Begin typing your search above and press return to search.

బడే భాయ్ ఇదిగో తెలంగాణ లిస్టు.. మోదీ ఎదుట కోరికల చిట్టా విప్పిన రేవంత్ రెడ్డి

చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం సందర్భంగా ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలని కోరారు.

By:  Tupaki Desk   |   6 Jan 2025 4:30 PM GMT
బడే భాయ్ ఇదిగో తెలంగాణ లిస్టు.. మోదీ ఎదుట కోరికల చిట్టా విప్పిన రేవంత్ రెడ్డి
X

తెలంగాణ అభివృద్ధికి చేపట్టాల్సిన పనులను వివరిస్తూ ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద చిట్టానే సమర్పించారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం సందర్భంగా ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలని కోరారు.

చర్లపల్లి టెర్మినల్ ను ప్రధాని మోదీ సోమవారం వర్చువల్ గా ప్రారంభించారు. ఈ క్యారక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బందరు పోర్టుకు రైల్వేలైన్ నిర్మించాలని కోరారు. తెలంగాణలో డ్రైపోర్టు ఏర్పాటు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఫార్మా ఇండస్ట్రీకి తెలంగాణ కేరాఫ్ అడ్రసుగా మారుతోందని కేంద్రం కూడా ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు. అదేవిధంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమలకు అనుమతి ఇవ్వాలని విన్నవించారు. రీజనల్ రింగ్ రోడ్డు 374 కిలోమీటర్ల మేర నిర్మాణం జరుగుతోందని, రీజనల్ రైల్ కూడా అవసరమని అందుకు అనుమతివ్వాలని వేడుకున్నారు. వికారాబాద్ నుంచి కొడంగల్ మీదుగా కర్ణాటకకు నూతన రైల్వేలైన్ నిర్మిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని ముఖ్యమంత్రి సూచించారు.

ప్రధాని కోరుకుంటున్న 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ కల సాకారం కావాలంటే అన్ని రాష్ట్రాలు సమగ్రంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కూడా దేశ అభివృద్ధికి భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటోందని తెలిపారు. తెలంగాణలో డ్రైపోర్టు ఏర్పాటు చేస్తే రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమీ కాంట్రిబ్యూట్ చేసేందుకు తనకు అవసరమైన సహకారం అందజేయాలని రేవంత్ రెడ్డి కోరారు.

కాగా, చర్లపల్లి టెర్నినల్ ఆరున్నరేళ్లలో పూర్తయింది. ఇందుకోసం రూ.428 కోట్లు వెచ్చించారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వేస్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు చర్లపల్లి వద్ద కొత్త టెర్మినల్ నిర్మించారు. ఈ టెర్మినల్ లో సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్ - సికింద్రాబాద్ (12757 - 12758), గుంటూరు - సికింద్రాబాద్ -గుంటూరు (17201, 17202), సికింద్రాబాద్ - సిర్పూర్ ( 17233, 17234) రైళ్లకు అదనపు స్టాపేజీ కల్పించారు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి చెన్నై, గోరఖ్ పూర్ వెళ్లి వచ్చే రైళ్లు ఇకపై చర్లపల్లి నుంచే రాకపోకలు సాగిస్తాయి. 12603, 12604 రైళ్లు జనవరి 7నుంచి, 12589, 12590 రైళ్లు జనవరి 12 నుంచి చర్లపల్లి నుంచి నడవనున్నాయి.