Begin typing your search above and press return to search.

సేమ్ టు సేమ్: ఒకేలాంటి తప్పులు చేస్తున్న చంద్రబాబు.. రేవంత్!

ఒక్క విషయాన్ని మీరు గమనించారా? రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొన్ని విషయాల్లో ఒకేలాంటి తీరును ప్రదర్శిస్తుంటారు.

By:  Tupaki Desk   |   7 April 2025 3:30 AM
సేమ్ టు సేమ్: ఒకేలాంటి తప్పులు చేస్తున్న చంద్రబాబు.. రేవంత్!
X

ఒక్క విషయాన్ని మీరు గమనించారా? రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొన్ని విషయాల్లో ఒకేలాంటి తీరును ప్రదర్శిస్తుంటారు. ఎంతైనా ఒకప్పటి గురుశిష్యులు కదా? అన్న మాట కొందరి నోటి నుంచి వస్తూ ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ తో చంద్రబాబును ఉద్దేశించి.. మీ గురువు కదా? అని ఇంటర్వ్యూలో అడిగితే ఆయన నుంచి వచ్చే సమాధానం ముఖం పగిలేలా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అదేమీ తప్పు కాదు కదా? ఒకప్పటి రాజకీయమైతే.. అలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెబితే అక్కడితో సరిపెట్టేవారు. ఇప్పుడు రాజకీయాలు అలా లేవు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాంతం మొదలు పలు భావోద్వేగ అంశాల్ని తెర మీదకు తీసుకొచ్చి.. చెప్పిన వ్యక్తి ఎమోషన్ కంటే కూడా.. దానికి సంబంధం లేని అంశాల్ని తీసుకొచ్చి ఇరుకున పడేయాలన్న ధోరణి పెరిగింది.

అందుకే.. సీఎం రేవంత్ ను ఉద్దేశించి ఎవరైనా చంద్రబాబు ప్రస్తావన తెచ్చినా.. ఆయనతో గతంలోని అనుబంధాన్ని గుర్తు చేసి ఇరుకున పడేయాలని చూసినా కటువుగా బదులిస్తున్నారు. అయితే.. ఇక్కడ కాదనలేని అంశం ఏమంటే.. అవునన్నా కాదన్నా.. రేవంత్ మీద ఒకప్పటి గురువైన చంద్రబాబు ముద్రలు పక్కాగా ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ నిర్ణయాలు.. పాలన.. కొన్ని అంశాల విషయాల్లో ఆయన వ్యవహారశైలిలో చంద్రబాబు తీరు కనిపిస్తుందని చెప్పాలి.

రాజకీయ ప్రత్యర్థుల విషయంలో రేవంత్ మహా కటువుగా ఉంటారని ముందు అనుకున్నారు. కానీ.. ఆ విషయం తప్పని తేలింది. గడిచిన ఏడాదిన్నర పాలనలో తన రాజకీయ ప్రత్యర్థులకు చికాకు తెప్పించేలా వ్యవహరించలేదనే చెప్పాలి. సమకాలీన రాజకీయాల్లో రాజకీయ వేధింపులు ఎలా ఉంటాయన్న విషయాన్ని ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ విషయంలో ప్రజలకు అవసరమైనంత అవగాహన ఉందన్నది తెలిసిందే.

తన రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టి.. విచారణ పేరుతో ఉరుకులు పరుగులు పెట్టించటమే కాదు.. తనకు వ్యతిరేకంగా మాట్లాడాలన్న ఆలోచన ఉన్న వారికి భయాన్ని నేర్పించే విషయంలో రేవంత్ మీద కొందరి అంచనాలు తప్పు అయ్యాయి. చంద్రబాబు తీరు కూడా ప్రత్యర్థుల విషయంలో ఇదే తీరు ఉంటుందని చెప్పాలి. తనకు అనుకూల మీడియాతో ఊడిగం చేయించుకోవటం చంద్రబాబుకు సాధ్యం కాదు. ఆ మాటకు వస్తే.. పేరుకు తన అనుకూల మీడియా అయినప్పటికి కొన్ని కథనాల ద్వారా డ్యామేజ్ కు గురి కావటం.. ఇరుకున పడటం లాంటి విషయాల్లోనూ చంద్రబాబు.. రేవంత్ తీరు ఒకేలా ఉండటం ఆసక్తికరంగా కనిపిస్తుంది.

అందరూ అనే మాట ఏమంటే.. మీడియాను మేనేజ్ చేసే విషయంలో చంద్రబాబుకు సాటి మరెవరూ ఉండరని చెబుతారు. కానీ.. ఈ విషయంలో చాలామంది చెప్పే అభిప్రాయాలు తప్పుగా చెప్పక తప్పదు. ఒకవేళ అలాంటి తీరే ఉంటే.. ఆయనకు అనుకూల మీడియా అన్న ముద్ర ఉన్న పబ్లికేషన్లలో ఆయన తీరును తప్పు పడుతూ వ్యాసాలు ఎందుకు పబ్లిష్ అవుతాయి? రేవంత్ విషయంలోనూ సేమ్ టు సేమ్. అంతేకాదు.. డ్యామేజ్ కంట్రోల్ కానీ.. ఏదైనా హైలెట్ అయ్యేలా కథనాల్ని ప్లాన్ చేసే విషయంలో కేసీఆర్ తో పోలిస్తే చంద్రబాబు ఎందుకు పనికిరారు. రేవంత్ కూడాఈ విషయంలో గురువుకు తగ్గ శిష్యుడనే చెప్పాలి.

చివరగా.. ఏదైనా వివాదం చోటు చేసుకున్నప్పుడు.. రాజకీయ ప్రత్యర్థులు తన ఎత్తుగడలతో ఉక్కిరిబిక్కిరి చేసే వేళలో.. అందుకు ధీటుగా స్పందించే విషయంలో చంద్రబాబు తప్పులు చేస్తారు. ఇప్పుడు రేవంత్ కూడా అదే తరహాను ప్రదర్శించటం గమనార్హం. కంచె గచ్చిబౌలి భూమల ఎపిసోడ్ లో ఏఐ టెక్నాలజీతో తప్పుడు ఫోటోలు.. వీడియోల్ని క్రియేట్ చేసి సోషల్ మీడియాను పెద్ద ఎత్తున వాడుకోవటం.. జాతీయ మీడియా సైతం దీన్ని హైలెట్ చేసేలా జరిగిన ప్లానింగ్ ను ధీటుగా అడ్డుకోవటంలో రేవంత్ అడ్డంగా ఫెయిల్ అయ్యారు.

ఈ విషయంలో చంద్రబాబుతో రేవంత్ ను ఎలా పోలుస్తారన్న సందేహం రావొచ్చు. అక్కడికే వస్తున్నాం. 2014లో ఏపీ సీఎంగా చంద్రబాబు సారథ్యంలో అమరావతి నిర్మాణం జరిగింది. పలు కట్టడాల నిర్మాణం జరిగింది. అయితే.. తాను చేసిన పనిని చెప్పుకోవటంలో చంద్రబాబు ఫెయిల్ కావటం ఒకటి. అంతకు మించిన పెద్ద తప్పేమంటే.. అమరావతి పేరుతో సినిమా సెట్టింగులు తప్పించి ఇంకేం లేవంటూ నాటి ప్రతిపక్షం పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పుడు.. అది తప్పు.. ఇదిగో అమరావతి.. ఇంత చేశామన్న బలమైన కౌంటర్ ఇచ్చింది లేదు. ఈ కారణంతో అమరావతి విషయంలో చంద్రబాబుకు రావాల్సిన మైలేజీ రాకపోగా.. డ్యామేజ్ మిగిలింది. ఇప్పుడు అర్థమైందా? పలు విషయాల్లో చంద్రబాబు.. రేవంత్ సేమ్ టు సేమ్. ఎంతైనా గురువు మైండ్ సెట్ శిష్యుడికి వస్తుందన్న నానుడికి తగ్గట్లే ఆయన తీరు ఉండటం విశేషం.