రైతుల విషయంలో చంద్రబాబే బెస్ట్: రేవంత్ సంచలన కామెంట్లు
ఆనాడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకున్నారంటూ.. ఆయన ఏపీని పరోక్షంగా సమర్థించారు.
By: Tupaki Desk | 29 July 2024 10:21 AM GMTరైతులకు మెరుగైన విద్యుత్ విషయంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తీసు కున్న నిర్ణయమే మెరుగైందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 24 గంటల పాటు రైతులకు విద్యుత్ అందాలనే నిర్ణయాన్ని అప్పట్లో చంద్రబాబే తీసుకున్నారని చెప్పారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఏమీ లేవని.. గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను మాత్రమే ఆయన అమలు చేశారని.. అందులోనూ కొన్నింటిని ఆయన ఆపేశారని చెప్పారు.
రాష్ట్రంలో కొన్నాళ్లుగా రాజకీయ మంటలు రేపుతున్న విద్యుత్ ప్రాజెక్టుల అవకతవకలపై ఏర్పాటైన కమిషన్ వ్యవహారం అసెంబ్లీలో చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. బీఆర్ ఎస్ పార్టీ తిన్నింటివాసాలు లెక్క పెడుతుందన్నా రు. విభజన సమయంలో ఏపీ నుంచి విద్యుత్ వాడుకున్న అంశం.. దీనికి సంబంధించి సుమారు 5 వేల కోట్ల రూపాయల పైచిలుకు నిధులను బకాయి ఉన్న విషయాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు.
ఆనాడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకున్నారంటూ.. ఆయన ఏపీని పరోక్షంగా సమర్థించారు. కానీ, ఈ విషయాన్ని బీఆర్ ఎస్ నాయకులు మరిచిపోయారని చెప్పారు. ఇరవై సంవత్సరాలు కలిసి పని చేసిన సహచరులను(టీడీపీలో కేసీఆర్ ఉన్న కాలం) అగౌరవపరచడం సరికాదని తెలిపారు. విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ సత్య హరిశ్చంద్రుడు అయితే.. దానిని నిరూపించుకునేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. విద్యుత్పై కమిషన్ వేయాలని బీఆర్ ఎస్ నాయకులు కోరా రని, ఇప్పుడు కేసీఆర్‌ను విచారించే పరిస్థితి వస్తే.. వెనకడుగు వేస్తున్నారని విమర్శించారు.
ప్రస్తుతం జరుగుతున్న విచారణకు కేసీఆర్ హాజరు కావాల్సిందేనని రేవంత్ తేల్చి చెప్పారు. ఈ కమిషన్ కొత్త చైర్మన్‌ను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సోమవారం నియమిస్తామన్నారు. 24 గంటల విద్యుత్ ఇవ్వాలని చంద్రబాబు హయాంలోనే నిర్ణయం తీసుకున్నారని.. అప్పట్లో తానుకూడా ఉన్నానని రేవంత్ చెప్పుకొచ్చారు. అయితే.. ఏపీ విద్యుత్ బకాయిలపై మాత్రం పరోక్షంగా స్పందించారే తప్ప.. ప్రత్యక్షంగా ఎలాంటి కామెంట్లు చేయలేదు.