Begin typing your search above and press return to search.

సీఎం రేవంత్ కు చుక్కలు చూపించిన ఇండిగో

ముఖ్యమంత్రి అన్నంతనే ప్రత్యేక విమానంలో ప్రయాణించటం ఇటీవల కాలం ఎక్కువైంది

By:  Tupaki Desk   |   18 March 2024 4:36 AM GMT
సీఎం రేవంత్ కు చుక్కలు చూపించిన ఇండిగో
X

ముఖ్యమంత్రి అన్నంతనే ప్రత్యేక విమానంలో ప్రయాణించటం ఇటీవల కాలం ఎక్కువైంది. ముఖ్యమంత్రి టైం చాలా విలువైనదని.. వారి సమయాన్ని వేస్ట్ కాకుండా ఉండేందుకు ప్రత్యేక విమానాల్లో ప్రయాణించాలన్నది పాయింట్. ప్రత్యేక విమానం పేరుతో భారీగా ఖర్చు చేస్తున్నారన్న విమర్శల్ని కేసీఆర్, చంద్రబాబు అప్పట్లో ఎదుర్కొన్నారు. సచివాలయానికి రాని ఆయన ఎక్కువగా తన ఇంట్లోనూ.. ఫాంహౌస్ లోనూ కాలం గడిపేవారు. అదేమని ప్రశ్నిస్తే ఆయన చాలా సీరియస్ అయ్యేవారు. ముఖ్యమంత్రి అన్నవారు సచివాలయానికి ఎందుకు రావాలి? సీఎం ఎక్కడ ఉంటే అదే సెక్రటేరియట్ అంటూ కొత్త వాదనను వినిపించారు.

ఆ విషయాన్ని అలా వదిలేస్తే.. ప్రత్యేక విమానాన్ని వాడే విషయంలో కేసీఆర్.. తర్వాతి కాలంలో ముఖ్యమంత్రిగా తెర మీదకు వచ్చిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం ప్రత్యేక ఫ్లైట్ ను వినియోగించటం తెలిసిందే. కట్ చేస్తే.. వీరికి భిన్నంగా వ్యవహరిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి. ప్రత్యేక సందర్భాల్లో తప్పించి చాలా వరకు సాధారణ ప్రయాణికులతో కలిసి ప్రయాణం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన సమస్యల్ని ఎదుర్కొంటున్నారు.

తాజాగా ఆయనకు ఒక చేదు అనుభవం ఎదురైంది. సాంకేతిక కారణాలతో సీఎం రేవంత్ ప్రయాణిస్తున్న ఇండిగో విమానం రన్ వే మీద గంటన్నర పాటు ఆగిపోవటం.. అందులోనే సీఎం రేవంత్ ఉండిపోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు ముంబయికు వెళ్లాల్సి ఉంది. ఇందుకోసం ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ముంబయికి వెళ్లే ఇండిగో ఫ్లైట్ లో ప్రయాణించారు.

ఆయన ఎక్కిన ఫ్లైట్ ఆదివారం మధ్యాహ్నం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన క్రమంలో ఇంజిన్ లో సాంకేతిక లోపాన్ని గుర్తించారు. వెంటనే పైలట్ ను అప్రమత్తం చేసి అధికారులకు సమాచారం అందించారు. దీంతో టేకాఫ్ కు అనుమతి లభించలేదు. దీంతో విమానాన్ని వెనక్కి తీసుకొచ్చారు. ప్రయాణికుల్ని కిందకు దించకుండానే గంటన్నర పాటు విమానానికి రిపేర్లు చేసిన అనంతరం సాయంత్రం 4 గంటలకు విమానాన్ని టేకాఫ్ కు అనుమతి ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం ఈ ఫ్లైట్ మధ్యాహ్నం 2.30 గంటలకు టేకాఫ్ తీసుకోవాల్సి ఉంది.