Begin typing your search above and press return to search.

రేవంత్ వర్సెస్ కేటీఆర్.. తెలంగాణలో స్టేటస్ పాలిటిక్స్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే సచివాలయం ముందు రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

By:  Tupaki Desk   |   17 Sep 2024 9:00 AM GMT
రేవంత్ వర్సెస్ కేటీఆర్.. తెలంగాణలో స్టేటస్ పాలిటిక్స్
X

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే సచివాలయం ముందు రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దానిని నిన్న ఘనంగా ఆవిష్కరించారు కూడా. ఈ విగ్రహం ఏర్పాటుతో రాష్ట్ర రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ల వరకూ దారితీసింది.

రాజీవ్ గాంధీ విగ్రహంతో బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యమంత్రిపై ఇష్టారీతిన విమర్శలు చేస్తున్నారు. అయితే.. వారిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంకా ముందు వరుసలో ఉన్నారు. సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటును ఆయన ముందు నుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రికి సవాళ్లు విసురుతూ వచ్చారు. విగ్రహం ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య చాలా సందర్భాల్లోనూ మాటలయుద్ధం కొనసాగింది.

సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే ఊరుకునేది లేదని, దానిని తాము అధికారంలోకి వచ్చాక తొలగిస్తామని కేటీఆర్ సవాల్ చేశారు రాజీవ్ విగ్రహం ప్లేసులో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. దానికి రేవంత్ రెడ్డి బదులిస్తై.. టచ్ చేసి చూడండి అంటూ ఘాటు రిప్లై ఇచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహం మీరు అధికారంలో ఉన్న పదేళ్లలో ఎందుకు గుర్తుకు రాలేదంటూ ప్రశ్నించారు.

ఎట్టకేలకు నిన్న విగ్రహాన్ని ప్రారంభించడంతో ఆ వివాదం మరింత రాజుకుంది. విగ్రహం ఏర్పాటైన సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సచివాలయం త్రిమూర్తుల సంగమం అంటూ ప్రస్తావించారు. అంబేద్కర్ సచివాలయం ముందు పవిత్ర త్రిమూర్తులు, అమరజ్యోతి నడుమ తెలంగాణ తల్లి విగ్రహం నిలువెత్తు నిదర్శనమని చెప్పుకొచ్చారు. కానీ.. రేవంత్ రెడ్డి మాత్రం సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి తెలంగాణ మొత్తాన్ని కించపరిచారని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని విమర్శించారు. బీఆర్ఎస్ తప్పకుండా మళ్లీ అధికారంలోకి వస్తుందని.. తాము అధికారం చేపట్టాక ఆ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్‌కు లేదంటే జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి ఇంటికి పంపిస్తామని చెప్పారు.

దీనికి రేవంత్ రెడ్డి సైతం కౌంటర్ ఇచ్చారు. భారతదేశంలో ఐటీ విప్లవం రాజీవ్ గాంధీ వల్లనే ప్రారంభమైందని, రాజీవ్ గాంధీ వల్లనే కేటీఆర్ ఐటీ మంత్రి అయిండని పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన వల్లనే ట్విట్టర్ వాడుతున్నాడని.. అదే లేకుంటే గుంటూరు లేదా సిద్దిపేట రోడ్ల మీద ఇడ్లీ, వడలు అమ్ముతూ ఉండేవాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు మరోసారి రేవంత్, కేటీఆర్ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లకు దారితీసిందనే చెప్పాలి. ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు స్టేటస్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారనే టాక్ నడుస్తోంది.