సీఎం రేవంత్ కొత్త పిలుపు: దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి.. ఎందుకు?
సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటివరకు ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేసినా.. అవన్నీ కూడా పరిమితులకు లోబడి మాత్రమే.
By: Tupaki Desk | 10 Feb 2025 4:27 AM GMTసంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటివరకు ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేసినా.. అవన్నీ కూడా పరిమితులకు లోబడి మాత్రమే. అందుకు భిన్నంగా ఆదివారం మాత్రం ఆయన వాయిస్ లో తేడా వచ్చేసింది. కేరళలోని తిరువనంతపురంలో జరిగిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాతృభూమి ఎడిటర్.. ఆహుతుల ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబులు ఇచ్చారు. ఈ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలంటూ కొత్త డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు. ఈ వ్యాఖ్యలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ముఖాముఖి యుద్ధానికి తెరతీశారని చెప్పాలి.
ఇప్పటివరకు మోడీపై యుద్ధాన్ని పలువురు ముఖ్యమంత్రులు చేపట్టారు. దక్షిణాది వరకు వచ్చినా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సైతం మోడీ సర్కారుపై ఒక దశలో దునుమాడారు. తర్వాతి కాలంలో వారిద్దరూ తగ్గారు. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన కుమారుడు కేటీఆర్ ఇద్దరూ ప్రధాని నరేంద్ర మోడీపైనా.. ఆయన ప్రభుత్వంపైనా డైలీ బేసిస్ లో విమర్శలు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం మోడీ సర్కారుపై విమర్శలు చేయటం చూశాం.
వీరికి భిన్నంగా.. దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలని.. లేకుంటే సౌత్ కు ప్రమాదం పొంచి ఉందన్న కొత్త అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చిన ఘనత రేవంత్ కు మాత్రమే దక్కుతుంది. ఇంతకూ ఆయన వాదన ఏమిటన్నది ఆయన మాటల్లోనే చూస్తే.. ‘‘రాజ్యాంగపరమైన సాధనకు దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి. జనాభా దామాషా పద్దతిలో నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రంలోనిమోడీ సర్కారు చేస్తున్నప్రయత్నాలను తిప్పికొట్టాలి. జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే..దక్షిణాది రాష్ట్రాలకు లోక్ సభలో స్థానాలు తగ్గుతాయి. బిహార్.. మధ్యప్రదేశ్.. రాజస్థాన్.. ఉత్తరప్రదేశ్ వంటి బిమారు రాష్ట్రాల్లో గెలిచే సీట్లతోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. దక్షిణాది రాష్ట్రాలపై ఆధారపడాల్సిన అవసరమే పార్టీలకు ఉండదు’’ అంటూ తనదైనశైలిలో వాదనను వినిపించారు.
కుటుంబ నియంత్రణను పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తారా? అంటూ ప్రశ్నించిన రేవంత్.. ఈ చర్య ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బ తీస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా లెక్కల ప్రకారం కాకుండా.. ప్రతి రాష్ట్రానికి 50 శాతం సీట్లను పెంచాలన్న సీఎం రేవంత్.. ‘‘దీంతో అన్ని రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయి. ఇదే సూచనను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లాం. ఒకే దేశం.. ఒకే ఎన్నికల విధానానికి మేం వ్యతిరేకం. ఇదిఒకే వ్యక్తి.. ఒకే పార్టీకి నిదర్శనం. ఇదే మోడీ రహస్య అజెండా. బీజేపీ.. ప్రధాని మోడీ ప్రతిదాన్నీ తమ నియంత్రణలోకి తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇది ప్రజస్వామ్యానికి పెనుముప్పు. దీన్ని తిప్పికొట్టేందుకు కేరళ.. తమిళనాడు..కర్ణాటక.. ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ.. పుదుచ్చేరి ప్రజలు ఏకం కావాలి’’ అంటూ సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.