Begin typing your search above and press return to search.

పెద మామను ఘనంగా స్మరిస్తున్న సీఎం రేవంత్

మేధావితనంతో కూడిన తెలంగాణ రాజకీయ వేత్తల్లో దివంగత మర్రి చెన్నారెడ్డి తర్వాత చెప్పుకోవాల్సింది సూదిని జైపాల్ రెడ్డి గురించే.

By:  Tupaki Desk   |   15 Jan 2024 11:30 PM GMT
పెద మామను ఘనంగా స్మరిస్తున్న సీఎం రేవంత్
X

కాలం ఎపుడూ ఒకేలా ఉండదు.. అందరికీ అవకాశాలు ఇస్తుంది.. వాటిని అందిపుచ్చుకున్నవారే పైకి ఎదుగుతారు.. రాజకీయాల్లో అయితే ఇది మరీ స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఇక్కడ కష్టానికి లక్ కాస్త కలిసిరావాలి కూడా. సరైన సమయంలో సరైన అడుగులు వేయడం ఇందులో కీలకం. ఈ రకంగా చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఐదేళ్ల కిందట కాంగ్రెస్ లో చేరడం అంతా కాల మహిమనే అనుకోవాలి. ఇప్పుడు ఆయన సీఎం హోదాలో చేపట్టిన ఓ కార్యక్రమాన్ని గుర్తుచేసుకుంటే విధి ఎంత విచిత్రమైనదీ అనిపిస్తుంది కూడా.

సంపన్న కుటుంబం నుంచి రాజకీయాల్లోకి

మేధావితనంతో కూడిన తెలంగాణ రాజకీయ వేత్తల్లో దివంగత మర్రి చెన్నారెడ్డి తర్వాత చెప్పుకోవాల్సింది సూదిని జైపాల్ రెడ్డి గురించే. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాడ్గులకు చెందిన జైపాల్ రెడ్డి.. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి. 1969-84 మధ్యన కల్వకుర్తి నుంచి నాలుగుసార్లు ఉమ్మడి ఏపీ శాసనసభకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. అయితే, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడాన్ని వ్యతిరేకిస్తూ 1977లో ఆ పార్టీకి రాజీనామా చేశారు. జనతాపార్టీలో చేరారు. 1984లో మహబూబ్ నగర్ నుంచి, 1999, 2004లో మిర్యాలగూడ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. 1990, 1996లో రాజ్యసభ సభ్యుడిగానూ పనిచేశారు. అత్యుత్తమ పార్లమెంటేరియన్ అయిన జైపాల్ రెడ్డి 1990ల చివర్లో మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చారు. 2019లో ఆయన చనిపోయారు. జైపాల్ రెడ్డి ది సంపన్న కుటుంబం. 1940ల్లోనే ఆయన తండ్రి వ్యాపారాలు చేసేవారు. వీరి కుటుంబానికి మొదటినుంచి భూములు ఉండేవి. ఇక జైపాల్ రెడ్డి అద్భుత ఇంగ్లిష్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. పుస్తకాలను విపరీతంగా చదివేవారు. కేంద్ర మంత్రి సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన ఇంగ్లిష్ లో పార్లమెంటులో, ప్రెస్ మీట్ లో మాట్లాడితే డిక్షనరీ వెదుక్కుని అర్థాలు చూసుకోవాల్సి వచ్చేది. కాగా, జైపాల్ రెడ్డి తమ్ముడి కూతురు రూపను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఆస్తులు అంతరాలు

ఆస్తుల పరంగా జైపాల్ రెడ్డి కుటుంబానికి రేవంత్ కుటుంబానికి అంతరం ఉండడంతో మొదట్లో రేవంత్-రూప వివాహానికి జైపాల్ రెడ్డి కుటుంబం అంగీకరించలేదని ఇప్పటికే పలు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. రేవంత్ రాజకీయ ప్రస్థానంలోనూ జైపాల్ రెడ్డి పాత్ర పెద్దగా ఏమీ లేదు. జైపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నన్ని రోజులూ రేవంత్ రెడ్డి టీడీపీలో ఉండడం గమనార్హం. అయితే, రేవంత్ రాజకీయాల్లో ఒక్కో అడుగు ఎదుగుతుండడాన్ని మాత్రం దగ్గరనుంచి చూశారు. కాగా.. సీఎం హోదాలో రేవంత్ ప్రస్తుతం ఓ నిర్ణయం తీసుకున్నారు. జైపాల్ రెడ్డి జయంతి (జనవరి 16)ని ప్రభుత్వ పరంగా నిర్వహించాలని ఆదేశాలు జారీచేశారు. ఆయన వర్ధంతి (2019 జూలై 28)ని కూడా అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులిచ్చారు. ఈ విధంగా తన పెద మామ జైపాల్ రెడ్డిని రేవంత్ ఘనంగా స్మరించుకోనున్నారు.