రేవంత్ వారి రైతుభరోసా వచ్చేసింది.. కీలక అంశాలేమంటే?
ఇదిలా ఉంటే.. శనివారం ముగిసిన మంత్రివర్గ సమావేశం అనంతరం.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
By: Tupaki Desk | 5 Jan 2025 5:30 AM GMTరేవంత్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఒక అంశంపై తరచూ ఆసక్తికర చర్చ నడుస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధును రేవంత్ సర్కారు కంటిన్యూ చేస్తుందా? లేదా? అని. గత ప్రభుత్వం ఏకరానికి రూ.10వేలు చొప్పున ఇస్తే.. తమ పాలనలో ఎకరానికి రూ.12వేలు ఇస్తామని చెప్పిన రేవంత్.. తమ ప్రభుత్వ హయాంలో అలాంటి ప్రకటన ఏమీ చేయకపోవటంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే.. శనివారం ముగిసిన మంత్రివర్గ సమావేశం అనంతరం.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
గత ప్రభుత్వం రైతుబంధు కింద ఎకరానికి రూ.10వేలు ఇస్తే.. తమ ప్రజాపాలనలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ.2వేలు అదనంగా పెంచి అందరికి రూ.12వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా పేర్కొన్నారు. భూములున్న వారికి రైతుభరోసా వస్తుందని.. భూములు లేని వారికి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ ఇస్తామని వెల్లడించారు. తండాలు.. గూడెల్లోని వ్యవసాయ రైతుకుటుంబాలకు భూమి లేకపోవటం శాపమవుతుందని.. అలాంటి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు రేవంత్ రెడ్డి.
తాను.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటనలకు వెళ్లినప్పుడు ఈ విషయాన్ని పలువురు తమ ద్రష్టికి తీసుకొచ్చినట్లు చెప్పిన సీఎం రేవంత్.. ‘భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదికి రూ.12వేలు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించాం. ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంగా నామకరణం చేస్తున్నాం’’ అని చెప్పారు. అదే సమయంలో తాము అందించే రైతు భరోసాకు పరిమితుల్ని చెప్పేశారు సీఎం రేవంత్.
రాళ్లూరప్పలు.. కొండలు.. గుట్టలు.. స్థిరాస్తి వెంచర్లు.. రహదారులు.. నివాస.. పారిశ్రామిక.. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే భూములు.. నాలా మార్పిడి చేసినవి.. వివిధ ప్రాజెక్టులకు ప్రభుత్వం సేకరించిన.. వ్యవసాయయోగ్యం కాని భూములకు రైతు భరోసా వర్తించదని ముఖ్యమంత్రి తేల్చేశారు. ఈ సమాచారాన్ని గ్రామసభలు నిర్వహించి ప్రజలకు వివరిస్తారన్నారు.
రైతుల నుంచి ఎలాంటి దరఖాస్తుల అవసరం లేకుండానే రైతుభరోసాను చెల్లించాలని డిసైడ్ చేశారు. వ్యవసాయ యోగ్యమైన భూమికే ఇవ్వాలన్న నిర్ణయం నేపథ్యంలో.. మళ్లీ దరఖాస్తు చేయాలా? అన్న సందేహానికి బదులు చెబుతూ.. ఆ అవసరం లేదని తేల్చారు.
రెవెన్యూ రికార్డులు.. ధరణి లోపాల కారణంగా పరిశ్రమలకు.. స్థిరాస్తి భూములు.. ప్రభుత్వం సేకరించిన భూములకు రైతుబంధు ఇచ్చినట్లుగా చెప్పిన సీఎం.. రైతుభరోసాలో అలా జరగదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగానే రైతుభరోసా కోసం సాయాన్ని రూ.10వేల నుంచి రూ.12 వేలకు పెంచామని.. భూమిలేని పేదలకు రూ.12 వేలు ఇస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఆదాయ వనరులు పెంచటం.. పేదలకు పంచటమే తమ ప్రభుత్వ విధానంగా ముఖ్యమంత్రి రేవంత్ చెప్పుకోవటం గమనార్హం.