వైరల్ టాపిక్... రేవంత్ మార్క్ రాజకీయానికి ఇవి మచ్చుతునకలు!
తన రెండు రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణకు వచ్చిన మోడీ.. తిరిగి ఢిల్లీ వెళ్తున్న మోడీకి వీడ్కోలు పలికేందుకు రేవంత్ వ్యక్తిగతంగా హాజరయ్యారు.
By: Tupaki Desk | 5 March 2024 1:16 PM GMTతెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి తనదైన మార్క్ రాజకీయంతో ముందుకు కదులుతున్నట్లు తెలుస్తుంది. ఫైనల్ గా తెలంగాణ అభివృద్ధి ముఖ్యం.. ఈ విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్నవారితో కలిసి ప్రయాణం చేయడం ధర్మం.. అన్నట్లుగా ఆయన ప్రయాణం సాగుతుందని తెలుస్తుంది. ఇందుకు తాజాగా మోడీతో కలిసి వేదిక పంచుకోవడంతో పాటు ఆయనకు విమానాశ్రయంలో వీడ్కోలు ఇవ్వడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో... పాలిటిక్స్ వేరు, అడ్మినిస్ట్రేషన్ వేరు అనే కోణంలో రేవంత్ ప్రయాణం సాగుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
మోడీకి ఆ మర్యాద ఇచ్చిన రేవంత్..!:
సాధారణంగా దేశ ప్రధాని తమ తమ రాష్ట్రాలకు వస్తున్నారంటే సొంత పార్టీ సీఎంలు నానా హడావిడీ చేస్తారు.. ప్రత్యర్థి పార్టీల సీఎంలు కొంతమంది సరిగా స్పందించకపోగా, కొంతమంది తూతూ మంత్రంగా స్పందిస్తుంటారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోడీ హైదరాబాద్ వస్తే రిసీవింగ్ ఆయన స్థాయిలో ఉండేది కాదు! కొన్ని సందర్భాల్లో ఎవరొక మంత్రిని విమానాశ్రయానికి పంపి, ఒక పుష్పగుచ్ఛం ఇచ్చి వచ్చేవారు.
అయితే రేవంత్ వచ్చాక ఈ ట్రెండ్ పూర్తిగా మారినట్లు కనిపిస్తుంది. ఇందులో భాగంగా... తన రెండు రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణకు వచ్చిన మోడీ.. తిరిగి ఢిల్లీ వెళ్తున్న మోడీకి వీడ్కోలు పలికేందుకు రేవంత్ వ్యక్తిగతంగా హాజరయ్యారు. మోడీకి ఆత్మీయంగా జ్ఞాపికలు అందిస్తూ వీడ్కోలు పలికారు! దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇదే సమయంలో... తెలంగాణలో రేవంత్ సరికొత్తగా ముందుకు కదులుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డికి గుడి!:
తెలంగాణలో మాస్ లీడర్స్ లో రేవంత్ రెడ్డి ఒకరు! ఇంకా గట్టిగా చెప్పాలంటే... 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన అనంతరం రేవంత్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు తెలంగాణ మాస్ లీడర్స్ లో రేవంత్ టాప్ ప్లేస్ లో ఉన్నారన్నా అతిశయోక్తి కాదు. ఈ స్టేట్ మెంట్ బీఆరెస్స్ వర్గాలకు నచ్చకపోయినా ఇది నిజమనే వారే ఎక్కువ! ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి గుడి కట్టబోతున్నారనే మాట ఇప్పుడు వైరల్ గా మారింది.
సూర్యాపేట వనిపాకల గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డికి గుడికట్టబోతున్నట్లు రెడ్డి సంఘం ప్రతినిధి మేడి సంతోష్ ప్రకటించారు. దీనికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం మార్చి 19న జరగనుందని తెలిపారు. దీంతో... ఇప్పుడు ఈ విషయం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
వాస్తవానికి బ్రతికున్న నేతలకు, సినిమా వాళ్లకు గుడి కట్టే సంస్కృతి ఎక్కువగా తమిళనాడులో ఉంటుందనేది తెలిసిన విషయమే. అయితే ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సంస్కృతి ప్రారంభమవుతున్నట్లే కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటీవల ఏపీలోని బాపట్లలో సమంతకు ఒక ఫ్యాన్ గుడి కట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు సీఎం రేవంత్ కు గుడి కట్టబోతున్నారు.
రేవంత్ ను కలిసి బీఆరెస్స్ మరో ఎమ్మెల్యే!:
నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్లుగా బీఆరెస్స్ ను ఖాళీ చేసే పనిలో తెలంగాణ కాంగ్రెస్ ఉందనే కామెంట్లు ఇటీవల చర్చకు వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆరెస్స్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు.. రేవంత్ రెడ్డిని కలుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో... లోక్ సభ ఎన్నికల వేళ ఇది బీఆరెస్స్ కు పెద్ద దెబ్బే అని అంటున్నారు పరిశీలకులు.
ఈ క్రమంలో సోమవారం నాడు భద్రాచలం బీఆరెస్స్ ఎమ్మెల్యే తెల్లం వెంకట రావు.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం మరో ఎమ్మెల్యే రేవంత్ తో భేటీ అయ్యారు. ఇందులో భాగంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య.. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో... లోక్ సభ ఎన్నికల ముందు బీఆరెస్స్ ను ఉక్కిరిబిక్కిరి చేసే పనుల్లో కాంగ్రెస్ నేతలు బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.
ఈ స్థాయిలో తెలంగాణలో రేవంత్ రెడ్డి మార్కు రాజకీయం నడుస్తుంది. తాజాగా తెరపైకి వచ్చిన ఈ మూడు సంఘటనలు అందుకు మచ్చుతునకలుగా చెప్పుకోవచ్చు!