పెద్ద మాటలు చెప్పే రేవంత్.. ఈ ప్రశ్నలకు బదులిస్తారా?
ఆయన తర్వాత తెలంగాణ రాష్ట్ర పాలనా పగ్గాలు అందుకున్న రేవంత్ రెడ్డిలు కావొచ్చు.
By: Tupaki Desk | 20 Nov 2024 4:51 AM GMTదీన్ని అదృష్టమని అనాలో.. తెలంగాణ ప్రజల దురదృష్టం అనాలో అర్థం కాని పరిస్థితి. మాటలతో మనసుల్ని ఆకట్టుకునే పాలకుడు ఉంటే ఆ సౌలభ్యం వేరుగా ఉంటుంది. దీనికి కారణం.. ప్రభుత్వం చేపట్టే పనులు.. చేస్తున్న పనుల గురించి వివరంగా చెప్పే వీలు ఇలాంటి అధినేత కారణంగా ఉంటుంది. అదే సమయంలో విపక్షాల విమర్శలకు సైతం సమాధానాలు చెప్పే అవకాశం ఉంటుంది. తెలంగాణలో మాటలతో మనసు దోచుకునే నేతలకు కొదవ లేదు. రాష్ట్రం ఏర్పడినంతనే అధికారంలోకి వచ్చి.. పదేళ్లు అప్రతిహతంగా సాగిన కేసీఆర్ కావొచ్చు. ఆయన తర్వాత తెలంగాణ రాష్ట్ర పాలనా పగ్గాలు అందుకున్న రేవంత్ రెడ్డిలు కావొచ్చు. ఇద్దరు మాటల్లో సమ ఉజ్జీలే.
అయితే.. ఈ ఇద్దరి అధినేతలు తమ మాటకారితనాన్ని రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుతున్నారే తప్పించి.. రాష్ట్ర శ్రేయస్సు కోసం కాదన్న విమర్శ ఉంది. పదేళ్లు తన మాటలతో కేసీఆర్ నెట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆయన పాలనలోని లోపాల్ని ఎత్తిచూపుతూ.. ఘాటైన విమర్శలతో ఆయనకు ప్రత్యర్థిగా బరిలోకి వచ్చి.. ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి సైతం.. అధికారంలో ఉన్న వేళ మాటల్నే నమ్ముకుంటున్నారు. పాలన మీద ఆయన ఎంత పట్టు సాధించారన్నది పక్కన పెడితే.. ప్రతిపక్ష నేతపై మాటలతో విరుచుకుపడే విషయంలో మాత్రం తన సామర్థ్యాన్ని నూటికి నూరుశాతం ప్రదర్శిస్తున్నారని చెప్పక తప్పదు.
తాజాగా ఆయన గులాబీ నేత కేసీఆర్ ను ఉద్దేశించి ఘాటైన విమర్శలు చేశారు. కేసీఆర్ అనే మొక్కను ఇక మొలవనివ్వనంటూ చాలా పెద్ద మాటే అనేశారు. ఒకవేళ.. అదే నిజమనుకుంటే.. ఆ విషయాన్ని రేవంత్ ప్రస్తావించాల్సిన అవసరం ఏమిటి? అన్నది ప్రశ్న. ప్రజల మదిలో కేసీఆర్ లేకపోతే.. ఆయన ప్రస్తావనను రేవంత్ ఎందుకు తీసుకొస్తున్నట్లు? అన్న సందేహానికి ఆయన సమాధానం ఏమిటి? అన్నది ప్రశ్న. అసెంబ్లీకి రాని కేసీఆర్ ను.. అదే పనిగా అసెంబ్లీకి రావాలని.. చర్చలో పాల్గొనాలని ప్రస్తావించాల్సిన అవసరం ఏమిటి? తమను పట్టించుకోని నేత గురించి ప్రజలు పట్టించుకోరు. అలాంటప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ ఎందుకు అదే పనిగా పట్టించుకుంటున్నట్లు? అన్నది మరో ప్రశ్న.
రేవంత్ ప్రభుత్వం కొలువు తీరి దగ్గర దగ్గర 11 నెలలు దాటేసింది. అందులో నాలుగైదు నెలలు లోక్ సభ ఎన్నికలకు పోయిందని అనుకుందాం. మిగిలిన ఆర్నెల్ల కాలంలో పాలన మీద ప్రభుత్వం పట్టు ఎందుకు తెచ్చుకోలేకపోతోంది. పాలన వరకు ఎందుకు? ప్రతిపక్ష నేతలు సంధిస్తున్న ప్రశ్నలకు.. విమర్శలకు ధీటుగా సమాధానాలు ఎందుకు ఇవ్వలేకపోతోంది. తనకు అన్నీ తెలుసని అదే పనిగా చెప్పుకునే రేవంత్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన11 నెలలుగా రియల్ ఎస్టేట్ ఎందుకు పడకేసింది? దాని స్టేటస్ లో ఎందుకు మార్పులు రావట్లేదు? అలీబాబా అద్భుత దీపం తన చేతిలో ఉన్నట్లు.. తాను ఏమైనా చేసేయగలనని.. తాను చెప్పినవన్నీ చెప్పినట్లే జరుగుతున్నట్లుగా రాజకీయ వ్యాఖ్యలు చేసే సీఎం రేవంత్ మాటల్ని విన్నంతనే.. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ సైతం ఇలానే మాట్లాడిన విషయాన్ని మర్చిపోకూడదు. అందుకే.. పెద్ద పెద్ద మాటల్ని మాట్లాడే ముందు.. ప్రజల నుంచి వస్తున్న చిన్న చిన్న సందేహాలకు సరైన రీతిలో సమాధానం చెప్పేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. దీనిపై సీఎం రేవంత్ ఎప్పుడు ఫోకస్ చేస్తారంటారు?