Begin typing your search above and press return to search.

కారు వర్సెస్ హైటెన్షన్ వైరు.. ఎవరు మిగులుతారు?

సాధారణంగా రాజకీయాల్లో నోటి మాటల వరకు బానే ఉంటుంది. కానీ.. ఒకసారి చేతల్లోకి దిగితే మాత్రం మొదటికే మోసం వస్తుంది.

By:  Tupaki Desk   |   20 April 2024 4:38 AM GMT
కారు వర్సెస్ హైటెన్షన్ వైరు.. ఎవరు మిగులుతారు?
X

తనను తాను హైటెన్షన్ కరెంటు వైరుతో పోల్చుకున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తాను కాపలా ఉంటానని చెప్పిన ఆయన.. పార్టీని కానీ తనను కానీ టచ్ చేస్తే కేసీఆర్ మసి అయిపోతారంటూ మండిపడ్డారు. మాటలు అనటం వేరు.. చేతల్లో చూపించటం వేరు. రేవంత్ స్టైల్ ఏమంటే.. ఓవైపు మాటలు అంటూనే.. మరోవైపు చేతల్లో చూపించటం. అంటే.. రెండు పనులు ఏకకాలంలో చేయటంలో తనకు తాను సాటి అన్న విషయాన్ని మరోసారి ఫ్రూవ్ చేశారు.

సాధారణంగా రాజకీయాల్లో నోటి మాటల వరకు బానే ఉంటుంది. కానీ.. ఒకసారి చేతల్లోకి దిగితే మాత్రం మొదటికే మోసం వస్తుంది. కానీ.. అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా చూసుకోవటంలో రేవంత్ తన టాలెంట్ ను ప్రదర్శిస్తున్నారు. గురువారం జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 20 మంది తనతో టచ్ లో ఉన్నట్లుగా చెప్పి సంచలనంగా మారారు. లోక్ సభ ఎన్నికల తర్వాత పెను పరిణామాలు చోటు చేసుకుంటాయంటూ హెచ్చరించిన కేసీఆర్ మాటలను సీఎం రేవంత్.. అంతే సీరియస్ గా తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.

గురువారం కేసీఆర్ మాటలకు బదులు అన్నట్లు.. శుక్రవారం రేవంత్ తానేమిటో చూపించారు. బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్)ను పార్టీలోకి వచ్చేలా చేశారు. గులాబీ కారు నుంచి ఆయన దిగేసేలా చేశారు. గులాబీ కారు దిగే ఎమ్మెల్యేల జాబితాలో ప్రకాశ్ గౌడ్ ఉన్నారు. అయితే.. వేచి చూద్దామన్న ధోరణిని ప్రదర్శించిన రేవంత్.. ఎప్పుడైతే కేసీఆర్ నోటి నుంచి హెచ్చరిక వచ్చిందో.. దానికి బదులు అన్నట్లుగా ఆయన పార్టీకే చెందిన ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో చేరేలా చేయటం చూసినప్పుడు.. రేవంత్ చెప్పినట్లుగా ఆయన కాంగ్రెస్ పార్టీకి హైటెన్షన్ వైరుగా మారినట్లుగా చెప్పాలి.

సుదీర్ఘ రాజకీయ జీవితంలో గులాబీ బాస్ కేసీఆర్ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఎత్తుపల్లాల్ని చూశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత నుంచి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు ఆయనకు ఎదురే లేకుండా పోయింది. ఆయన ఆడింది ఆటగా.. పాడింది పాటగా మారింది. తానేం అనుకుంటే.. అది పూర్తి చేసేలా కాలం కలిసి వచ్చింది. అయితే.. ఇప్పుడు కాలం మారిందన్న విషయాన్ని కేసీఆర్ మిస్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఎంత వెలిగిపోయిన దీపమైనా ఏదో ఒక దశకు కొండెక్కటం ఖాయమన్న నిజాన్ని గుర్తించటం లేదని చెప్పాలి.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పార్టీకి ఓటమి ఎదురయ్యేలా చేసిన ఓటరు నాడిని తప్పుగా అర్థం చేసుకుంటున్న కేసీఆర్.. అదే పనిగా తప్పులు చేస్తున్నారు. అదే సమయంలో రేవంత్ ను తక్కువగా అంచనా వేయటం కూడా గులాబీ బాస్ చేస్తున్న అతి పెద్దతప్పుగా చెప్పాలి. ఆట కానీ రాజకీయం కానీ ప్రత్యర్థిని తక్కువగా వేసిన ప్రతి సందర్భంలోనూ ఓటమి ఎదురవుతుందన్న సత్యాన్ని ఆయన ఎందుకు మిస్ అవుతున్నారన్నది ప్రశ్నగా మారింది.

గడిచిన కొన్నేళ్లుగా తాను ఏం అనుకుంటే.. అదే జరిగేట్లుగా చేసుకోగలిగిన కేసీఆర్.. గత ఎన్నికల నుంచి తాను అన్న ప్రతి మాటా తనకు శాపంగా మారుతున్న కాల మహిహను గుర్తిస్తే మంచిదంటున్నారు. అదే సమయంలో తాను ఇంతవరకు గులాబీ కారుతో దూసుకెళ్లి.. ఎదురొచ్చిన అన్నింటిని తొక్కేసుకుంటూ వెళ్లగలిగారు. కానీ.. ఇప్పుడు ఆయన ఎదుట నిలిచింది హైటెన్షన్ వైరు. దాన్ని గులాబీ కారుతో ఢీ కొట్టే ముందు.. తన కారుకున్న సత్తా ఏమిటన్న విషయాన్ని మరోసారి పున:పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో జరిగే ప్రతి తప్పునకు భారీగా మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్న విషయాన్ని కేసీఆర్ ఎంత త్వరగా గ్రహిస్తే.. అంత తక్కువ డ్యామేజీతో బయటపడొచ్చు. అందుకు భిన్నంగా మొండితనంతో తన పాత గులాబీ కారును.. పవర్ ఫుల్ హైటెన్షన్ వైరుతో ఢీ కొట్టాలని చూస్తే.. జరిగే నష్టానికి ఆయనదే పూర్తి బాధ్యత. మరేం చేస్తారో చూడాలి.