Begin typing your search above and press return to search.

మోదీది ఉత్త డప్పు.. మనం ఎంతో చేస్తున్నా ఇంతేనా ప్రచారం.. రేవంత్!

అసలు తాము చేసిన పని జనంలోకి వెళ్లకపోవడాన్ని తీవ్ర వైఫల్యంగానూ ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

By:  Tupaki Desk   |   18 July 2024 2:30 PM GMT
మోదీది ఉత్త డప్పు.. మనం ఎంతో చేస్తున్నా ఇంతేనా ప్రచారం.. రేవంత్!
X

మోదీ సర్కారు పావలా పనిచేసి ముప్పావలా ప్రచారం చేసుకుంటోంది.. వారిదంతా డప్పు..కానీ మనం ఎంతో చేస్తున్నం.. కానీ, ప్రచారం ఏదీ..? అనేది అభిప్రాయంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా సమాచారం. ‘‘కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇప్పుడే కాదు.. పదేళ్లలో చేసింది చాలా తక్కువ.. కానీ ప్రచారం మాత్రం చాలా గొప్పగా చేసుకుంటోంది.. మనం ఏడేళ్లలోనే రూ.30 వేల కోట్ల రైతు రుణమాఫీని అమలు చేశాం. దేశానికే ఆదర్శంగా నిలిచాం.. కానీ, ప్రచారం మాత్రం లేదు. ఎందుకిలా?’’ అని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు తాము చేసిన పని జనంలోకి వెళ్లకపోవడాన్ని తీవ్ర వైఫల్యంగానూ ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

ఏడు నెలల్లో ఎంతో..?

మోదీ పదేళ్లలో చేయలేని దానిని తాము ఏడు నెలల్లో చేసి చూపామనేది రేవంత్ భావన. మరీ ముఖ్యంగా సంక్షేమ పథకాల విషయంలో మోదీ సర్కారును మించి చేశామనేది ఆయన ఉద్దేశంగా తెలుస్తోంది. డిసెంబరులో అధికారంలోకి వచ్చింది మొదలు ఒక్కొక్కటిగా పథకాలను పట్టాలెక్కించిన తీరును ఆయన గుర్తుచేస్తూ.. వాటికి తగిన ప్రచారం లభించకపోవడం పట్ల డిజప్పాయింట్ మెంట్ తో ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో మోదీ సర్కారు చాలా తక్కువగా చేసి.. అత్యంత ఎక్కువ ప్రచారం చేసుకుంటున్న తీరును రేవంత్ ప్రస్తావించినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

మనం చేసిన మంచిని చెప్పండి..

ఇక ఇలాగైతే లాభం లేదని.. మనం చేసిన మంచి పని ఏమిటో ప్రజలకు చెప్పాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలను రేవంత్ కోరినట్లుగా తెలుస్తోంది. ఆ మంచిని ప్రతి మూలకు తీసుకెళ్లాలని.. ప్రతి మనిషికి తెలియజేయాలని సూచించినట్లు సమాచారం. దేశంలోని మరే పార్టీ ప్రభుత్వమూ ఒకే విడతలో రూ.31 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేయలేదని.. మరి దీనిని బాగా ప్రచారం చేయాలని ఆదేశించినట్లు పేర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం రూ.7 వేల కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు రేవంత్ సర్కార్ రూ.2 లక్షల రుణాన్ని ఆగస్టు 15లోగా మాఫీ చేయాలని లక్ష్యం పెట్టుకుంది.

మనమే ఆదర్శం.. దేశానికి చెప్పండి

రైతు రుణ మాఫీ ద్వారా తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందని.. ఈ విషయాన్ని గట్టిగా నొక్కి చెప్పాలంటూ కాంగ్రెస్ ఎంపీలను రేవంత్ కోరారు. త్వరలో జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ అగ్ర నేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఘనతగా దీనిని ప్రచారం చేయాలని ఆయన సూచించారు. కాగా.. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం రూ. 30 వేల కోట్ల రుణ మాఫీపైనే కాదు.. ఏడు నెలల్లో అందించిన సంక్షేమ పథకాలపైన సరైన ప్రచారం చేసుకోలేకపోయిందని రేవంత్ ఒకింత డిజప్పాయింట్ మెంట్ తో ఉన్నట్లు తెలుస్తోంది.