రేవంత్ దూకుడుకు ఇక హైడ్రా మరింత స్పీడప్!
మంచి తలిస్తే దైవం ఎప్పుడూ అండగా నిలుస్తుందని అంటుంటారు.
By: Tupaki Desk | 5 Sep 2024 2:30 PM GMTమంచి తలిస్తే దైవం ఎప్పుడూ అండగా నిలుస్తుందని అంటుంటారు. బహుషా.. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలోనూ అదే జరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. ఆయన ఏ పనికి సంకల్పించినా.. ఏదో ఒక రూపంలో మాత్రం కలిసివస్తూనే ఉంది. ప్రతిపక్షాలు ఓ వైపు విమర్శల దాడి చేస్తున్నా.. చివరకు కాలం కూడా రేవంత్‌కు అండగా నిలుస్తోందని చెప్పొచ్చు.
అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లో వరుసగా దూకుడు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు రేవంత్. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెరువులను, కుంటలను కాపాడేందుకు ఆయన మరో కీలక వ్యవస్థకు రూపకల్పన చేశారు. అక్రమ కట్టడాల కూల్చివేయడమే లక్ష్యంగా హైడ్రాకు పురుడు పోశారు. దానికి సీనియర్ ఐపీఎస్‌ను కమిషనర్‌గా నియమించారు. చెరువులను ఆక్రమించి.. ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమంగా వెలిసిన కట్టడాలను కూల్చడమే ఈ హైడ్రా ప్రధాన ఉద్దేశం.
హైడ్రాకు రూపుకల్పన చేయడమే తరువాయి.. ఆ తరువాతి రోజు నుంచే తన కార్యకలాపాలను ప్రారంభించింది. అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ వస్తోంది. మన పార్టీ, వేరే పార్టీ అని తేడా లేకుండా.. పేద, పెద్ద అనే భేదాలు లేకుండా.. అందరి భరతం పడుతోంది. అయితే.. దీనిపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శలు చేస్తూ వచ్చారు. హైదరాబాద్‌ను మరో బుల్డోజర్ నగరంగా మారుస్తున్నారంటూ కేటీఆర్ ఏకంగా కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. కానీ.. హైకమాండ్ నుంచి కూడా రేవంత్‌కే సపోర్టు లభించింది.
కట్ చేస్తే.. రాష్ట్రంలో ఏటా విపత్తుకు కారణం నీటి వ్యవస్థలను కొల్లగొట్టడమే అనేది రేవంత్ రెడ్డి అభిప్రాయం. అందుకే.. చెరువులను కాపాడుకోవాలని, కుంటలను సంరక్షించాలని ఆయన సంకల్పించారు. అందుకే హైడ్రాను తీసుకొచ్చారు. అక్రమ కట్టడాలను కూల్చి మళ్లీ పాత చెరువులకు ప్రాణం పోసేందుకు నడుం బిగించారు.
తాజాగా.. ఖమ్మం, వరంగల్ నగరాలను వరదలు ముంచెత్తాయి. ఇటు హైదరాబాద్‌లోనూ అక్కడక్కడ వరదలు ప్రజలను ఇబ్బందుల పాలుచేశాయి. ఇప్పుడు ఈ వరదలు కాస్త రేవంత్ రెడ్డి చేస్తుంది కరెక్ట్ అనే భావన అందరిలోనూ వచ్చింది . ఇష్టారాజ్యంగా చెరువుల, కుంటలను కబ్జాలు చేసి నిర్మాణాలు చేపట్టినందుకే ఇలాంటి విపత్తులు సంభవిస్తున్నాయని ఇటీవల ప్రెస్‌మీట్‌లో చెప్పుకొచ్చారు. వరదల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే కబ్జాలను తొలగించాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు. అంతేకాదు.. రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా తరహా వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలిచ్చారు. సో.. ఇప్పుడు వరదలు చూస్తున్న ప్రజలు కూడా రేవంత్‌కే మద్దతుగా నిలుస్తున్నారు. కబ్జాలు లేకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంకల్పానికి కాలం కలసి వస్తోంది. హైదరాబాద్ లో కూల్చివేతలు ప్రారంభమైన తర్వాత భిన్నాభిప్రాయాలు వినిపించాయి. పేదల ఇళ్లు కూలుస్తున్నారన్న సెంటిమెంట్ ప్రయోగించేందుకు కొంత మంది రెడీ అయిపోయారు. అయితే ఇప్పుడు దానికికూడా అవకాశం లేకపోయింది. అసాధారణంగా వస్తున్న వరదలను తట్టుకునే శక్తి ప్రస్తుత నగరాలకు ఉండటం లేదని.. కబ్జా చేస్తున్న చెరువు.. నీరు పోయే మార్గాలను విస్తరించుకోకపోతే మొదటికే మోసం వస్తుందని తాజా వరదలు నిరూపించాయి.
విజయవాడ, ఖమ్మం నగరాలకు వచ్చిన వరదలు హైదరాబాద్ కు వచ్చి ఉంటే ఎదుర్కోవడం అసాధ్యం. నాలుగేళ్ల కిందట.. రెండు, మూడు గంటల పాటు కురిసిన భారీ వర్షాలకు సగం హైదరాబాద్ అతలాకుతలమైపోయింది. వందల మంది కొట్టుకుపోయారు. అప్పటి ప్రభుత్వం నిస్సహాయంగా చూస్తూండిపోయింది. ఆ ఘటన తర్వాతైనా యుద్ధ ప్రాతిపాదికన చెరువుల కబ్జాల నుంచి బయటపడేయాల్సింది. కానీ అలాంటి ప్రయత్నాలు జరగలేదు.
రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట ఆయన చేయాలనుకున్న పని .. చెరువుల నుంచి కబ్జాల నుంచి బయటపడేయడమే. అలాగే మూసి ని హైదరాబాద్‌లో సంస్కరిస్తే.. ఓ పెద్ద ముప్పు తప్పినట్లే. అందుకే మూసి ప్రాజెక్టును కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా చూసినా రేవంత్ రెడ్డి .. హైడ్రా ప్రయత్నాలకు వంద శాతం సపోర్టు లభించడం ఖాయంగా కనిపిస్తోంది. దీని నష్టపోయే సామాన్యలకు… వారికిఆ ఇళ్లను అమ్మిన వారి దగ్గర నుంచే పరిహారం ఇప్పిస్తే ఇంకా సంతోషిస్తారు.