Begin typing your search above and press return to search.

మోడీ సర్కారు హోల్ సేల్ సస్పెన్షన్ వేళ.. రేవంత్ మాట వైరల్

ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి అమిత్ షా వివరణ ఇచ్చే కన్నా.. సభకు రాని వైనం ఒక ఎత్తు అయితే.. మరోవైపు నిరసన గళం విప్పిన ఎంపీలపై సస్పెండ్ చేసేస్తున్న వైనంషాకింగ్ గా మారింది.

By:  Tupaki Desk   |   22 Dec 2023 4:03 AM GMT
మోడీ సర్కారు హోల్ సేల్ సస్పెన్షన్ వేళ.. రేవంత్ మాట వైరల్
X

శాంతియుతంగా నిరసన తెలపటం ప్రజాస్వామ్య దేశంలో సహజ పరిణామం కదా? అందులో తప్పేమీ ఉండదు కదా? కానీ.. అందుకు భిన్నంగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తున్నప్పుడు షాకింగ్ గా మారింది. ఇటీవల పార్లమెంట్ సమావేశాలు సాగుతున్న వేళలో.. దుండగులు కొందరు సభలోకి ప్రవేశించి అలజడిని క్రియేట్ చేసిన వైనం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. నిఘా వైఫల్యంతో పాటు.. భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. ఈ ఉదంతంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలంటూ విపక్ష ఎంపీలు పార్లమెంటులో డిమాండ్ చేయటం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి అమిత్ షా వివరణ ఇచ్చే కన్నా.. సభకు రాని వైనం ఒక ఎత్తు అయితే.. మరోవైపు నిరసన గళం విప్పిన ఎంపీలపై సస్పెండ్ చేసేస్తున్న వైనంషాకింగ్ గా మారింది. తాజాగా (బుధవారం) ఇద్దరు సభ్యుల్ని సస్పెండ్ చేయటంతో సస్పెన్షన్ వేటు పడిన ఎంపీల సంఖ్య 143కు చేరుకుంది. లోక్ సభలో 97 మంది.. రాజ్యసభలో 46 మందిపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా సస్పెండ్ అయిన ఎంపీలపై ఆంక్షలు విధిస్తూ లోక్ సభ సెక్రటేరియట్ తాజాగా ఒక సర్క్యులర్ విడుదల చేసింది.

సస్పెండ్ అయిన ఎంపీలు పార్లమెంట్ చాంబర్లలోకి.. లాబీల్లోకి.. గ్యాలరీల్లోకి రావొద్దని పేర్కొనటం గమనార్హం. అంతేకాదు.. సస్పెన్షన్ అమల్లో ఉన్నకాలంలో ఎంపీలు ఇచ్చే ఏ నోటీసును స్వీకరించమని.. పార్లమెంట్ కమిటీ ఎన్నికల్లోనూ వారు ఓటు వేయలేరని.. రోజువారీ భత్యం కూడా పొందలేరని పేర్కొన్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విపక్ష సభ్యులపై మోడీ సర్కారు కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లుగా పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే..విపక్ష నేతలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అనుసరిస్తున్న మార్గంతో పాటు.. ఆయన ఇటీవల అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల్ని పలువురు ప్రస్తావిస్తున్నారు.

విపక్ష సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్.. ప్రతిపక్ష పార్టీ సభ్యులు కోరుకున్నట్లుగా వారిని తాము సభ నుంచి సస్పెండ్ చేయమని.. వారి పాలనలో జరిగిన తప్పుల్ని సభలో ఉంచి మరీ చెబుతామని.. అదే వారికి తాము విధించే శిక్ష అని పేర్కొనటం గమనార్హం. విపక్షాలపై విమర్శలు చేసినా.. ఘాటైన ఆరోపణలు చేసినా అవేవీ కూడా వ్యక్తిగతంగా తీసుకోకుండా ఉండాల్సిన అవసరం ఉంది. అంతేకాదు.. విపక్ష నేతలు లేవనెత్తే అంశాల మీద చర్చ జరపటంతోపాటు.. వారి వాయిస్ ను కూడా సభలో వినిపించేలా చూడాల్సిందే. ఇలాంటి విషయాల్లో ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో జరుగుతన్న పరిణామాలతో పోలిస్తే.. తెలంగాణలో రేవంత్ సర్కారు అనుసరిస్తున్న వైనం బాగుంటుందన్నారు. నిజంగానే విపక్షాలను శిక్షించాలన్నది మోడీ సర్కారు ఆలోచన అయితే.. రేవంత్ రూట్ లోకి రావటం మంచిది కదా మోడీజీ?