Begin typing your search above and press return to search.

ఆర్ట్.. ఆటలు.. వంట.. రేవంత్ వ్యక్తిగత ఇష్టాయిష్టాలు ఇవే!

ఎవరైనా ఉన్నత స్థాయి పదవికి చేరగానే.. వారి వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని అనిపిస్తుంటుంది. వారి ఎదుగుదలలో అలవాట్లు, క్రమశిక్షణ, అభిరుచులు ఏమిటి అనే ఆసక్తి నెలకొంటుంది.

By:  Tupaki Desk   |   11 Dec 2023 3:30 PM GMT
ఆర్ట్.. ఆటలు.. వంట.. రేవంత్ వ్యక్తిగత ఇష్టాయిష్టాలు ఇవే!
X

ఎవరైనా ఉన్నత స్థాయి పదవికి చేరగానే.. వారి వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని అనిపిస్తుంటుంది. వారి ఎదుగుదలలో అలవాట్లు, క్రమశిక్షణ, అభిరుచులు ఏమిటి అనే ఆసక్తి నెలకొంటుంది. వాస్తవానికి ఒక వ్యక్తి రాణించడంలో వారి జీవన శైలి పాత్ర ఎంతో కీలకం. ఇంకా వివరంగా చెప్పాలంటే.. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఉదయాన్న లేవడం, మనం ఏ పనిచేస్తున్నామో సమీక్షించి చూసుకోవడం, అవసరం మేరకే మాట్లాడడం వంటివన్నీ ఇందులో భాగం. వీటిని సరిగ్గా అమలులో పెట్టినవారు జీవితంలో పైకి వస్తారని చెప్పవచ్చు. రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సివిల్ సర్వెంట్లు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల విజయం రహస్యం తెలుసుకోవాలని సాధారణ ప్రజలకు ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలో చూస్తే.. తెలుగు రాష్ట్రాల్లో తాజా సంచలనం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆయన సీఎం స్థాయికి ఎదిగారు. రేవంత్ కుటుంబం గురించి ఇప్పటివరకు కథనాలు వచ్చినా.. పూర్తిగా ఆయన వ్యక్తిగతం గురించిన వివరాలు మాత్రం బయటకు రాలేదు. ఇప్పుడవేంటో చూద్దామా..?

తెల్లవారుజామునే లేస్తారు..

రేవంత్ రెడ్డి తెల్లవారుజామున 4 గంటలకే నిద్ర లేస్తారు. ఆపై గోరువెచ్చని నీరు తాగుతారు. అరగంట పాటు కచ్చితంగా వ్యాయామం చేస్తారు. యాపిల్‌ లేదా పుచ్చకాయ జ్యూస్‌ తప్పనిసరంగా తీసుకుంటారట. ఆపై పేపర్ చదవి.. కాసేపటికి టీ తాగుతారు. అక్కడి నుంచి రోజువారీ కార్యక్రమాలు మొదలుపెడతారు. ముఖ్యమైన వారికి ఫోన్లు, ఇంటికి వచ్చిన కార్యకర్తలతో సంభాషిస్తారు. స్నానం చేసి చపాతీ లేదా జొన్న రొట్టె తింటారు.

వంట ఇష్టం.. నాటు కోడి కూర మహా ఇష్టం..

రేవంత్ కు నాటుకోడి కూర అంటే బాగా ఇష్టమట. ఇక మటన్‌ బిర్యానీని ఇష్టంగా తింటారని ఆయన ఇంట్లో పనిచేసే సహాయకులు తెలిపారు. అయితే, పూర్తిగా నాన్ వెజ్ అనే కాకుండా.. ముద్ద పప్పు, సాంబారు పెరుగన్నం కచ్చితంగా తీసుకుంటారని చెప్పారు. మధ్యాహ్నం ఆలస్యమైతే ఎండు ఫలాలు, కాజూ, బాదం, పిస్తా, ఖర్జూరం వంటివి తీసుకుంటారని వివరించారు. ఇక వంట చేయడం అన్నా రేవంత్ ఎంతో ఇష్టపతారట. కాగా, రేవంత్ ఇంట్లో పద్నాలుగేళ్లుగా పనిచేస్తున్న వ్యక్తులు ఈ విషయాలను వివరించారు.

ఆటలు.. ఆర్ట్.. దసరా శుభాకాంక్షలు

రేవంత్ కు క్రీడలు, బొమ్మలు గీయడం హాబీలు. కొంతకాలం ఓ పత్రికలో ఆయన జర్నలిస్టుగా పనిచేసిన సంగతి తెలిసందే. వనపర్తిలో ఇంటర్ అనంతరం హైదరాబాద్‌ చేరుకుని.. స్థిరాస్తి, ప్రింటింగ్‌ ప్రెస్‌ వ్యాపారాలు చేశారు. 2009లో కొడంగల్ లో గెలిచాక సొంతిల్లు కట్టుకున్నారు. దీనికిముందే ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కల్వకుర్తిలో ఇల్లు నిర్మించుకున్నారు. దసరా పండగ మరుసటి రోజు కొడంగల్‌ వచ్చి.. ప్రజలతో మాట్లాడడం రేవంత్ కచ్చితంగా చేసే పనుల్లో ఒకటి. ఇక కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ లో రేవంత్ పూర్తిగా కొడంగల్ లోనే ఉన్నారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులకు స్వయంగా వండిపెట్టినట్లు చెబుతారు.

పచ్చదనం అంటే మహా ఇష్టం..

ఇంటిలో పచ్చదనం పరుచుకుని ఉంటే ఆ కళే వేరు. ప్రశాంతతే వేరు. అందుకే రేవంత్ పచ్చదనానికి ప్రాధాన్యం ఇస్తారు. కొడంగల్ ఇంట్లో గార్డెన్‌ దీనినే సూచిస్తోంది. రకరకాల చెట్లు, పూల మొక్కలతో హరితం పరుచుకున్నట్లు ఉంటుంది ఈ ఇల్లు. ఇక పిత సెలోబియం అర్బోరియం (కోజబా అర్బోరియా) మొక్కను రేవంత్ స్వయంగా నాటి చుట్టూ గద్దె కట్టించారు. ఇక్కడే ఆయన కార్యకర్తలతో సమావేశమవుతారు. కొడంగల్‌, హైదరాబాద్‌ లోని ఇళ్లలో కుక్కలు ఉన్నాయి. బెల్జియం మిల్‌ నైస్‌ జాతి శునకం ప్రస్తుతం కొడంగల్‌ లో ఉంది. ఎమ్మెల్యేగా గెలిచిన సమయాల్లో రాష్ట్ర స్థాయి హాకీ పోటీలను కొడంగల్‌లో నిర్వహించారు. క్రీడాకారులకు తన నివాసంలోనే వసతులు కల్పించారు. జూనియర్‌ కళాశాలలో పోటీలు అట్టహాసంగా నిర్వహించి బహుమతులు అందజేశారు.