Begin typing your search above and press return to search.

మహారాష్ట్ర ప్రాజెక్టులు గుజరాత్‌కు.. మోడీపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

ప్రధాని మోడీని టార్గెట్ చేసుకొని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.

By:  Tupaki Desk   |   9 Nov 2024 9:33 AM GMT
మహారాష్ట్ర ప్రాజెక్టులు గుజరాత్‌కు.. మోడీపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
X

నిన్న మూసీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈ రోజు ఉదయం మహారాష్ట్రకు చేరుకున్నారు. అక్కడ ఎన్నికల తంతు జరుగుతుండడంతో.. ప్రచారంలో భాగంగా రేవంత్ అక్కడికి వెళ్లారు. ఈ నెల 20న మహారాష్ట్రలో పోలింగ్ జరగబోతోంది. అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం వరకు అక్కడే ఉండి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీని టార్గెట్ చేసుకొని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.

కొంత కాలంగా మహారాష్ట్ర బీజేపీ నేతలు తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని రేవంత్ అన్నారు. చివరకు ప్రధాని కూడా తెలంగాణలో అమలవుతున్న గ్యారంటీలపై అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టారని ఆరోపించారు. మోడీ, బీజేపీ నేతలు ఇప్పటికైనా అబద్ధాలు చెప్పడం మానుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు తాము నిజాలు వెల్లడిస్తూనే ఉంటామని రేవంత్ తనదైన స్టైల్‌లో మాస్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో విజయవంతంగా అమలవుతున్న గ్యారంటీ గురించి మహారాష్ట్ర ప్రజలకు వివరించేందుకే తాను వచ్చానని తెలిపారు.

మోడీ నల్ల చట్టాలు తీసకొచ్చి అదానీ, అంబానీలకే మేలు చేయాలని మోడీ అనుకున్నారని, దేశంలోనే మహారాష్ట్రలో ఎక్కువగా రైతుల ఆత్మహత్యలు జరిగాయని రేవంత్ వెల్లడించారు. తెలంగాణలో రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని చెప్పారు. వాటికి సంబంధించిన లెక్కలు కావాలన్నా ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. దేశంలో మోడీ రైతుల సంక్షేమం మరిచిపోయారన్నారు. రైతుల విషయంలో మోడీ విమర్శలకు తాము గట్టి సమాధానం ఇచ్చామని, దాంతో మోడీ తన ట్వీట్‌ను దెబ్బకు డెలిట్ చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. మహాలక్ష్మీ పథకం ద్వార రూ.500లకే గ్యాస్ అందిస్తున్నట్లు తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా 50 లక్షల మంది లబ్ధిపొందుతున్నారని అక్కడి ప్రజలకు వివరించారు.

ఎందరో మహానుభావులకు మహారాష్ట్ర గడ్డ జన్మనిచ్చిందని రేవంత్ కొనియాడారు. మహాత్మా జ్యోతిబాపూలే, బాలగంగాధర్ తిలక్, సావిత్రిబాయి పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి ఎందరో మహానుభావులు ఇక్కడి వారే అని చెప్పారు. వీరంతా ప్రజల్లో చైతన్యం నింపడమే కాకుండా ఎందరికో దారిచూపారని అన్నారు. అయితే.. మహారాష్ట్రకు 17 మెగా ప్రాజెక్టులు రావాల్సి ఉందని, కానీ వాటిని మోడీ గుజరాత్‌కు తరలించుకుపోయారని ఆరోపించారు. మోసం చేసిన బీజేపీని ఓడించండి అంటూ రేవంత్ పిలుపునిచ్చారు.