అప్పటి వరకు 'రేవంతే'.. కాంగ్రెస్ షాకింగ్ నిర్ణయం
ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి విషయంలో కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది.
By: Tupaki Desk | 29 Dec 2023 4:04 AM GMTప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి విషయంలో కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఎంతో మంది సీనియర్లు, కాకలు తీరిన నాయకులు ఉన్నప్పటికీ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ల్లో పార్టీని ముందుండి నడిపించి, అధికారంలోకి తెచ్చారన్న భావన, దూరదృష్టితో రేవంత్‌కే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించింది. అయితే.. ఆయన ఇప్పుడు కేవలం ముఖ్యమంత్రి మాత్రమే కాదు.. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిలో కూడా ఉన్నారు.
అయితే.. జోడు పదవులు నిర్వహించడం కాంగ్రెస్‌లో ఆనవాయితీ లేదు. ఎవరైనా కాంగ్రెస్ చీఫ్‌గా ఉండి.. సీఎం అయితే.. వెంటనే కాంగ్రెస్ అధ్యక్ష పదవిని వెంటనే వేరే వారికి అప్పగిస్తారు. కానీ, తెలంగాణ విష యంలో ఆనవాయితీకి భిన్నంగా కాంగ్రెస్ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. రేవంత్ రెడ్డినే మరో ఆరు మాసాల వరకు పార్టీ తెలంగాణ చీఫ్‌గా కొనసాగించాలని నిర్ణయించినట్టు పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీ చెప్పారు. అయితే.. వాస్తవానికి ఈ పదవికి కూడా పార్టీలో తీవ్రమైన పోటీ ఉంది.
అయినప్పటికీ.. వచ్చే పార్లమెంటు ఎన్నికలు అత్యంత కీలకమైనవి కావడం, తెలంగాణలో బలమైన నాయకుడి అవసరం ఎంతో ఉండడం.. బీఆర్ఎస్, బీజేపీ వ్యూహాలకు దీటుగా పార్టీని నడిపించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో రేవంత్ అయితేనే బెటర్ అని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుని ఉంటుంద ని పరిశీలకులు చెబుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా.. రేవంత్ సమర్థవంతంగా పార్టీని ముందుండి నడిపించి అధికారంలోకి తెచ్చారు.
ఇప్పుడు కూడా.. అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల్లోనూ రేవంత్ దూకుడు ప్రదర్శిస్తారని, ఆయన హయాం లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చేయి మారకుండా.. రేవంత్‌నే కొనసాగిస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. ఇదిలావుంటే.. పీసీసీ చీఫ్ పదవి కోసం.. జానారెడ్డి నుంచి షబ్బీర్ అలీ వరకు చాలామంది నాయకులు ఎదురు చూస్తున్నారు. మరి ఎవరికి ఈ లక్కు చిక్కుతుందో చూడాలి.