Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఫాం హౌస్ కేంద్రంగా గ‌తం త‌వ్వేసుకున్నారు!!

తెలంగాణలో కొత్త‌గా ఏర్ప‌డిన కాంగ్రెస్ స‌ర్కారు ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన తొలి అసెంబ్లీ స‌మావేశాల్లో ఇటు అధికార ప‌క్షం కాంగ్రెస్‌, అటు ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్‌లు.. పాత సంగ‌తులు జోరుగా త‌వ్వేసుకుని.

By:  Tupaki Desk   |   16 Dec 2023 3:54 PM GMT
కేసీఆర్ ఫాం హౌస్ కేంద్రంగా గ‌తం త‌వ్వేసుకున్నారు!!
X

తెలంగాణలో కొత్త‌గా ఏర్ప‌డిన కాంగ్రెస్ స‌ర్కారు ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన తొలి అసెంబ్లీ స‌మావేశాల్లో ఇటు అధికార ప‌క్షం కాంగ్రెస్‌, అటు ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్‌లు.. పాత సంగ‌తులు జోరుగా త‌వ్వేసుకుని.. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకున్నాయి. గ‌త ప‌దేళ్ల బీఆర్ ఎస్ పాల‌న‌ను కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేయ‌గా.. గ‌త 50 ఏళ్ల కాంగ్రెస్ పాల‌న‌ను ల‌క్ష్యంగా చేసుకుని బీఆర్ ఎస్ స‌భ్యులు కేటీఆర్‌, హ‌రీష్‌రావులు విరుచుకుప‌డ్డారు. సీఎం రేవంత్ చేసిన ధాటి ప్ర‌సంగానికి దీటుగా వారు కూడా ఎక్క‌డా త‌గ్గ‌కుండా జ‌వాబివ్వ‌డం గ‌మ‌నార్హం.

సీఎం రేవంత్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ హయాంలో రైతులకు వరి వేయవద్దని చెప్పి కేసీఆర్ మాత్రం తన ఫాంహౌస్‌లో 150 ఎకరాల్లో వరి పండించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌కు ఓ న్యాయం.. రైతులకు ఓ న్యాయం ఉంటుందా అని నిలదీశారు .కమీషన్ల పేరుతో రైతులను దోచుకుంటుంటే కేసీఆర్ ఏం చేశార‌ని నిల‌దీశారు. ఫాంహౌస్‌లో పండిన ధాన్యాన్ని మద్దతు ధర ఇచ్చి కొన్నారని.. ప్రైవేట్ కంపెనీల మెడపై కత్తిపెట్టి కేసీఆర్ వడ్లు కొనిపించారని ఆరోపించారు.

ఎంపీగా ఉన్న‌ప్పుడు..

కేసీఆర్ ఎంపీగా పోటీ చేసిన‌ప్పుడు.. పాలమూరు ప్రజలు ఓట్లేసి ఎంపీగా గెలిపిస్తే.. ఆయ‌న చేసిందేమిటని రేవంత్ స‌భ‌లో ప్ర‌శ్నించారు. పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు పూర్తికాలేదన్నారు. గత ప్రభుత్వం రైతు పంట బీమా అమలు చేసి ఉంటే. రైతు ఆత్మహత్యలు ఉండేవి కాదన్నారు. రైతు చావుకు రూ.5 లక్షల వెల కట్టారని.. కానీ, రైతు బతకడానికి ప్రభుత్వం సాయం చేయాలని.. చనిపోయాక కాదని అన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు.. కేసీఆర్ ప్రభుత్వ హత్యలు కాదా అని ప్ర‌శ్నించారు

ఫోన్ ట్యాపింగులు..

గత ప్రభుత్వంలో ఫోన్‌లో కూడా మాట్లాడే స్వేచ్ఛ ఎమ్మెల్యేలకు ఉండేది కాదని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ పై ఉన్న కేసులు ఎన్ని అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చారని.. తెలంగాణ ఉద్యమకారులపైనా కేసులను తొలగించలేదని ఆరోపించారు. రైతు ఆదాయంలో తెలంగాణ 25వ స్థానంలో ఉందన్నారు. విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో లేదని.. ప్రతిపక్షంలో ఉండి కూడా బీఆర్ ఎస్ పార్టీ నాయ‌కుల‌కు సిగ్గులేకుండా ప్రజలను మభ్యపెడుతున్నార‌ని వ్యాఖ్యానించారు.

డ్ర‌గ్స్ కేసులు ఏమైనై!

గ‌త బీఆర్ఎస్ హయాంలో డ్రగ్స్‌పై విచారణ ఎందుకు అటకెక్కిందని సీఎం రేవంత్ ప్ర‌శ్నించారు. సిట్‌ ఎక్కడకు పోయిందన్నారు. హైదరాబాద్‌ డ్రగ్స్‌కి అడ్డాగా మార్చిన ఘ‌న‌త కేసీఆర్ స‌ర్కారుదేన‌ని మండిప‌డ్డారు. వచ్చే పదేళ్లు తాము పాలించబోతున్నామని.. డ్రగ్స్‌తో తెలంగాణలోకి ఎవరు ఎంటరైనా ఊచలు లెక్కపెట్టాల్సిందే అని హెచ్చరించారు. హైదరాబాద్‌కి డ్రగ్స్‌ తీసుకురావాలంటే కాళ్లు వణికేలా చేస్తామ‌ని సీఎం రేవంత్ ప్ర‌క‌టించారు.