చెప్పినట్లే చేసేసిన రేవంత్.. కాన్వాయ్ వాహనాలు తగ్గేశాయి
ఆదర్శాలు మాటల్లోనే తప్ప చేతల్లో కనిపించని కేసీఆర్ సర్కారుకు భిన్నమైన రేవంత్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు చూస్తున్నారన్న మాట బలంగా వినిపిస్తోంది.
By: Tupaki Desk | 17 Dec 2023 10:14 AM GMTనోట్లో నుంచి మాట వచ్చిందంటే.. యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిందే. ఆదర్శాలు మాటల్లోనే తప్ప చేతల్లో కనిపించని కేసీఆర్ సర్కారుకు భిన్నమైన రేవంత్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు చూస్తున్నారన్న మాట బలంగా వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే.. సీఎం రేవంత్ తీరు ఉందని చెప్పాలి. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయటానికి ముందే.. నాటి ప్రగతి భవన్ ముందున్న స్టీల్ గడీలను తొలగించేయటం.. తాజాగా అసెంబ్లీ ముందున్న ఇనుప కంచెను తొలగించేలా చేయటమేకాదు.. తనకున్న 15 వాహనాల కాన్వాయ్ ను 9 వాహనాలకు కుదించటం లాంటి వేగవంతమైన చర్యల్ని చేపడుతున్నారు రేవంత్ రెడ్డి.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో పదేళ్లు సాగిన (తొమ్మిదిన్నరేళ్లు) కేసీఆర్ రాజభోగం ఎంతలా ఉండేదన్న విషయం నాటి ప్రగతిభవన్ కు చెందిన వీడియోలు తాజాగా బయటకు వచ్చిన వేళ.. వాటిని చూసిన సామాన్యులు అవాక్కు అవుతున్న పరిస్థితి. అలాంటి వైభోగాన్ని వదిలేసి.. తాను ఇంతకాలం ఉంటున్న ఇంట్లోనే రేవంత్ ఉండేందుకు మక్కువ చూపటం.. ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చేసి.. అందులోని నాలుగు భవనాల్లో ఒకదాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కేటాయించటం తెలిసిందే.
తొమ్మిదిన్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి.. నగర రోడ్ల మీద కేసీఆర్ వెళ్లింది చాలా తక్కువ సందర్భాల్లోనే. అనునిత్యం వెళ్లే ఫాంహౌస్ రూట్ తప్పించి.. ప్రజాసమస్యలను పరిశీలించేందుకు.. ప్రజల వద్దకు వెళ్లేందుకు.. ఆ మాటకు వస్తే సచివాలయానికి వెళ్లేందుకు సైతం ఆసక్తి చూపని కేసీఆర్ తీరుకు భిన్నంగా సీఎం రేవంత్ తీరు ఉంది.
తన కారణంగా ట్రాఫిక్ జాం అవుతూ.. ప్రజలు ఇక్కట్లు పడుతున్న నగర ప్రజల అవస్థల్ని గుర్తించారు రేవంత్. అంతే.. తన కోసం ట్రాఫిక్ ను నిలిపేయొద్దని.. తన కాన్వాయ్ వాహనాల్ని సైతం సామాన్యులతో పాటు కలిసి వెళతానన్న మాటకు తగ్గట్లే.. శనివారం ఆయన ప్రయాణించిన వైనం ఆసక్తికరంగా మారింది. కేవలం ఆయన రాకకు ఐదు నిమిషాల ముందు మాత్రమే ట్రాఫిక్ ను క్లియర్ చేశారు తప్పించి.. వాహనదారులకు పెద్దగా ఇబ్బందులకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదంతా చూస్తే.. నోటి మాటల్లోనే కాదు.. చేతల్లోనూ ప్రదర్శిస్తున్న రేవంత్ తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.