ఒకే రోజు గజ్వేల్ లో రేవంత్.. కొడంగల్ లో కేసీఆర్.. ఒకరి ఇలాఖాలో ఇంకొకరు
సీఎం కేసీఆర్.. తప ప్రత్యర్థి అయిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ లో ప్రచార సభలో పాల్గొన్నారు
By: Tupaki Desk | 23 Nov 2023 9:38 AM GMTఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రి.. మరొకరు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు.. ఇద్దరూ బద్ద శత్రువులు.. ఒకరి ఇలాఖాలో మరొకరు.. యాక్సిడెంటల్ గానే అయినా.. ఎన్నికల ప్రచారంలో తీవ్ర ఆరోపణలు.. వాస్తవానికి ఇది వేర్వేరు రోజుల్లో జరిగి ఉంటే చర్చనీయాంశమే కాదు. పట్టించుకునేవారు కాదు. కానీ, ఒకే రోజు ప్రత్యర్థి కోటలోకి చొరబడి ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. బుధవారం తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చోటుచేసుకుందీ సీన్.
ఆయన అక్కడ.. ఈయన ఇక్కడ
ఓ ప్రవాహంలా సాగుతున్న తెలంగాణ ఎన్నికల ప్రాచరంలో బుధవారం అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. సీఎం కేసీఆర్.. తప ప్రత్యర్థి అయిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ లో ప్రచార సభలో పాల్గొన్నారు. రేవంత్ ను భూ కబ్జాదారు అంటూ నిందించారు. అసలు కాంగ్రెస్ గెలిస్తేనే కదా..? రేవంత్ సీఎం అయ్యేది అంటూ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఆయన ఆంధ్రా నాయకుల వద్ద ఉన్నారని ధ్వజమెత్తారు. ఉద్యమకారులపైకి తుపాకీతో బయల్దేరారని..ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కొనుగోలుకు యత్నించి జైలుకు వెళ్లారని విమర్శించారు. కాగా, ఇదే సమయంలో రేవంత్ రెడ్డి.. సీఎం కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్ లో బహిరంగ సభలో పాల్గొన్నారు. వేల ఎకరాలు ఆక్రమించారని.. లక్ష కోట్లు అవినీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. రైతులు పండించిన ధాన్యం రూ.1,500కు అమ్మితే, కేసీఆర్ ఫాంహౌస్ లో పండించిన ధాన్యం ధర రూ.4,250 పలుతుందని ఆరోపించారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా, పాలమూరు ఎంపీగా న్యాయం చేయలేదని.. వారు ఓడించబోతే గజ్వేల్ కు వచ్చారని పేర్కొన్నారు.
నాడు ఒకరికొకరు..
కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా 2009 ఎన్నికల్లో గెలిచారు. నాడు మహా కూటమిలో భాగంగా టీడీపీ, టీ(బీ)ఆర్ఎస్, వామపక్షాలు పొత్తు పెట్టుకున్నాయి. కేసీఆర్ ఎంపీగా మహబూబ్ నగర్ నుంచి బరిలో దిగగా, ఆ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి టీడీపీ టికెట్ పై పోటీ చేసి గెలిచారు. వాస్తవానికి అంతకుముందు వరకు (2004-09) కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా ఉన్నారు. ఆ ఎన్నికలకు అనూహ్యంగా పాలమూరును ఎంచుకున్నారు. మరోవైపు రేవంత్ 2007 స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నెగ్గారు. అనంతరం టీడీపీలో చేరారు. 2009లో కొడంగల్ అభ్యర్థిగా పోటీ చేశారు. నాడు కేసీఆర్, రేవంత్ ఒకే కూటమిలో ఉన్నట్లు. ఒకరికొకరు ప్రచారం కూడా చేసుకున్నారు. అంటే.. ఎమ్మెల్యేగా రేవంత్ ను గెలిపించాలని కేసీఆర్, ఎంపీగా కేసీఆర్ ను గెలిపించాలని రేవంత్ కోరారు. కానీ, నేడు పరిస్థితులు తారుమారయ్యాయి.
ఇద్దరు అభ్యర్థులు కారు
2014 నాటికి పరిస్థితులు మారాయి. కేసీఆర్ ఎమ్మెల్యేగా గజ్వేల్ నుంచి పోటీ చేశారు. రేవంత్ కొడంగల్ నుంచి మరోసారి బరిలో దిగారు. కేసీఆర్ సీఎం కాగా.. రేవంత్ ప్రతిపక్ష టీడీపీ సభ్యుడిగా అసెంబ్లీలో సై అంటే సై అనే స్థాయికి వచ్చారు. 2018లో మాత్రం కొడంగల్ లో రేవంత్ ఓడిపోయారు. 2019లో మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా గెలిచారు. కాగా, ప్రస్తుత ఎన్నికల్లో గజ్వేల్ నుంచి కేసీఆర్ మూడోసారి బరిలో దిగారు. రేవంత్ కూడా మూడోసారి కొడంగల్ బరిలో నిలిచారు. గతంలో కంటే ఈసారి ప్రత్యర్థులుగా తీవ్ర స్థాయిలో తలపడుతున్నారు. మరోవైపు బుధవారం కేసీఆర్ కొడంగల్ రాగా.. రేవంత్ గజ్వేల్ వెళ్లారు. ఒకరి నియోజకవర్గాల్లో మరొకరు సవాల్ చేసినట్లుగా జరిగిన ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. అయితే, గజ్వేల్ లో రేవంత్, కొడంగల్ లో కేసీఆర్ అభ్యర్థులు కారు. కేసీఆర్, రేవంత్ కామారెడ్డిలో ముఖాముఖి తలపడుతున్న సంగతి తెలిసిందే.