ఆ ముగ్గురు తెలంగాణ మంత్రులపై వేటు..? మరొకరిపైనా?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు దాటింది.. ఇప్పటికీ హోం శాఖకు మంత్రి లేరు. విద్యా శాఖకు మంత్రి లేరు.
By: Tupaki Desk | 13 Jan 2025 4:36 AM GMTతెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు దాటింది.. ఇప్పటికీ హోం శాఖకు మంత్రి లేరు. విద్యా శాఖకు మంత్రి లేరు. ఈ రెండూ శాఖలు సీఎం రేవంత్ రెడ్డి వద్దనే కొనసాగుతున్నాయి. సహజంగా మంత్రులెవరికీ వీటిని కేటాయించలేదు కాబట్టి సీఎం వద్దనే ఉన్నాయి. అయితే, తెలంగాణలో శాసన సభ్యుల సంఖ్య 119 కాగా.. ముఖ్యమంత్రి సహా 18 మంత్రులు ఉండాలి. ప్రస్తుతం 12 మంది ఉన్నారు. అంటే క్యాబినెట్ లో మరో ఆరు ఖాళీలు ఉన్నాయి. వీటిని భర్తీ చేస్తారంటూ ఆరు నెలల నుంచి పెద్దఎత్తున ఊహాగానాలు సాగుతున్నాయి. కానీ, ముహూర్తం మాత్రం కుదరడం లేదు. వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలలకే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, లోక్ సభ ఎన్నికలు వచ్చాయి. ఆ కోడ్ తో కొంత కాలం పోయింది. కోడ్ ముగిసిన తర్వాత మాత్రం జరుగుతున్నదంతా ఆలస్యమే.
నాలుగు జిల్లాలకు మంత్రులే లేరు
దేశంలోనే కీలక నగరం, తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు ఇంతవరకు మంత్రి లేరు. దీని పొరుగునే ఉండే కీలక జిల్లా రంగారెడ్డికీ మంత్రి లేరు. ఆదిలాబాద్, నిజామాబాద్ కూ మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కొరవడింది. దీన్నిబట్టే విస్తరణ ఎంత అవసరమో తెలుస్తోంది. అయితే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ లో కాంగ్రెస్ ఒక్క సీటునూ గెలవలేదు. ఉప ఎన్నికలో మాత్రం కంటోన్మెంట్ (ఎస్సీ రిజర్వుడ్) సీటును వశం చేసుకుంది. దానం నాగేందర్ (ఖైరతాబాద్)ను కాంగ్రెస్ లో చేర్చుకున్నా ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. రంగారెడ్డి జిల్లాలోనూ కాంగ్రెస్ గెలిచింది తక్కువ సీట్లే. ఈ జిల్లా నుంచి స్పీకర్ ఉన్నారు.
ఆ ముగ్గురిని తప్పిస్తారా?
తెలంగాణ మంత్రివర్గం విస్తరణ సంగతి అటుంచితే.. ముగ్గురు మంత్రులను తొలగిస్తారంటూ కథనాలు వస్తున్నాయి. వీరు ప్రభావశీలురైన, అనుభవం ఉన్న కీలక నాయకులు కావడం గమనార్హం. తొలంగింపు జాబితాలో ఉన్నవారిలో ఖమ్మంకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు (వ్యవసాయం), నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన జూపల్లి క్రిష్ణారావు (ఎక్సైజ్), వరంగల్ జిల్లా మంత్రి కొండా సురేఖ (దేవాదాయ) ఉన్నట్లు చెబుతున్నారు. సీఎం రేవంత్ సర్వేలో వీరిపై ప్రతికూల అభిప్రాయం రావడమే దీనికి కారణం అంటున్నారు.
తెలంగాణ క్యాబినెట్ లో తుమ్మల అత్యంత సీనియర్ మంత్రి. ఎన్టీఆర్ నుంచి కేసీఆర్ వరకు ముగ్గురు సీఎంల వద్ద 15 ఏళ్లకు పైగా మంత్రిగా ఉన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్న తుమ్మల తెలంగాణ ఏర్పాటు తదనంతర పరిణామాల్లో బీఆర్ఎస్ లోకి వచ్చారు. ఏడాదిన్నర కిందట పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరారు. కాగా, రేవంత్ ప్రభుత్వ వ్యవసాయ పథకాల అమలుపై తుమ్మల అయిష్టతతో ఉన్నారని చెబుతున్నారు.
స్వతహాగా కాంగ్రెస్ వాది అయిన జూపల్లి ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్, కిరణ్ కుమార్ రెడ్డి సీఎంలుగా ఉండా మంత్రిగా కొనసాగారు. 2010లో బీఆర్ఎస్ లో చేరారు. ఆ పార్టీ నుంచి తుమ్మలతో పాటు కాంగ్రెస్ లో చేరారు.
కొండా సురేఖ వైఎస్ రెండోసారి సీఎం అయ్యాక 2009లో తొలిసారి మంత్రి పదవి చేపట్టారు. వైఎస్ దుర్మరణం అనంతరం మంత్రి పదవిని వదులుకున్నారు. 2014 తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. 2018లో టికెట్ రాలేదు. దీంతో కాంగ్రెస్ లోకి తిరిగొచ్చారు. 2023లో విజయం అనంతరం మంత్రి అయ్యారు. కానీ, తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు.
వైద్య శాఖ మంత్రి దామోదర- సీఎం రేవంత్ మధ్యనా సత్సంబంధాలు లేవని అంటున్నారు. దామోదర మంత్రి అయ్యాక వైద్య శాఖ పనితీరు మెరుగుపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, సీఎంతో మాత్రం సత్సంబంధాలు కొరవడ్డాయట. దామోదర లేకుండానే శనివారం ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనం శంకుస్థాపనపై సమీక్ష నిర్వహించడం దీనినే సూచిస్తోందని చెబుతున్నారు.
కాగా, మంత్రుల తొలగింపుపై సీఎం రేవంత్ ఇప్పటికే కాంగ్రెస్ హై కమాండ్ కు నివేదించారట. అటునుంచి స్పందన రావాల్సి ఉంది. ఒకవేళ సీఎం కోరిక మేరకు మంత్రులను తొలగిస్తే అది కలకలమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.