రేవంత్ రెడ్డిలో రెండో కోణం ...నెక్స్ట్ ఆయనేనట ?
ఆడు మగాడ్రా బుజ్జీ అన్న పాపులర్ సినీ డైలాగుని రేవంత్ కి ట్యాగ్ చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
By: Tupaki Desk | 24 Aug 2024 10:30 PM GMTతెలంగాణా రాష్ట్రం ఏర్పాడ్డాక కానీ అంతకు ముందు కానీ ఏ సీఎం సాహసించని విధంగా తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. దాంతో రేవంత్ రెడ్డి మీద నెటిజన్లతో పాటు హైదరాబాద్ పౌరులు అంతా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆడు మగాడ్రా బుజ్జీ అన్న పాపులర్ సినీ డైలాగుని రేవంత్ కి ట్యాగ్ చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
హైదరాబాద్ అంటే పీస్ ఫుల్ సిటీ. కూల్ సిటీ. అన్ని కాలాలలోనూ ఆహ్లాదకరంగా ఉండే సిటీ. అలాంటి హైదరాబాద్ లో ఇపుడు చినుకు పడితే చాలు చిత్తడి అవుతోంది. అంతే కాదు ఏ మాత్రం భారీ వాన కురిసినా నీళ్ళు అన్నీ ఇళ్లలోకే పోతున్నాయి.
ఎటు చూసినా ఆక్రమణల వల్లనే ఇలా జరుగుతోంది అని అందరికీ తెలుసు. చెరువులూ నాలాలు అన్నీ కూడా కబ్జాకు గురి అయిపోతున్నాయి. నీరు పల్లమెరుగు అంటే అది హైదరాబాద్ లో మాత్రం ఉత్త మాటే అవుతోంది. వాన పడితే వచ్చిన నీటికి దారి లేక జలఖడ్గంగా మారి జనం ప్రాణాలనే తీస్తోంది.
ఈ నేపధ్యంలో చాలా అక్రమాలు పెద్దలవి ఉన్నాయని తెలిసి ఏ ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకోలేకపోయింది. దాంతో రేవంత్ రెడ్డి డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. ప్రముఖ హీరో అన్నది కూడా చూడకుండా ఎన్ కన్వెన్షన్ ని కూల్చేశారు. దానికి కారణం కబ్జాలు ఉన్నాయని భావించడమే.
అంతే కాదు ఈ విధంగా ఆయన ఒక గట్టి సందేశం పంపించారు. ఎవరైనా ఎలాంటి ఆక్రమణలు చేయాలనుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో కుదరదు అన్నదే ఈ సందేశం. అంతే కాదు రేవంత్ రెడ్డి ఎన్ కన్వెన్షన్ విషయంలో దాదాపుగా పదేళ్ల నుంచి పోరాడుతున్నారు. ఆయన కేసీఆర్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉండడంతో సభలోనే ప్రస్తావించారు. అది కేసీఆర్ సర్కార్ వల్ల కాలేదు. అందుకే రేవంత్ రెడ్డి వల్లనే జరిగింది అని అంటున్నారు.
మరో వైపు చూస్తే ఎవరూ చేయలేరు అన్న పనిని చేసి చూపించడమే పనిగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి తాజాగా మరింత మందిని హైడ్రా లిస్ట్ లో పెట్టారు అని అంటున్నారు అందులో బీఆర్ఎస్ కి చెందిన మాజీ మంత్రి మల్లారెడ్డి పేరు కూడా ఉందని అంటున్నారు.
ఆయన కూడా చెరువులు నాలాలు అన్నీ ఆక్రమించే వర్శిటీలు ఆసుపత్రులు వంటివి కట్టారని ఆరోపణలు ఉన్నాయి. దాంతో హైడ్రా కన్ను ఆ వైపు ఉందని చెబుతున్నారు. అంతే కాదు మరో బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వరరెడ్డి మీద కేసు నమోదు అయింది అని అంటున్నారు. ఆయనకు సంబంధించిన ఒక యూనివర్శిటీని బఫర్ జోన్ లోనే నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి.
ఇలా చూస్తే చాలా మంది ఉన్నారని అంటున్నారు. ఎంతటి వారు అయినా తగ్గేది లేదు అన్నట్లుగా రేవంత్ రెడ్డి ఇస్తున్న ఈ సందేశం భాగ్యనగరానికి భాగ్యం తెచ్చేదిలా ఉంటుందని అంటున్నారు. గత కొన్నేళ్ళుగా హైదరాబాద్ చుట్టు పక్కనా దురాక్రమణలతో వానొస్తే నరకం చూస్తున్న వారికి ఇక మీదట కొత్త అనుభవం కనిపిస్తుంది అని అంటున్నారు.
అంతే కాదు హైదరాబాద్ అభివృద్ధి మీదనే ఇప్పటిదాకా అందరు ముఖ్యమంత్రులు దృష్టి పెట్టారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం అభివృద్ధితో పాటు ఆక్రమణల మీద కూడా పెట్టారని అంటున్నారు. ఈ రెండవ కోణంలో ఎవరూ చూడలేదు కాబట్టే రేవంత్ ఈజ్ వెరీ స్పెషల్ అని అంతా అంటున్నారు. ఇపుడు హైదరాబాద్ లోని మధ్యతరగతి, సగటు జీవులు ఉద్యోగ వర్గాల అభిమానాన్ని ఒక్కసారిగా రేవంత్ రెడ్డి సాధించారు అని అంటున్నారు.