రేవంత్ చూపు 'అధినేత' వైపే.. 'కుట్ర' నిజమైతే కష్టమే !
ఒకవైపు ఎమ్మెల్యేల ఫిరాయింపులపై న్యాయ పోరాటం చేస్తున్న బీఆర్ ఎస్.. ఇలాంటి సమయంలో వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయంగా మారింది.
By: Tupaki Desk | 13 Sep 2024 12:14 PM GMTతెలంగాణలో చోటు చేసుకున్న పరిణామాలు.. మరో సారి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. రాజకీయంగా వివాదాలు లేని రాష్ట్రం లేదు. కానీ, ప్రజల సెంటిమెంట్లను మరోసారి రెచ్చగొట్టే క్రతువు ఇప్పుడు రాజకీయ దుమారానికి దారి తీస్తోంది. బీఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన నాన్ లోకల్-లోకల్ వ్యాఖ్యలు.. క్షేత్రస్థాయిలో ప్రభావం చూపి తే.. అవి మరో ఉద్యమానికి దారి తీసే అవకాశం లేకపోలేదని.. ప్రభుత్వం భావిస్తోంది. అందుకే.. ముందుగానే అలెర్ట్ అయింది.
ఒకవైపు ఎమ్మెల్యేల ఫిరాయింపులపై న్యాయ పోరాటం చేస్తున్న బీఆర్ ఎస్.. ఇలాంటి సమయంలో వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయంగా మారింది. దీని వెనుక ఏదో దురుద్దేశం ఉందని కూడా చర్చ సాగుతోంది. రేవంత్‌రెడ్డి సర్కారు కూలిపోతుందని.. మూణ్ణాళ్ల ముచ్చటేనని బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గతంలోనే కాదు.. ఆయన మీడియా ముందుకు ఎప్పుడు వచ్చినా వినిపిస్తున్న మాట. అయితే.. ఈ వ్యాఖ్యలను అందరూ లైట్ తీసుకున్నారు. మరోవైపు.. కేసీఆర్ ఏమైనా చేయొచ్చన్న భావన ఉందేమో.. రేవంత్ ఫిరాయింపులను ప్రోత్సహించారన్నవాదన వినిపించింది.
ఈ ఫిరాయింపులపైనే బీఆర్ ఎస్ న్యాయ పోరాటం చేస్తోంది. అయితే.. ఈ విషయం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఈ క్రమంలో పాడి కౌశిక్‌రెడ్డి ``స్థానికేతరులకు అసెంబ్లీలో చోటు లేదు`` అని వ్యాఖ్యానించడం.. కలకలం రేపింది. ఆ వెంటనే సీఎం రేవంత్ కూడా రియాక్ట్ అయ్యారు. స్థానికేతరుల ఓట్లు కావాలికానీ.. సీట్లు ఇవ్వకూడదా? అని ఆయన నిలదీశారు. ఇంతలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి బీఆర్ ఎస్ నేతలు పిలుపునిచ్చారు. దీనిని సమర్థంగా ఎదుర్కొనేందుకు రేవంత్‌రెడ్డి సర్కారు అడుగులు వేసింది.
అయితే.. ఇప్పుడు అసలు స్టోరీపై సీఎం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని వ్యూహాత్మకంగా మాజీ సీఎం రంగంలోకిదింపారని ఆయన భావిస్తున్నారు. కేసీఆర్ చెప్పకుండా.. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ధైర్యం.. సాహసం పాడికి లేవని.. ఈ మొత్తం వ్యవహారం వెనుక.. అధినేతే ఉన్నారని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు.. రాష్ట్రంలో మరోసారి నాన్ లోకల్-లోకల్ ఉద్యమం తీసుకు వస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కుట్ర నిజమైతే.. కేసీఆర్‌ను సైతం అరెస్టు చేసేఅవకాశం ఉందని పార్టీ వర్గాల మధ్య చర్చగా మారింది. చూడాలి మరి ఏం జరుగుతుందో.