Begin typing your search above and press return to search.

హ‌లో కేటీఆర్‌... రేవంత్ నీకంటే ఎంత ఫాస్ట్ ఉన్నాడో చూడు!

న‌ల్ల‌గొండ జిల్లాలో రేవంత్ రెడ్డి ప‌ర్య‌టించి పాద‌యాత్ర చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. వలిగొండ మండలంలో రేవంత్ పాదయాత్ర ఉండనుందని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   4 Nov 2024 9:30 PM GMT
హ‌లో కేటీఆర్‌... రేవంత్ నీకంటే ఎంత ఫాస్ట్ ఉన్నాడో చూడు!
X

తెలంగాణ‌ రాజ‌కీయాలు మునుపెన్న‌డూ లేనంత‌గా హాట్ హాట్ గా మారుతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి త‌న ప‌ద‌వీకాలం ఏడాది పూర్త‌వుతున్న సంద‌ర్భంగా వార్షికోత్స‌వానికి ఓ వైపు గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసుకుంటుంటే... మ‌రోవైపు ఏడాదిలో చేసింది ఏంటి అంటూ బీఆర్ఎస్ పార్టీ ఎదురుదాడికి దిగుతోంది. ఇలాంటి స‌మ‌యంలోనే మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న‌లు వెలుగులోకి వ‌స్తున్నాయి. అదే పాద‌యాత్ర‌ల ట్రెండ్‌. ఇటీవ‌లే బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాను పాద‌యాత్ర చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే, ఈ విష‌యంలో సీఎం రేవంత్ రెడ్డి ఓ అడుగు ముందుకువేశారు.

త‌న క‌ల‌ల ప్రాజెక్టుగా మూసీ పునరుజ్జీవం అంశాన్ని రేవంత్ రెడ్డి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే, మూసీలో కాలుష్యం నిర్మూలనకు ప్రభుత్వం చేయనున్న కార్యక్రమాల విష‌యంలో రేవంత్ రెడ్డికి స‌వాళ్లు, స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయి. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో నిర్వాసితుల ఆందోళనలు, వారికి ప్రతిపక్షాల మద్దతు త‌ల‌నొప్పిగా మారాయి. దీంతో నదీ గర్భంలో నిర్మాణాలు చేసుకున్న వారిలో మెజారిటీ మందికి డబుల్ బెడ్రూంలు ఇచ్చి అక్కడికి తరలించింది. అయితే, దీనికి కొన‌సాగింపుగా పాద‌యాత్ర అంశాన్ని రేవంత్ రెడ్డి ప‌రిశీలించ‌డ‌మే కాకుండా ఓకే చెప్పిన‌ట్లు స‌మాచారం. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని ఈ నెల 8న పుట్టిన రోజు సందర్భంగా దర్శించుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి అనంతరం యాదాద్రి జిల్లాలో మూసీ వెంట పాదయాత్ర చేయనున్నారు.

న‌ల్ల‌గొండ జిల్లాలో రేవంత్ రెడ్డి ప‌ర్య‌టించి పాద‌యాత్ర చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. వలిగొండ మండలంలో రేవంత్ పాదయాత్ర ఉండనుందని తెలుస్తోంది. ఈ పాదయాత్రలో భాగంగా మూసీ పరివాహక ప్రాంతంలోని రైతులు, ప్రజలను రేవంత్ రెడ్డి కలవనున్నారు. మూసీలో కాలుష్యం నిర్మూలనకు ప్రభుత్వం చేయనున్న కార్యక్రమాలను వారికి వివరించనున్నారు. వారి ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు. వారి నుంచి కూడా సీఎం సలహాలు అడిగి తెలుసుకుంటారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

కాగా, త్వ‌ర‌లో త‌న పాద‌యాత్ర ఉంటుంద‌ని కేటీఆర్ ప్ర‌క‌టించి ఇందుకు క‌స‌ర‌త్తు చేస్తుంటే ... రేవంత్ మాత్రం పాద‌యాత్ర‌కు సంబంధించిన కార్యాచ‌ర‌ణ సిద్ధం చేసేశార‌ని అంటున్నారు. ప్ర‌జ‌ల‌ను క‌లుసుకునేందుకు, త‌న క‌ల‌ల ప్లాన్ వివ‌రించేందుకు రేవంత్ రెడ్డి ప్ర‌జాక్షేత్రంలోకి చేరుకుంటున్నార‌ని విశ్లేషిస్తున్నారు. సీఎం హోదాలోనే రేవంత్ రెడ్డి చేసే పాద‌యాత్ర‌కు మ‌ద్ద‌తు, జ‌న స‌మీక‌ర‌ణతో మైలైజీ పొంద‌డం సాధ్య‌మ‌వుతుంద‌ని, ఈ విష‌యంలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెనుక‌బ‌డిపోయార‌ని చ‌ర్చించుకుంటున్నారు.