకు రేవంత్ ఇప్పటికే జాబితా సిద్ధం చేశారన్న ప్రచారం వినిపిస్తోంది. త్వరలోనే ఆ లిస్టును విడుదల చేయనున్నట్లు సమాచారం.