Begin typing your search above and press return to search.

మరింత పవర్ ఫుల్ గా రేవంత్

కొన్నిసార్లు ఓటమి కూడా లాభంగా మారుతుంటుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అలానే ఉందని చెప్పాలి.

By:  Tupaki Desk   |   9 Feb 2025 5:15 AM GMT
మరింత పవర్ ఫుల్ గా రేవంత్
X

కొన్నిసార్లు ఓటమి కూడా లాభంగా మారుతుంటుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అలానే ఉందని చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ ముఖ్యనేతల్లో ఒకరైన కేటీఆర్ ‘ఐరెన్ లెగ్’గా పేర్కొన్న వైనం చూసినప్పుడు.. ఆయన నోటి నుంచి మరో అనవసరమైన మాట వచ్చిన వైనం అర్థమవుతుంది. నిజానికి ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం రేవంత్ కు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. ఒకవేళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తాను లక్ష్యంగా పెట్టుకున్న పది స్థానాలు కాకున్నా.. కనీసం ఐదు స్థానాల్లో విజయం సాధించినా.. ఆ క్రెడిట్ మొత్తం కాంగ్రెస్ అధినాయకత్వానికే తప్పించి.. ప్రచారం చేసిన రేవంత్ ఖాతాలో పడదు.

అలాంటప్పుడు డిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించే విజయం రేవంత్ కు ఎలాంటి సాయాన్ని చేయదు. అదే సమయంలో పార్టీ ఘోర ఓటమి మాత్రం రేవంత్ కు భలేగా కలిసి వస్తుందన్న మాట వినిపిస్తోంది. దీనికి కారణం కాంగ్రెస్ అధినాయకత్వం ఆయన మీద తరచూ ఆధారపడాల్సి రావటంగా చెప్పాలి. ఒకప్పుడు దేశ రాజకీయ ముఖచిత్రాన్ని చూస్తే.. ఎక్కడ చూసినా కాంగ్రెస్ అధికార దర్పమే కనిపించేది. అలాంటి పార్టీ ఇప్పుడు దేశ చిత్రపటాన్ని చూస్తే.. మూడుచోట్ల నేరుగా.. రెండుచోట్ల అధికార పార్టీకి మద్దతు ఇచ్చిన పార్టీగానే కనిపిస్తుంది.

అలాంటివేళ.. ధనిక రాష్టాల్లో ఒకటైన తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండటంతో పాటు.. బలమైన ప్రతిపక్షాన్ని నిలువరిస్తూ పని చేసుకుంటూ పోవటం అంత తేలికైన విషయం కాదు. ఆ విషయంలో రేవంత ముందున్నారని చెప్పాలి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు ముఖ్యమంత్రులు ఉన్నారు. వారిలో ఒకరు కర్ణాటక సీఎం సిద్దరామయ్య.. రెండోవారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి.. మూడో ముఖ్యమంత్రిగా హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు. ఈ ముగ్గురిలో ఏ రకంగా చూసినా రేవంత్ మెరుగైన రాజకీయ నేతగా కనిపిస్తారు కాంగ్రెస్ పార్టీకి. ఇక.. తాను అధికారనపక్షంలో భాగస్వామిగా ఉన్న రెండు రాష్ట్రాల్ని చూస్తే తమిళనాడు.. జార్ఖండ్. తమిళనాడు ప్రభుత్వంలో పార్టీ రోల్ ఎంత పరిమితమన్న విషయం తెలిసిందే. జార్ఖండ్ లోనూ కీరోల్ ఏమీ లేదన్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తెలంగాణ విషయానికే వస్తే.. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీని విజేతగా నిలిపిన ఎపిసోడ్ లో రేవంత్ పాత్ర కీలకమన్నది చెప్పాలి. అయితే.. పాలన మీద పట్టు లేకపోవటం.. రాష్ట్ర పార్టీని కంట్రోల్ చేసే విషయంలో ఆయనకున్న పరిమితుల నేపథ్యంలో ఆయనకు ఉండాల్సినంత బలంగా లేరని చెప్పాలి. పాలనా పరంగా చేయకూడని తప్పుల విషయంలో కేర్ ఫుల్ గా ఉంటే.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పవర్ ఫుల్ గా మారతారని చెప్పక తప్పదు. తనకు లభించిన సదవకాశాన్ని రేవంత్ వినియోగించుకుంటారా? లేదా? అన్నది కాలమే తేల్చనుంది.