తొలినాటి కొలీగ్.. పార్టీ మాజీ సహచరుడికి చిరు సత్కారం.. భలే
అప్పట్లో ఇద్దరూ ఒకేసారి.పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న వెంకయ్య, చిరంజీవి ఇద్దరినీ తెలంగాణ ప్రభుత్వం ఆదివారం సన్మానించింది.
By: Tupaki Desk | 5 Feb 2024 3:30 PM GMTకేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలుగు రాష్ట్రాలకు మంచి ప్రాధాన్యమే దక్కింది. మరీ ముఖ్యంగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డులు వరించాయి. వీరిద్దరూ 1978లో కెరీర్ ను ప్రారంభించినవారు కావడం విశేషం. అంటే.. 45 ఏళ్లుకు పైగా సుదీర్ఘ కెరీర్. చిరంజీవి కంటే వెంకయ్యనాయుడు నాలుగైదేళ్లు పెద్దవారు. కాగా.. ఇద్దరూ హుందాతనానికి మారు పేరు. ఎదుటి వ్యక్తిని గౌరవించడంలో వారికి వారే సాటి. అలాంటి ఇద్దరికీ ఒకే వేదికపై 'గౌరవం' దక్కింది. అదికూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి కావడం విశేషం. అయితే, ఇందులో ఇంకో విశేషమూ ఉంది.
అప్పట్లో ఇద్దరూ ఒకేసారి.పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న వెంకయ్య, చిరంజీవి ఇద్దరినీ తెలంగాణ ప్రభుత్వం ఆదివారం సన్మానించింది. వీరికితోడు పద్మ అవార్డు గ్రహీతలందరినీ సన్మానించింది. వెంకయ్యనాయుడి రాజకీయ ప్రస్థానం జన సంఘ్ నుంచి 1978లో మొదలైంది. అదే ఏడాది అప్పుడే చిరంజీవి మొదటి సినిమా విడుదలైంది. వేర్వేరు రంగాల్లో ఇద్దరూ శిఖర సమానులుగా ఎదిగారు. ఇక 2008లో మెగాస్టార్ రాజకీయాల వైపు అడుగులేసి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. 2009 ఎన్నికల్లో తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. సరిగ్గా అదే సమయంలో కొడంగల్ నుంచి టీడీపీ తరఫున రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. అంటే.. చిరు, రేవంత్ ఇద్దరూ ఒకేసారి శాసన సభలో ఎమ్మెల్యేలుగా అడుగుపెట్టారు.
మారిన దారులు..2010లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఆపై కాంగ్రెస్ నుంచి రాజ్యసభ ఎంపీ అయ్యారు. కేంద్ర పర్యటక మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. మరోవైపు 2017 వరకు రేవంత్ టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్నారు. తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో జరిగినా, టీడీపీ నేపథ్యాన్ని ఆసరాగా చేసుకుని ప్రత్యర్థులు విమర్శలకు దిగినా పార్టీ తరఫున తన గళాన్ని బలంగా వినిపించారే తప్ప టీడీపీని మాత్రం ఆయన వీడలేదు. అయితే, ఆ తర్వాత రాజకీయం కష్టం కావడంతో రేవంత్ కాంగ్రెస్ లోకి వచ్చారు. మరోవైపు చిరంజీవి 2017 వరకు కాంగ్రెస్ తరఫున ఎంపీగా కొనసాగి ఆ తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. అటుఇటుగా అదే ఏడాది రేవంత్ టీడీపీని వీడి కాంగ్రెస్ లోకి వచ్చారు. 2019 ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా గెలిచి, ఆ తర్వాత పీసీసీ చీఫ్ అయి, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీని ఎన్నికల్లో గెలిపించి తెలంగాణకు సీఎం కూడా అయ్యారు.
అప్పట్లో విమర్శలు.. ఇప్పుడు సన్మానాలు 2008లో చిరంజీవి ప్రజారాజ్యం ఏర్పాటు చేసే సమయానికి రేవంత్ టీడీపీలోకి వచ్చారు. ఆ పార్టీ తరఫున ప్రజారాజ్యాన్ని తీవ్రంగా విమర్శించారు. అయితే, అనంతర కాలంలో కాంగ్రెస్ నూ ఆయన విమర్శించడం వేరే విషయం. ఇప్పుడు అదే రేవంత్ తన తొలినాటి అసెంబ్లీ కొలీగ్, ఒకనాటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన చిరంజీవిని సన్మానించడం విశేషం. అంతేకాదు.. రాజకీయంగా పూర్తి విరుద్ధమైన పార్టీకి చెందిన వెంకయ్యనాయుడునూ గౌరవించడం విశేషం.
కొసమెరుపు: ఉమ్మడి ఏపీలో 2009లో చిరు, రేవంత్ తొలిసారి ఎమ్మెల్యేలుగా శాసనసభలో అడుగుపెట్టారు. రేవంత్ రాజకీయ ప్రయాణంలో పార్టీ మారి సీఎం అయ్యారు. చిరు మాత్రం రాజకీయాలు తనకు సరిపడవంటూ హుందాగా పక్కకు తప్పుకొన్నారు. ఆయన మరింత గట్టిగా నిలబడి ఉంటే విభజిత ఏపీలో ప్రస్తుతం కీలక శక్తిగా మారేవారనేది పరిశీలకుల అభిప్రాయం.