Begin typing your search above and press return to search.

6 తిరగబడితే 9.. సచివాలయంలో సీఎం కార్యాలయం

అంకెల్లో 9 ప్రత్యేకత వేరు.. ఈ సంఖ్యను విశిష్టమైనదిగా చాలామంది భావిస్తారు. లక్కీ నంబరుగానూ ఇంకా చాలామంది లెక్కేసుకుంటారు.

By:  Tupaki Desk   |   8 Jan 2024 5:30 PM GMT
6 తిరగబడితే 9.. సచివాలయంలో సీఎం కార్యాలయం
X

అంకెల్లో 9 ప్రత్యేకత వేరు.. ఈ సంఖ్యను విశిష్టమైనదిగా చాలామంది భావిస్తారు. లక్కీ నంబరుగానూ ఇంకా చాలామంది లెక్కేసుకుంటారు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల నుంచి రాజకీయ ప్రముఖుల వరకు 9 నంబరును ఇష్టపడుతుంటారు. అంతెందుకు..? జాతకాలు, దేవుళ్లను నమ్మనివారూ 9ని తమకు సంపద తెచ్చిపెట్టిన సంఖ్యగా భావిస్తూ కార్లకు, వాహనాలకు ఆ నంబరు వచ్చేలా చూసుకుంటారు. ఇక 9ని తిరగేస్తే 6 వస్తుంది. ఇది పెద్దగా ఎవరికీ లక్కీ నంబరు కాదు.

ఆయనకు 9 కాదు.. 6

విచిత్రం ఏమంటే తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 6 లక్కీ నంబరు. అనేక సందర్భాల్లో ఆయన దీనిని ప్రదర్శించేవారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు సహా పలు విషయాల్లో ఆరు అంకె కలిసివచ్చేలా చూసుకున్నారు. ఆయన అధికారిక నివాసం ‘ప్రగతి భవన్’లోనూ ఆరు అక్షరాలు ఉండడం గమనార్హం. గత లోక్ సభ ఎన్నికల సమయంలో అయితే.. సారు కారు పదహారు నినాదంతో వెళ్లారు. ఇక కొత్తగా నిర్మించిన సచివాలయంలోనూ కేసీఆర్ కు ఆరో ఫ్లోర్ ను తన కార్యాలయంగా ఏర్పాటు చేసుకున్నారు. కాగా, గత నెల ఎన్నికల ఫలితాల్లో కేసీఆర్ ఓటమిపాలవడంతో మాజీ సీఎంగా మిగిలిపోయారు.

ఆయనకు 9...

తెలంగాణకు సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి పెద్దగా సెంటిమెంట్లు లేవు కానీ.. సంప్రదాయాలను ఫాలో అవుతుంటారనే పేరుంది. అయితే, రేవంత్ లక్కీ నంబరు 9 అని ప్రచారంలోకి వచ్చింది. దీనికితగ్గట్లే ఆయన కాన్వాయ్ లో వాహనాలకు 9 నంబరు కనిపిస్తోంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రధానంగా ప్రస్తావిస్తూ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అంటే..కేసీఆర్ లక్కీ నంబరుతోనే ఆయనను ఓడించారన్నమాట. విచిత్రం ఏమంటే.. తొలుత డిసెంబరు 6నే రేవంత్ సీఎంగా ప్రమాణం చేస్తారని వినిపించింది. చివరకు ఒక్క రోజు వాయిదాతో డిసెంబరు 7న ఆయన సీఎం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినం, తెలంగాణ ప్రకటన చేసిన డిసెంబరు 9న తమ గ్యారెంటీల అమలుకు పూనుకున్నారు. అంటే.. రేవంత్ 9 లక్కీ నంబరు.. సోనియా జన్మదినం 9 ఒకటే అయ్యాయి. ఇక ఇప్పటి విషయానికి వస్తే ప్రస్తుతం సచివాలయంలోని ఆరో అంతస్తులో సీఎం కార్యాలయం కొనసాగుతోంది. దీనిని త్వరలో 9వ అంతస్తులోకి మార్చనున్నారట. దీనికోసం చర్యలు కూడా మొదలైనట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్‌ ఆదేశాల మేరకే ఇలా చేస్తున్నారని సమాచారం. ఆ ఫ్లోర్ లో ఏర్పాట్ల కోసం ఆర్ అండ్ బీ అధికారులు పరిశీలించినట్టు సమాచారం. ఇంటీరియర్‌, ఫర్నిచర్‌, సాంకేతిక ఏర్పాట్లు, భద్రతాపరమైన చర్యలపై చర్చ జరిగినట్టు తెలిసింది. ఇంటీరియర్‌, ఫర్నిచర్‌ కోసం పలువురు నిపుణులు తొమ్మిదో అంతస్తును ఇప్పటికే పరిశీలించారని సమాచారం.

సచివాలయలో 11 అంతస్తులు ఉన్న సంగతి తెలిసిందే. 6 మాత్రమే బయటకు కనిపిస్తాయి. డోమ్‌ ల కింద కొన్ని ఫ్లోర్లు ఉన్నాయి. కేసీఆర్‌ ఆరో అంతస్తును మాత్రమే కార్యాలయంగా వినియోగించేవారు. సచివాలయాన్ని కూడా లక్కీ నంబరు ఆరు అంతస్తుల్లోనే కనిపించేలా నిర్మించారని ప్రచారం జరిగింది.అయితే సీఎం రేవంత్‌ 9 అంకెను అదృష్ట సంఖ్యగా భావిస్తుంటారనే ప్రచారం ఉంది. కార్యాలయాన్ని సచివాలయం 9వ ఫ్లోర్‌కి మార్చుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. సమయంలోపు పనులన్నీ పూర్తయితే సంక్రాంతి తరువాత సీఎం కార్యాలయం మారనున్నట్టు తెలుస్తోంది.