అత్తగారి ఊరుకు రోడ్డు.. హరీశ్ వ్యాఖ్యలకు సీఎం కౌంటర్
మిగిలిన ముఖ్యమంత్రులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ కు ఒక పెద్ద వ్యత్యాసం ఉంది.
By: Tupaki Desk | 27 March 2025 4:51 AMమిగిలిన ముఖ్యమంత్రులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ కు ఒక పెద్ద వ్యత్యాసం ఉంది. తనను ఉద్దేశించి.. తన వ్యక్తిగత అంశాలకు సంబంధించి చేసే తీవ్రమైన ఆరోపణలకు ఏదో ఒక సందర్భంలో వాటిని ప్రస్తావించి మరీ స్పష్టత ఇచ్చే గుణం తెలంగాణ ముఖ్యమంత్రికి ఉందని చెప్పాలి. తాజాగా తన మీద మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన తీవ్ర ఆరోపణల్ని ప్రస్తావించిన ముఖ్యమంత్రి రేవంత్.. వాటికి ధీటైన బదులు ఇచ్చారు.
ఇటీవల హరీశ్ రావు మాట్లాడుతూ .. అమనగల్లుకు ముఖ్యమంత్రి రోడ్డు వేయించటం వెనుక ఉద్దేశాన్ని చెబుతూ.. అత్తగారి ఊరికి రోడ్డు వేయించుకుంటున్నారన్నాంటూ ఘాటైన ఆరోపణ చేశారు. దీనికి తాజాగా బదులిచ్చారు సీఎం రేవంత్. అమనగల్లుకు రోడ్డు అంటే మా అత్తగారి ఊరుకు రోడ్డు వేస్తున్నారని హరీశ్ ఆరోపించారని.. కానీ ఓఆర్ఆర్ కు ట్రిపుల్ ఆర్ కు మధ్య అనుసంధానానికి వేసే 11 రేడియల్ రోడ్లలో అదొకటన్నారు.
‘‘ఆ కుటుంబం ఆ గ్రామాన్ని వదిలి ఐదు దశాబ్దాలైంది. వాళ్లు అనుకుంటే సొంత ఖర్చులతో రెండింతలు పెద్ద రోడ్డు వేసుకునే ఆర్థిక స్తోమత ఉంది. ప్రతిపక్షాన్ని అడుగుతున్నా. రాష్ట్రంలో డెవలప్ మెంట్ వద్దా? ఆర్ఆర్ఆర్ వద్దా? ఫ్యూచర్ సిటీ కట్టాలా? వద్దా? మూసీ పునరుద్ధరణ చేయాలా? వద్దా. ప్యూచర్ సిటీని ఫోర్ బ్రదర్స్ సిటీ అని అంటున్నారు. అది నాలుగు కోట్ల సోదర సోదరీమణుల భవిష్యత్ నగరం’ అంటూ ఫుల్ కౌంటర్ ఇచ్చారు.
బీఆర్ఎస్ నేతలు కడుపు నిండా విషం పెట్టుకొని మాట్లాడుతున్నారని.. అసెంబ్లీలో విపక్ష నేతగా జానారెడ్డి ఉన్నప్పుడు.. పార్టీ కంటే తెలంగాణ ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చారన్నారు. భట్టివిక్రమార్క కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు.. ప్రభుత్వానికి సలహాలు ఇచ్చిన వైనాన్ని గుర్తు చేశారు. అయినా కక్ష కట్టి విపక్ష హోదా తీసేసినా భట్టి సూచనలు చేశారన్నారు. ‘మీరు కూడా జానారెడ్డి.. భట్టి విక్రమార్కలను ఆదర్శంగా తీసుకోవాలి’ అంటూ సీఎం రేవంత్ సూచనలు చేశారు.
అదే సమయంలో బీఆర్ఎస్ లోని ఇద్దరు నేతల మధ్య అంతర్గతపోరు ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందంటూ సీఎం రేవంత్ నిప్పులు చెరిగారు. ఒకరు ఉదయం ప్రెస్ మీట్ పెడితే.. మధ్యాహ్నం మరొకరు ఎక్స్ లో పోస్టు పెడతారన్నారు. తన వద్దకు హరీశ్ రావు.. పల్లా రాజేశ్వర్ రెడ్డి.. బీజేపీ వెంకటరమణారెడ్డి.. ఇలా ఎవరొచ్చి నియోజకవర్గ సమస్యల్ని తెచ్చినా తాను పరిష్కరిస్తానని చెప్పారు.
ఆ మాటకు వస్తే గజ్వేల్ ఎమ్మెల్యే కేటీఆరర్ వచ్చినా గౌరవిస్తానని చెప్పిన రేవంత్.. ‘గజ్వేల్ డెవలప్ మెంట్ గురించి మాట్లాడతా. ఎవరి మీదా వివక్ష చూపించం. భట్టివిక్రమార్క ప్రవేశ పెట్టిన తాజా బడ్జెట్ 95 శాతం నిజం కానున్నట్లు చెప్పారు. 2014-23 మధ్య బడ్జెట్లలో ఆచరణ సగటు 25 శాతం తేడా ఉండేదని పేర్కొన్నారు.