ఏమైనా సీఎం రేవంత్ రెడ్డి మాటల లెక్కనే వేరప్పా
ఈ కార్యక్రమం స్పెషల్ ఏమంటే.. కాంగ్రెస్ నేతలతో పాటు.. బీజేపీ నేతలు పలువురు హాజరయ్యారు. ఈ విచిత్రమైన కాంబినేషన్ లో ఏర్పాటు చేసిన సభలో.. రేవంత్ క్లాసిక్ టచ్ మాటలతో అందరిని ఆకట్టుకోవటమే కాదు..
By: Tupaki Desk | 13 Jan 2025 5:12 AM GMTఅడ్డదిడ్డంగా వెనుకా ముందు అన్నది చూసుకోకుండా.. నోటికి వచ్చిన తిట్లను తిట్టేయటం అందరికి సాధ్యం కాదు. అలా మాట్లాడుతూనే.. అందుకు భిన్నంగా నీతులు చెప్పటం అందరికి అయ్యే పని కాదు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టాలెంట్ ను మెచ్చుకోకుండా ఉండలేం. ఇదే విషయాన్ని ఆయన్ను అభిమానించే వారు మరో విధంగా చెబుతుంటారు. ఎవరికి ఎలా చెబితే అర్థమవుతుందో.. తమ అధినాయకుడు అలా చెబుతుంటాడని.. అందులో తప్పేమీ లేదంటారు. అదే సమయంలో.. ఊర మాస్ మాత్రమే కాదు.. క్లాసిక్ కామెంట్లు కూడా మా నేతకు వస్తాయన్న విషయం మీకు అర్థమైంది కదా? మా వాడిని ఎలా ఉంచాలన్నది ప్రత్యర్థి పార్టీల మీదనే ఆధారపడి ఉంటుందంటూ రేవంత్ మాదిరి గడుసుగా మాటలు మాట్లాడతారు.
ఇంతకూ సీఎం రేవంత్ మాటల టాలెంట్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే.. తాజాగా బీజేపీ సీనియర్ నేత.. తమిళనాడు.. మహారాష్ట్రలకు గవర్నర్ గా గతంలో పని చేసిన చెన్నమనేని విద్యాసాగర్ రావు ఆత్మకథ ‘ఉనక’ (పుస్తకం పేరు ఇదే. తప్పుగా రాయలేదు. ఉనికి అనుకోవచ్చు కానీ ఆయన పుస్తకం పేరు ‘ఉనక’ అని పెట్టుకున్నారు) పుస్తకాన్ని ఆవిష్కరించే కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరయ్యారు. ఇలాంటి సభల్లో ఎలా మాట్లాడాలో రేవంత్ కు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదు. అందుకు తగ్గట్లే ఆయన మాటలు ఉన్నాయని చెప్పాలి.
ఈ కార్యక్రమం స్పెషల్ ఏమంటే.. కాంగ్రెస్ నేతలతో పాటు.. బీజేపీ నేతలు పలువురు హాజరయ్యారు. ఈ విచిత్రమైన కాంబినేషన్ లో ఏర్పాటు చేసిన సభలో.. రేవంత్ క్లాసిక్ టచ్ మాటలతో అందరిని ఆకట్టుకోవటమే కాదు.. రేవంత్ ఇలా కూడా మాట్లాడగలరా? అంటూ పలువురిని విస్మయానికి గురి చేశారు. ఇంతకూ రేవంత్ చేసిన వ్యాఖ్యల్లోని కొన్నింటిని చూస్తే.. ఆయన టాలెంట్ ఇట్టే అర్థమవుతుంది.
- ప్రభుత్వమంటే అధికార పక్ష సభ్యులే కాదు. అన్ని పార్టీల సభ్యులు కలిస్తేనే ప్రభుత్వం. రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు కలిస్తేనే ప్రభుత్వం. కేవలం 65 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలను మాత్రమే ప్రభుత్వంగా భావించటం పొరపాటు.
- ఎన్నికల వేళలో మాత్రమే వేర్వేరుగా పోరాడాలి. ఎన్నికల తర్వాత అన్ని వర్గాలు కలిసి డెవలప్ మెంట్ వైపు ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. పాలకపక్షం.. ప్రతిపక్షం కలిస్తేనే ప్రభుత్వం. అసెంబ్లీలో ముఖ్యమంత్రికి ఎంతసేపు మైకు ఇస్తారో.. ప్రధాన ప్రతిపక్ష నేతకు కూడా అంతే సమయం మైకు ఇస్తారు.
- ఉమ్మడి ఏపీలో బీజేపీ ప్రాతినిధ్యం చాలా తక్కువే అయినప్పటికీ.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చాలా విషయాలు లేవనెత్తేవారు.కమ్యూనిస్టులు కూడా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడేవారు. అసెంబ్లీ వాయిదా పడితే పాలకపక్షం.. ప్రతిపక్షం చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకునే పరిస్థితులు ఉండేవి. అలాంటి వాతావరణం నెలకొల్పేందుకు ప్రజాప్రభుత్వం ప్రయత్నిస్తుంది.
- 13 నెలల ప్రజా పాలనలో ఒక్క ప్రతిపక్ష సభ్యుడిని కూడా సస్పెండ్ చేయలేదు. రాష్ట్రానికి ఏదైనా సమస్యలు వస్తే తమిళనాడులో అధికార.. ప్రతిపక్ష పార్టీలు ఒక్కటి అవుతాయి. అలాంటి కల్చర్ తెలంగాణలో కూడా పెరగాలి. రాష్ట్ర డెవలప్ మెంట్ కంటే రాజకీయాలు ముఖ్యం కాదు. ఈ విషయంలో ప్రజా ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు పోదు.
- హైదరాబాద్ విశ్వ నగరంలా మారాలంటే మైట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. రీజినల్ రింగ్ రోడ్డు..రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టులపై కేంద్ర కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. అందుకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి.. బండి సంజయ్ లు ప్రత్యేక చొరవ తీసుకోవాలి.
- విద్యాసాగర్ రావు వ్యక్తిత్వాన్ని ఎవరూ విమర్శించరు. రాజకీయ చైతన్యం అధికంగా ఉండే తమిళనాడు రాష్ట్రానికి.. అలానే ఆర్థిక కేంద్రం మహారాష్ట్రకు ఒకేసారి గవర్నర్ గా పని చేసిన ఆయన.. జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రతిష్ఠను పెంచారు.